Pawan Kalyan OG Power.. విపరీతమైన నెగెటివిటీ మధ్య ‘హరి హర వీర మల్లు’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్ళు పట్టింది ఈ సినిమా నిర్మాణానికి.
హిట్టూ.. ఫట్టూ.. తర్వాత, అసలంటూ సినిమా విడుదలవుతుందా.? లేదా.? అన్న డైలమాలో నిర్మాత ఏఎం రత్నం వున్నారు. ఆ పరిస్థితుల్లో నిర్మాతకి భరోసా ఇచ్చారు హీరో పవన్ కళ్యాణ్.
వాస్తవానికి, తొలుత ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించింది క్రిష్. అనివార్య కారణాల వల్ల, క్రిష్ తప్పుకున్నాక, దర్శకుడిగా ఎవరు ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళతారన్న డైలమా నెలకొంది.
ఎలాగైతేనేం, ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ, దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడంతో ‘హరి హర వీర మల్లు’ ముందుకు నడిచింది.
బాలారిష్టాల్ని అధిగమించి..
కోవిడ్ కష్టాలు, ఆపై పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా వచ్చిన గ్యాప్.. ఎలాగైతేనేం, బాలారిష్టాలను దాటుకుని, థియేటర్లలోకి వచ్చింది
‘హరి హర వీర మల్లు’. ఈ సినిమా ప్రీమియర్స్ ఏ స్థాయిలో వసూళ్ళను రాబట్టాయో అందరికీ తెలిసిందే.
ఓ దశలో, ఈ సినిమాకి థియేటర్ల విషయమై గందరగోళం నెలకొంది. థియేటర్లు బంద్ చేస్తామనే బెదిరింపులూ వచ్చాయి.
అవన్నీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాల్ని భుజానికెత్తుకునేసరికి క్లియర్ అయిపోయాయి.
సినిమాపై విపరీతమైన నెగెటివిటీ కారణంగా, ‘హరి హర వీర మల్లు’ అంచనాల్ని అందుకోలేకపోయిన మాట వాస్తవం.
Pawan Kalyan OG Power.. ఓజీ మేనియా మొదలు..
ఇంతలోనే, ‘ఓజీ’ రిలీజ్ వ్యవహారాలు షురూ అయ్యాయి. వాయిదా.. ప్రచారాలూ తెరపైకొచ్చాయి. కానీ, సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ ఖాయమని నిర్మాతలు తేల్చి చెప్పారు.
దాంతో, హైప్ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్ రాకతో, వేరే లెవల్ హైప్ క్రియేట్ అయ్యింది ‘ఓజీ’ మీద.
అమెరికాలో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ సేల్స్ చూసి, ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోతున్నారు. ఇంత స్టామినా వదిలేసుకుని, రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళడమేంటి.? అన్న చర్చ జరుగుతోంది.
ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక.. ‘ఓజీ’ మేనియా ఇంకెలా వుంటుందో.!
ఔను, ఈ హైప్.. ఈ ప్రీ రిలీజ్ ప్రభంజనం పవన్ కళ్యాణ్‌కి మాత్రమే సాధ్యం. ఆయన రాజకీయాల్లోనూ వుండాలి.. సినిమాలూ చేస్తుండాలి.! ఇది అభిమానుల మాట.