నోయెల్ సీన్ జైలుకి వెళ్ళాడు. జైల్లో రాగుల్ని నోయెల్ మరపడితే, తద్వారా వచ్చిన పిండితో రాగి జావ మాత్రమే వండి అతనికి ఇవ్వాల్సి వుంటుంది మిగతా హౌస్ మేట్స్. అది కాకుండా ఏదో ఒక ‘పండు’ ఆయనకు ఇచ్చేందుకు బిగ్‌బాస్ (Noel Sean Divi Vadthya Bigg Boss Telugu 4) అనుమతిచ్చాడు. దాదాపు ఇలాంటి సీన్, గత సీజన్‌లో కూడా కన్పించింది.
‘చిప్పకూడు’ అన్నట్లుగానే గత సీజన్‌లో కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే అది కాస్తా విమర్శలకు తావిచ్చింది. ఇంతకీ, నోయెల్ సీన్ (Noel Sean) ఎందుకు జైలుకు వెళ్ళాడు.? అంటే, ‘ఉక్కు’ టాస్క్ సందర్భంగా, హ్యామన్స్ బృందం, రోబోట్స్ బృందం చేతిలో ఓడిపోవడం, ఈ క్రమంలో హ్యామన్స్ బృందం నుంచి వరస్ట్ పెర్ఫామర్‌గా నోయెల్ సీన్ పేరు ఎంపిక కావడమే. నిజానికి నోయెల్ తనకు తానుగా నామినేట్ చేసుకున్నాడు.
కొందరు దివి (Divi Vadthya) పేరు చెప్పి, చివరి నిమిషంలో మనసు మార్చుకుని, నోయెల్‌ని వరస్ట్ పెర్ఫామర్‌గా తేల్చారు. హ్యామన్స్ బృందానికి చెందిన దివిని, అదే బృందానికి చెందిన నోయెల్ ఇంట్లోకి పంపించడంతో, ఇంట్లోని రోబోట్స్ ఆమెను బంధించి బలవంతంగా ఛార్జింగ్ పెట్టేసుకున్నారు. అలా దివి, హ్యామన్స్ బృందం ఓడిపోవడానికి కారణమయ్యింది.
తన కారణంగా హ్యామన్స్ బృందం ఓడిపోయిందంటూ దివి కంటతడి పెట్టింది. ఆమెను అమ్మ రాజశేఖర్ ఓదార్చాడు. మరోపక్క, అమ్మ రాజశేఖర్ (హ్యామన్స్ బృంద సభ్యుడు) నుంచి దొంగతనంగా ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు అవినాష్. ఈ నమ్మక ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోనంటూ అమ్మ రాజశేఖర్ కాస్సేపు ఫన్ క్రియేట్ చేశాడు. ఓవరాల్‌గా టాస్క్ తాలూకు సెగలు కొంతమేర తగ్గాయి.
అయితే, అభిజిత్ (రోబోట్స్ బృందం) వెన్నుపోటుని మోనాల్ గజ్జర్ జీర్ణించుకోలేకపోతోంది. అభిజిత్ ‘స్మార్ట్’గా ఆలోచించినా, దాన్ని నమ్మకద్రోహంగానే చాలామంది చూస్తున్నారు. బిగ్ బాస్ టాస్క్‌లలో ఇలాంటివన్నీ సహజమే. అయితే, దివిని కిడ్నాప్ చేసి, ఆమెను బలవంతంగా ‘నొక్కి పెట్టిన’ రోబోట్స్ బృందంలోని కంటెస్టెంట్స్‌ని బిగ్ బాస్ జైలుకు పంపించి వుండాల్సింది.
టాస్క్‌లో కొంత విధ్వంసం చోటు చేసుకోవడం, హద్దులు మీరిన మాటలు తెరపైకి రావడం.. వీటన్నిటికీ శిక్ష లేకపోవడం ఆశ్చర్యకరం. చివరికి ఓ సమయంలో గంగవ్వ కూడా మాటలు తూలేసింది. లాస్య – మోనాల్ మధ్య కూడా కొంత గలాటా చోటు చేసుకుని, తోపులాటదాకా వెళ్ళింది.
ఇవేవీ బిగ్‌బాస్ కన్సిడర్ చేయలేదంటే, ‘భౌతిక దాడుల్ని’ ఈ సీజన్‌లో కొంతవరకు అనుమతించినట్లే కనిపిస్తోంది. అదే జరిగితే.. ముందు ముందు మరింత దారుణంగా తయారయ్యే అవకాశముంది ఈ షోలో. కాగా, మరో కొత్త కంటెస్టెంట్ రేపు బిగ్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుండడం గమనార్హం.