Paneer Butter Masala GST.. పన్నీర్ బట్టర్ మసాలా ఎప్పుడైనా తిన్నారా.? అయితే, అందులో ఏమేముంటాయ్.?
పన్నీర్ వుంటుంది.. బట్టర్ వుంటుంది.. మసాలా కూడా వుంటుంది. ఇంకా అదనంగా కొన్ని దినుసులు వుంటాయ్.
ఇంతకీ, పన్నీర్ బట్టర్ మసాలా మీద గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఎంత.? అదేనండీ, జీఎస్‌టీ ఎంత.? సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ప్రశ్న ఇది.
పన్నీర్ మీద 5 శాతం జీఎస్‌టీ, బట్టర్ మీద 12 శాతం జీఎస్‌టీ, మసాలా మీద 5 శాతం జీఎస్‌టీ. ఈ లెక్కన, పన్నీర్ బట్టర్ మసాలా మీద ట్యాక్స్ ఎంత.? అన్నది చాలామందికి కలుగుతోన్న ధర్మసందేహం.
Paneer Butter Masala GST.. అసలేంటీ గబ్బర్ సింగ్ ట్యాక్స్.?
నిజానికి అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ కాదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.. అదేనండీ వస్తు సేవల పన్ను. కేంద్రం అమల్లోకి తెచ్చిన జీఎస్‌టీకి సంబంధించి పలు స్లాబులు వున్నాయి.
ఈ జీఎస్‌టీ తెచ్చిన కొత్తల్లో అంతా గందరగోళమే. క్రమక్రమంగా కాస్త క్లారిటీ వచ్చింది. ఇంతలోనే మోత మొదలైంది.. ‘అబ్బే, వాటి మీద పన్ను మోత పెద్దగా లేదు.. మేం దేశాన్ని ఉద్ధరించేస్తున్నాం..’ అన్నారు పాలకులు.
క్రమక్రమంగా సీన్ మారుతూ వస్తోంది. మోత మోగిపోతోంది.. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుడికి వాచిపోతోంది.!
మాటలతో కోటలు కట్టేస్తారుగానీ..
అన్నిటినీ జీఎస్‌టీ పరిధిలోకి తెస్తున్నారు కదా.? పెట్రో ఉత్పత్తులెందుకు జీఎస్‌టీ పరిధిలోకి రావు.? అదైతే మిలియన్ డాలర్ల ప్రశ్నేమీ కాదు.
రాష్ట్రాలకీ, కేంద్రానికీ ఆదాయంలో కోత పడుతుంది కాబట్టి.. దాన్ని జీఎస్‌టీకి దూరం చేశారన్నమాట. పెట్రోల్, డీజిల్ సహా పెట్రో ఉత్పత్తులు.. వస్తువులు కాదు, సేవల పరిధిలోకీ రావన్నమాట.!
Also Read: బిచ్చగాడికి బైక్ వుంటే నేరమా అధ్యక్షా.?
ఇంతకీ, పన్నీర్ బట్టర్ మసాలాకి జీఎస్‌టీ ఎంతో లెక్క తేలిందా.? తేలదు గాక తేలదు.! అందుకే, దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేది.!
చివరగా, జీఎస్‌టీ అమల్లోకి వస్తే.. ధరలు అదుపులోకి వస్తాయని అప్పట్లో చెప్పిన మహానుభావులు, మేధావులైన రాజకీయ నాయకులు, ఇప్పుడేమో అధికార పీఠమెక్కి.. పెంచుకుంటూ పోతున్నారంతే.!
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీదీ కామెడీ అయిపోతోందిగానీ.. సామాన్యుల జీవితాలు ఛిద్రమైపోతున్నాయి పాలకుల మతిలేని నిర్ణయాలతో.!