Pawan Kalyan Hindutwa Stand.. సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా నడుం బిగించాలని జన సేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే పిలుపునిచ్చారు.
హిందువులు సంఘటితం కావాలని పిలుపునివ్వడమంటే, అది ఇతర మతాల్ని వ్యతిరేకించడం కాదని కూడా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
లడ్డూ కల్తీ వ్యవహారంపై హిందువులు స్పందించాలని పిలుపునివ్వడమంటే, ఇది ఏ ఇతర మతాలకీ వ్యతిరేకం కాదని తాజాగా పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా వెల్లడించారు.
క్రైస్తవ మతానికి ఇబ్బంది కలిగితే స్పందిస్తాం.. ఇస్లాం మతానికి ఇబ్బంది కలిగితే స్పందిస్తాం.. అలాగే, హిందూ ధర్మానికి ఇబ్బంది కలిగినా కూడా స్పందిస్తాం.. అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహా ప్రసాదమైన లడ్డూని కల్తీ చేయడం ఘోరమైన పాపమనీ, దేవుడి సొమ్ముల్ని అక్రమంగా దోచేస్తే తరాలు లేచిపోతాయని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశమవుతున్నాయి.
Pawan Kalyan Hindutwa Stand.. వాళ్ళకెందుకు మింగుడుపడ్డంలేదు.?
అయితే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సహజంగానే కొందరికి మింగుడు పడ్డంలేదు. అలాంటివాళ్ళంతా ఒక్కతాటిపైకొచ్చి, ముక్తకంఠంతో పవన్ కళ్యాణ్ తీరుని తప్పు పడుతున్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హిందువులతోపాటు, ఇతర మతాలకు చెందినవారినీ ఆలోచింపజేస్తున్నాయి. ‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో తప్పేముంది.?’ అని ఆయా మతాలకు చెందినవారు అభిప్రాయపడుతున్నారు.
పైన చెప్పుకున్న కొంతమంది మాత్రం, పవన్ కళ్యాణ్ మీద ఎప్పటినుంచో పెంచుకున్న వ్యతిరేకత కారణంగా, పవన్ కళ్యాణ్‌ని గుడ్డిగా విమర్శిస్తున్నారు.
అయినా, హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలపై అన్యమతస్తులు ఉలిక్కపడాల్సిన అవసరమేముంది.? తిరుమల లడ్డూ ప్రసాదం అనేది కేవలం హిందువులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే.
తిరుమల లడ్డూ నాణ్యత వైసీపీ హయాంలో దారుణంగా పడిపోయిందని, ఆ ప్రసాదాన్ని తీసుకున్న ప్రతి హిందువూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్ని చూశాం.
అలాంటప్పుడు, అసలు ప్రసాదమే ఎప్పుడూ తినని అన్యమతస్తులు, ఈ లడ్డూ ప్రసాదం విషయంలో అత్యుత్సాహం చూపిస్తూ, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం హాస్యాస్పదమే.
కల్తీ అనేది ఇస్లాం మతంలోనో, క్రిస్టియన్ మతంలోనే జరిగి వుంటే పరిస్థితి ఏంటి.? అన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నలో నిజాయితీ వుంది.
