Table of Contents
Mirage Review Telugu.. ఏ పాత్ర స్వభావమేంటో, ప్రేక్షకులకు అర్థం కాదు. చివరి దాకా, సినిమాలోని పాత్రలపై ప్రేక్షకులకి అనుమానాలు కలుగుతూనే వుంటాయి.
ఎప్పెడెలా ఏ పాత్రధారి ఎలా మారిపోతాడో ఊహించలేం. బహుశా, ఆయా పాత్రల గురించి అనుకున్నప్పుడు, దర్శకుడు కూడా ఊహించి వుండడేమో.
సినిమా చూస్తున్నంతసేపూ, దర్శకుడు తనకిష్టమొచ్చినట్లు ఆయా పాత్రల స్వభావాల్ని మార్చేశాడేమో అనిపిస్తుంటుంది.
Mirage Review Telugu.. రైలు ప్రమాదం.. ఫైనాన్షియల్ ఫ్రాడ్..
ఓ రైలు ప్రమాదంతో కథ మొదలవుతుంది.. ఫైనాన్షియల్ ఫ్రాడ్ వ్యవహారంలో ఓ హార్డ్ డిస్క్ మాయమవుతుంది. చనిపోయిన వ్యక్తి, ఆ హార్డ్ డిస్క్ ఎక్కడ పెట్టాడంటూ, రకరకాల వ్యక్తులు వెతుకుతుంటారు.
హీరోయిన్, ఆ హార్డ్ డిస్క్‌ని కనిపెట్టి, ప్రాణభయం నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. ఆ హీరోకి ఓ స్నేహితురాలు వుంటుంది. ఓ మీడియా ప్రతినిథి, హీరోయిన్‌కి సాయం చేసేందుకు ముందుకొస్తాడు.
ఓ పోలీస్ ఉన్నతాధికారి కూడా, ఆ హార్డ్ డిస్క్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఓ విలన్, హార్డ్ డిస్క్ కోసం ఎవర్నయినా చంపడానికి వెనుకాడడు.
ఇంతకీ, చనిపోయిన వ్యక్తి ఎవరు.? హార్డ్ డిస్క్ దొరికిందా.? లేదా.? అది తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.
ఓటీటీలో.. అందుబాటులో..
‘మిరాజ్’ ఓటీటీలో అందుబాటులో వుంది. సోషల్ మీడియా వేదికగా, ‘మిరాజ్’ ట్విస్టుల గురించే చర్చ జరుగుతోంది. ట్విస్టులన్నీ సోషల్ మీడియాలో రివీల్ అయిపోయాయ్.
సో, ఇక్కడ దాపరికం ఏమీ లేదు. విదేశాల్లో చిన్నప్పుడే, తన కుటుంబాన్ని కోల్పోతుంది హీరోయిన్. తన సోదరిపై అఘాయిత్యం జరుగుతుంది.
ఆ అఘాయిత్యానికి పాల్పడేవారిని వెతుక్కుంటూ వస్తుంది హీరోయిన్. మారు వేషంలో తిరుగుతుంటాడు, అందులో ఓ నిందితుడు. అతనే, హార్డ్ డిస్క్ వ్యవహారంలో కీలకం.
ఇంకొకడు, ఆమె చుట్టూనే వుంటూ.. ఓ మాయా ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు. ఒక్కో ట్విస్టూ విడిపోతూ వుంటుంది.. ఇంకెన్ని ట్విస్టులున్నాయో అనిపిస్తుంది.
ట్విస్టులు తొలుత ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తాయి.. కానీ, సినిమా ఎంతసేపటికీ ముందుకు వెళ్ళదు. సాగుతూనే వుంటుంది. సినిమా అయిపోయాక, ‘హమ్మయ్య..’ అనిపిస్తుంది.
మనకి తెలిసినవాళ్ళు.. ఆ ఇద్దరే.!
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ.. అన్నీ చక్కగా కుదిరాయి. నటీనటుల నటనా ప్రతిభ గురించి మాట్లాడుకోవాలంటే, మనకు తెలిసిన పాత్రలు రెండే.. అందులో ఒకరు అపర్ణ బాలమురళి.
ఇంకొకరు, చాలా తెలుగు సినిమాల్లో మనకు బాగా అలవాటైపోయిన సంపత్ రాజ్.. పోలీసు ఉన్నతాధికారి పాత్రలో నటించాడు. ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఆసిఫ్ అలీ బాగా చేశాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధిలో ఓకే అనిపిస్తారు.
ముందే చెప్పుకున్నట్లు, ‘చిన్నారిపై అఘాయిత్యం’ అనేది కోర్ పాయింట్.. దాని చుట్టూ, ట్విస్టులతో కూడిన స్క్రిన్ ప్లే, దానికి ఫైనాన్షియల్ ఫ్రాడ్ లింక్ పెట్టాడు దర్శకుడు.
Also Read: బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
సినిమా ఇంకాస్త వేగంగా నడిపించి వుంటే బావుండేది. కథ అస్సలు ముందుకు కదలదు. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయంతే. ఇదే పెద్ద లోపం.
కాకపోతే, ట్విస్టుల్ని ఎంజాయ్ చేసేవాళ్ళకి.. ఒకింత ఇంట్రెస్ట్ కలగడం సహజం. ప్రతి పాత్రనీ చివరి వరకూ అనుమానిస్తూనే వుంటాడు ప్రేక్షకుడు.
టైమ్ పాస్ కోమే అయితే, ఓటీటీలో ఎంచక్కా ఓసారి చూసెయ్యొచ్చు. ట్విస్టులు సోషల్ మీడియాలో రివీల్ అయిపోయాక, సినిమా చూస్తే… అస్సలు ఇంపాక్ట్ వుండదు.
