New Virus Threat.. ఏం బతుకు రా నీది.? అని సరదాగా ఆటపట్టిస్తుంటాం స్నేహితుల్ని.. తీవ్రంగా తప్పుపడుతుంటాం విరోధుల్ని. మరి, మనల్ని మనం అలా అనుకునే పరిస్థితి వస్తే.? మొత్తంగా మానవాళి ఇదే తీరులో అసహనం వ్యక్తం చేయాల్సి వస్తే.? ఆరోజు వచ్చేసినట్టే కనిపిస్తోంది.
కొత్త వైరస్ వచ్చేస్తోందట. దాని పేరు నియో కోవ్ అట. అదేనండీ సార్స్ కోవ్ కుటుంబం నుంచి కోవిడ్ 19 వచ్చినట్లే, ఈ నియా కోవ్ కూడా వస్తోందిట. ఎక్కడో సౌతాఫ్రికాలోని గబ్బిలాల్లో ఈ వైరస్‌ని గుర్తించారట. అలాగని చైనాలోని ‘వుహాన్’ శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని హెచ్చరించారు. ఇదే వుహాన్, కోవిడ్ 19 పుట్టిల్లుగా చెప్పబడుతున్న సంగతి తెలిసిందే.
తుమ్మితే ఊడిపోయే ముక్కు.!
అదిగదిగో భారీ గ్రహశకలం.. భూమి వైపుకే దూసుకొస్తోంది.! ఇదిగిదుగో సౌర తుపాను భూమ్మీదకు దండెత్తబోతోంది.! ఇలా నిత్యం మీడియాలో ‘వండి వడ్డించబడుతున్న’ కథనాల్ని చూస్తున్నాం. భయం.. భయం.. ఈ భయం చుట్టూనే వ్యవహారమంతా నడుస్తోంది.

థ్రిల్లర్ సినిమాల్ని చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు. అదో పైశాచిక ఆనందం. అలాగే టీవీల్లో వచ్చే క్రైమ్ స్టోరీస్‌కి అభిమానులెక్కువ. వైరస్సులనీ, గ్రహ శకలాలనీ.. వాటి పేరుతో చావు భయం పుట్టించే కథనాలకీ డిమాండ్ చాలా చాలా ఎక్కువే. అద్గదీ అసలు సంగతి.
నిజమే, మనిషి జీవితమంటేనే తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది. ఇరవయ్యేళ్ళ కుర్రాడు సరదాగా స్నేహితులతో ఆడుతూ పాడుతూ.. అనూహ్యంగా కుప్ప కూలిపోయి చనిపోవడం గురించి చాలా సందర్భాల్లో వింటుంటాం. అంతకన్నా ప్రమాదకరమైనదైతే కాదు కదా వైరస్ అయినా, ఇంకోటైనా.. అనేవారూ లేకపోలేదు.
New Virus Threat.. అసలు మహమ్మారి ఇదీ.!
ఏదిఏమైనా, వైరస్సులతో పొంచి వున్న ప్రమాదం కంటే.. వైరస్సులను మించిన వార్తలతో ఎక్కువ ప్రమాదం పొంచి వుందన్నది నిర్వివాదాంశం. జబ్బులున్నాయ్.. ప్రమాదాలున్నాయ్. ఆశ క్యాన్సర్ వున్నోడిని కూడా బతికించొచ్చు.. భయం వున్నోడ్ని అల్సర్ కూడా చంపేయొచ్చు.
Also Read: స్పూర్తి ముద్ర: మొగిలయ్యను వరించిన ‘పద్మం’.!
కొత్త వైరస్ వస్తే, కొత్త చికిత్సలూ వస్తాయ్. గ్రహ శకలాలే దూసుకొస్తే, దానికి ఏం చేయాలన్నదానిపై శాస్త్రవేత్తలూ పరిశోధనలు చేస్తూనే వున్నారు. భూమ్మీదకి మనం ఎప్పుడెలా వచ్చామో మనకే తెలియదు. ఎప్పుడెలా పోతామో కూడా మనకీ తెలియదు. వున్నన్నాళ్ళూ ఎంజాయ్ చేయడమే.!