MAA Elections.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా – Movie Artists Association) ఎన్నికల వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, అందరికన్నా ముందే తొందరపడ్డాడు.. ఏకంగా ప్యానెల్ ప్రకటించేశాడు. ప్రకాష్ రాజ్ అధ్యక్షతన ప్యానెల్ సభ్యులంతా (Movie Artists Association MAA Elections) మీడియా ముందుకొచ్చారు.
దాంతో, రచ్చ మొదలైంది. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ గుస్సా అయ్యాడు. మరోపక్క కుల సమీకరణాలు తెరపైకొచ్చాయి. ప్రాంతీయ వివాదాల గురించీ రచ్చ చోటు చేసుకుంది. ‘మా’ అధ్యక్ష రేసులోకి చాలా పేర్లొచ్చాయి. అందులో కొందరు డ్రాప్ అయ్యారు కూడా. అసలు ఎన్నికలెప్పుడో తేలకుండానే ఇంత రాద్ధాంతమా.? జనం ముక్కున వేలేసుకున్నారు.
ఇదిలా వుంటే, నటుడు మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్ష ఎన్నిక బరిలో వుంటానని ప్రకటించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అంతలోనే, ‘ఏకగ్రీవం కోసం పరిశ్రమ పెద్దలు ప్రయత్నిస్తే, పోటీ నుంచి తప్పుకుంటా..’ అని ప్రకటించేశాడు మంచు విష్ణు. బాలయ్య పేరుని ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రతిపాదించి మరో సంచలనానికి తెరలేపాడు ఈ మంచు వారబ్బాయ్.
పరిశ్రమ పెద్దలు అనదగ్గవాళ్ళు చాలామందే వున్నారు. వారెవరూ ఇంతవరకు ఈ వ్యవహారాలపై పెదవి విప్పలేదు. గట్టిగా వెయ్యి మంది కూడా సభ్యులు లేని ఓ అసోసియేషన్.. ఆ అసోసియేషన్ ఎన్నిక.. ఇంత రచ్చ రంబోలా రాజకీయాలకు తెరలేపడమంటే, దానికి ఒకే ఒక్క కారణం.. ఇది గ్లామరస్ ఇండస్ట్రీ అయిన సినీ పరిశ్రమకు సంబంధించినది కావడమే.
మిగతా వ్యవహారాలెలా వున్నా, మంచు విష్ణు రోజుకోరకమైన గేమ్ ప్లాన్‌తో అందర్నీ కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నాడు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తనయుడు కావడంతో విష్ణు నుంచి వచ్చే ఒక్కో ప్రకటన, సినీ పరిశ్రమలో ఓ మోస్తరు ప్రకంపనలే సృష్టిస్తోంది. ఇంతకీ, ‘మా’ ఎన్నికల (Movie Artists Association MAA Elections) రచ్చ.. అనే కథ కంచికి చేరేదెప్పుడు.? ఏమో, ఈ కథలో ఇంకెన్ని మలుపులు చూడాల్సి వస్తుందో.!