అఖిల్ సార్థక్ నుంచి నానా రకాల అక్షింతలూ వేయించుకున్నా, మోనాల్ గజ్జర్‌లో మార్పు రాలేదు (Monal Gajjar Supports Akhil Sarthak). నిజానికి, అఖిల్ బిగ్‌హౌస్‌లో అందర్నీ తన అవసరాలకు తగ్గట్టుగా వాడేస్తుంటాడు. గంగవ్వ, మెహబూబ్, సోహెల్.. మోనాల్.. ఇలా ఎవర్నయినాసరే, తన గెలుపు కోసం అడ్డగోలుగా వాడేస్తాడు అఖిల్.
అది తెలిసీ, మోనాల్ మళ్ళీ అఖిల్‌కే ఎందుకు సపోర్ట్ చేసింది.? ‘ఛీ.. పో..’ అంటూ చీదరించుకున్నా మోనాల్, మళ్ళీ అఖిల్ వైపుకే ఎందుకు మొగ్గు చూపినట్లు.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. ఇందులో అర్థం కావడానికేమీలేదు.. బహుశా ఇదంతా బిగ్‌బాస్ అనధికారిక ఆదేశాల మేరకే జరిగి వుండొచ్చేమనన్నది కొందరి అనుమానం.
ఆ అనుమానాల్ని పక్కన పెడితే, అవినాష్ కూడా మోనాల్ విషయంలో నిన్న ‘అతి’ చేశాడు. బహుశా ఈ ‘అతి’ విషయంలో అవినాష్ కంటే అఖిల్ కాస్త బెటర్ అని మోనాల్ భావించి వుండొచ్చు. కానీ, మోనాల్‌తో అవినాష్ చాలా జెన్యూన్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ పండించాడు. ఇద్దరి మధ్యా మంచి కెమిస్ట్రీ కూడా పండింది.
అయినాగానీ, అవినాష్‌ని జస్ట్ కమెడియన్‌గానే మోనాల్ గజ్జర్ చూసి వుండొచ్చు. ఎలాగైతేనేం, మోనాల్ వెన్నుపోటు పొడిచేసినా.. అవినాష్ ‘బిగ్‌బాస్ ఎన్నికల్లో’ గెలిచాడు. ఫ్రెండ్ అరియానాతోపాటు, అబిజీత్ అలాగే హారికల మనసుల్ని గెలుచుకున్నాడు.
అవినాష్ గెలుపులో సింహభాగం అరియానాకే దక్కుతుందన్నది నిర్వివాదాంశం. అవినాష్‌ని మోటివేట్ చేసింది.. అవినాష్ ప్రచారం చాలా బాగా జరగడంలో అరియానా కీలక పాత్ర పోషించింది. సూటిగా సుత్తి లేకుండా అబిజీత్, సింగిల్ పాయింట్‌తో అవినాష్‌కి ఓటేశాడు.
ప్రచారం తీరు నచ్చిందంటూ కితాబులిచ్చాడు. హారిక మాత్రం, చాలా హంగామా చేసింది. అఖిల్ మీద ప్రేమ చాటుతూ, అవినాష్‌కి ఓటేసింది. ఇది గేమ్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌గా చెప్పుకోవచ్చు.
అఖిల్ అన్ని తిట్టినా, మోనాల్ అతనికే ఓటేసిందిగానీ.. అఖిల్ నుంచి షరామామూలుగానే మోనాల్‌కి నిలదీతలు ఎదురయ్యాయి. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడంలో అఖిల్ తర్వాతే ఎవరైనా.. ఈ సీజన్‌కి సంబంధించి.. అన్నది బిగ్ బాస్ వీక్షకులు చెబుతున్నమాట.