Table of Contents
Nirbhaya Disha.. దేశ రాజధాని ఢిల్లీలో ఓ బస్సులో ఓ యువతిపై అత్యంత పాశవికంగా దాడి జరిగింది.
మృత్యువుతో కొన్ని రోజులు పోరాడి మృతి చెందింది ఆ యువతి. ఆ ఘటనకు ‘నిర్భయ’ అని పేరు పెట్టుకున్నాం. నిర్భయ చట్టాన్నీ తీసుకొచ్చాం.!
కానీ, నిర్భయ తర్వాత ‘దశ’ ఘటన జరిగింది. ‘దిశ’ పేరుతో కూడా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాం. నిర్భయ నుంచి దిశ వరకూ ఎంతోమంది యువతులు బలైపోయారు.. బలైపోతూనే వున్నారు.
నిర్భయకి ముందూ.. దిశ తర్వాత.. ఇదొక ప్రవాహం.! అత్యంత బాధాకరమైన ప్రవాహం. ప్రభుత్వాల వైఫల్యమా.? సమాజంలో పెరిగిపోతున్న రాక్షసత్వమా.? ఈ దారుణాలకి కారణమేంటి.?
Nirbhaya Disha.. నిర్భయ.. దిశ.. ఇంకా లెక్కలేనన్ని.!
ఇంట్లో తల్లి సరిగ్గా తన కూతుర్ని చూసుకుంటే ఈ సమస్యలు రావంటూ బాధ్యతగల మహిళా ప్రజా ప్రతినిథి, పైగా హోంమంత్రి వ్యాఖ్యానించడం.. రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట.
అక్కడా ఇక్కడా అని కాదు. దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. పొద్దున్న పేపర్ తిరగేసినా, న్యూస్ ఛానళ్ళు మార్చినా.. కుప్పలు తెప్పలుగా మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన ఘటనలు కనిపిస్తాయి.

నిర్భయ కేసులో నిందితుల్ని కోర్టుల చుట్టూ తిప్పీ తిప్పీ.. చివరికి ఒకడికి ‘మైనర్’ అన్న కోణంలో ‘వెసులుబాటు’ కల్పించారు. ‘దిశ’ ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌కి గురయ్యారు. ఆ దిశ ఎన్‌కౌంటర్ బూటకమని ఇప్పుడు తేలింది.
రోగమెక్కడుంది.? చికిత్స ఎక్కడ చేస్తున్నాం.?
తక్షణ న్యాయం కూడా సత్ఫలితాలనివ్వడంలేదు.. చట్ట పరంగా శిక్షలు విధిస్తున్నాగానీ మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. కానీ, మహిళల భద్రత పేరుతో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వున్నాయ్.
రాజకీయ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, నేరచరితులు రాజకీయాల్లో కీలక పదవుల్లో వుండడం.. ఇవన్నీ వ్యవస్థలిలా నాశనమవడానికి కారణం.
రోగానికి మందు వేయాలంటే, అసలు రోగమెక్కడుందో కనుగొనాలి కదా.? రోగం ఓ చోట వుంటే, మందు ఇంకో చోట వేస్తే.. ఇదిగో ఫలితాలు ఇలాగే తగలబడతాయ్.!
కొత్త చట్టాలు.! పబ్లిసిటీ స్టంట్లు.!
కొత్త చట్టాలు అవసరం లేదు.. ఇలాంటి నేరాల్లో దోషుల్ని శిక్షించేందుకు. పాత చట్టాలతోనే నేరస్తుల్ని కఠినంగా శిక్షించే అవకాశముంది.
కానీ, కొత్త చట్టాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసుకోకపోతే, అధికారంలో వున్నవారు తమకు రాజకీయ మనుగడ వుండదని భావిస్తున్నారు.. అదే అన్ని అనర్ధాలకూ కారణమవుతోంది.
Also Read: కార్పొ‘రేటు’ కథ.. కూతుర్ని చెల్లెలిగా ఏమార్చి ప్రాణం తీసింది.!
శిక్షించడం.. కూడా ఓ పబ్లిసిటీ స్టంట్‌గా మారిపోయింది. దాని చుట్టూ మళ్ళీ చాలా రాజకీయం నడుస్తోంది. శవ రాజకీయం అనాలా.? ఇంకేమన్నా అనాలా దీన్ని.?
పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం, న్యాయస్థానాలపై రాజకీయ కుట్రలు.. ఇవి ఆపేస్తే, దేశం బాగుపడుతుంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?