Table of Contents
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపలులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని షాక్‌కి గురిచేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వుండే విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద దాడి జరగడమంటే ఆషామాషీ విషయం కాదు.
దాడి చేసిన వ్యక్తి ఎవరు?
శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వైఎస్ జగన్ అభిమానినంటూ సందడి చేసిన శ్రీనివాస్, వైఎస్ జగన్‌తో సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అంతలోనే, జగన్‌పై దాడికి యత్నించాడు ఆ వ్యక్తి. జగన్ అప్రమత్తం కావడంతో కత్తి, జగన్ భుజంలోకి దూసుకుపోయింది. లేదంటే, పెద్ద ప్రమాదమే సంభవించి వుండేది. అయితే కత్తి పెద్దది కాకపోవడం, కోళ్ళ పందాల కోసం వినియోగించే కత్తి కావడంతో పెను ప్రమాదం తప్పిందని వైసీపీ నేతలు అంటున్నారు.
విమానాశ్రయంలోకి కత్తి ఎలా వచ్చింది.?
విమానాశ్రయమంటే, భద్రత చాలా కట్టుదిట్టంగా వుంటుంది. పైగా విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కూడా వుంది. ఇంత పెద్ద విమానాశ్రయంలో, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి వుండదు. అందునా, వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత కావడంతో, ఆయనకు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లుంటాయి. ఇవేవీ, నిందితుడికి అడ్డంకి కాలేదు. కోళ్ళ పందాల కోసం వినియోగించే కత్తిని ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా అనుమతించారన్నది చర్చనీయాంశంగా మారింది. పైగా, ప్రతిపక్ష నేత వద్దకు ఓ వ్యక్తి అంత తేలిగ్గా ఎలా వచ్చేయగలుగుతాడు? అనేదీ అంతుబట్టడంలేదు.
భద్రతా వైఫల్యానికి పరాకాష్ట
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద జరిగిన దాడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్ కొన్ని నెలలుగా జనంలోనే వున్నారనీ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోలేదనీ, భద్రత ఎక్కువగా వుండే విమానాశ్రయంలో దాడి జరగడం పట్ల తమకు చాలా అనుమానాలున్నాయని అంటోంది వైఎస్సార్సీపీ. ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, ఈ దాడి వెనుక పెద్ద కుట్ర వుందని ఆరోపించారు.
గతంలోనూ విశాఖ విమానాశ్రయంలో వివాదం
ప్రత్యేక హోదా కోసం విశాఖ వేదికగా యువత గతంలో ఆందోళన చేసింది. ఈ కార్యక్రమానికి మద్దతిస్తూ వైఎస్ జగన్, హైద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్ళారు. అయితే అక్కడ జగన్‌ని ఎయిర్పోర్ట్ సిబ్బంది రన్ వే మీదనే అడ్డుకోవడం, సరైన భద్రత కల్పించకపోవడం అప్పట్లో వివాదాస్పదమయ్యింది. ఎయిర్పోర్ట్ సిబ్బందితో జగన్ వాగ్వాదం, ఈ క్రమంలో స్వల్ప తోపులాట వెరసి.. జగన్ విషయంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది వైఖరి విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడూ అదే విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరగడం గమనార్హం.
కత్తికి విషం పూసారా.?
వైఎస్ జగన్ మీద జరిగిన దాడి పట్ల అనుమానం వ్యక్తం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజా, దాడికి ఉపయోగించిన కత్తికి విషం పూసినట్లుందని ఆరోపించారు. మరోపక్క, గాయం తీవ్రతపై వైద్యులు ఆరా తీస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలు ఎందుకు దాడి చేశాడు.? ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయాల్ని ఆరా తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నిందితుడ్ని గుర్తించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రపదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు.