Table of Contents
Odela Railway Station Review.. ఓటీటీతో మనకున్న వెసులుబాటు ఇదే.! డబ్బులు అదనంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. విలువైన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరమూ రాదు.
తీరిగ్గా వున్నప్పుడు ఓటీటీలో ఏదన్నా కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే, ఓ లుక్కేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసెయ్యొచ్చు.
బావుంటే ఒకింత శ్రద్ధ పెట్టి చూడటం, లేదంటూ.. చూసీ చూడనట్టు లైట్ తీసుకోవడం. ఇదీ ఓటీటీ కల్పించే వెసులుబాటు.
సంపత్ నంది చెయ్యేశాడుగానీ..
అసలు విషయానికొస్తే, తాజాగా ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమా ఓటీటీలోకి వచ్చింది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు కాదుగానీ, ఆయన పేరు మీదనే ప్రమోట్ అయ్యింది. కాన్సెప్ట్, రైటింగ్.. అన్నీ ఆయనే.

హెబ్బా పటేల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి. మిగతా పాత్రధారులెవరూ వెండితెరకు పెద్దగా పరిచయం లేనివారే. ఇదొక థ్రిల్లర్.! రొమాంటిక్ థ్రిల్లర్ అనలేం.. ఎందుకంటే, ఇదో సైకో థ్రిల్లర్.
ఓ బలమైన పాయింట్‌తో కథ చెప్పాలనుకుంది ‘ఓదెల రైల్వే స్టేషన్’ టీమ్. దానికి ఓదెల అనే ఓ గ్రామాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. అలా సినిమా టైటిల్ కూడా ‘ఓదెల’.. ఏదో తోక వుండాలన్నట్టు ‘ఓదెల రైల్వే స్టేషన్’ అయ్యిందంతే.
శోభనం సమస్యతో మొదలు..
శోభనం రోజున, తన భార్య తనను అవమానిస్తే.. ఆ అసహనంతో సైకోగా మారిన ఓ భర్త కథ ఇది. అతనిది తప్పెలా అవుతుంది.? అని సినిమా చూశాక అనిపిస్తుంటుంది.
కాన్‌ఫ్లిక్ట్ అనేది సరిగ్గా కుదరకపోతే అంతే సంగతులు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. ఐపీఎస్ అధికారి, ట్రెయినింగ్ కోసం వస్తే మాత్రం.. తనకన్నా చాలా చాలా కింది స్థాయిలో వున్న అధికారితో మాటలు పడతాడా.?
జస్ట్ నాన్సెన్స్ అంతే.! అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది. పూజిత పొన్నాడ (Pujita Ponnada) అనే మరో యువ నటి కూడా ఈ సినిమాలో నటించింది. కానీ, ఆమెకు అంత స్కోప్ ఇవ్వలేదు నటించేందుకోసం.
Odela Railway Station Review.. ఓన్లీ ఫర్ హెబ్బా పటేల్..
హెబ్బా పటేల్ (Hebah Patel) మాత్రం తన పాత్రకు బాగానే న్యాయం చేసింది. ఆమె నుంచి ఈ స్థాయి నటనని కూడా మామూలుగా అయితే మనం ఊహించం.
నిజానికి, సంపత్ నంది నుంచి వచ్చిన సినిమా గనుక (దర్శకుడు కాకపోయినా) ఇంకా బెటర్ ఔట్‌పుట్ ఆశిస్తాం. ఆ విషయంలో నిరాశ పరుస్తుంది ‘ఓదెల’.
Also Read: సమంత, నాగచైతన్య, శోభిత.. ‘ట్రయాంగిల్’ స్టోరీ వెనుక.!
టైమ్ పాస్ కోసం.. మరీ అంత టైమ్ ఖాళీగా దొరికితే ‘ఓదెల’ మీద ఓ లుక్కేయొచ్చు. తీసి పారేసేది కాదు, ఖచ్చితంగా చూడాల్సిందీ కాదు.
‘ఓదెల రైల్వే స్టేషన్’ నిడి తక్కువ కావడం ప్లస్ పాయింటే అయినా, అందులోనూ సాగతీత చోటు చేసుకోవడం శోచనీయం.
