Pawan Kalyan Prayischitha Deeksha.. తప్పు జరిగిపోయింది.! చిన్న తప్పు కాదు.. మహా పాపం.! మరి, పాప పరిహారమేంటి.? పాపులకి శిక్ష పడి తీరాల్సిందే.! ఆ శిక్ష అత్యంత కఠినంగా వుండి తీరాలి.!
తెలిసో.. తెలియకో.. ఆ తప్పు మనమూ చేశాం.! ఔను, లడ్డూ ప్రసాదం అపవిత్రమైపోగా, ఆ అపవిత్రమైన ప్రసాదాన్ని, మనం తిన్నాం.. మన సన్నిహితులు, బంధువులకు తినిపించాం.
కాబట్టి, పాప నివృత్తి కోసం మనమూ ప్రయత్నించాలి.! మనలో ఎవరో ఒకరు ఈ పాప పరిహార ప్రక్రియ మొదలు పెట్టాలి.
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి అడుగు వేశారు. ప్రాయిశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు.
రేపటి నుంచి.. అంటే, శనివారం, సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 11 రోజులపాటు ప్రాయిశ్చిత్త దీక్షను కొనసాగించి, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా, తన ఆవేదనను జనసేనాని తన హిందూ సమాజంతో పంచుకున్నారిలా.!
Pawan Kalyan Prayischitha Deeksha.. జనసేనాని ట్వీట్ సారాంశమిదీ..
అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది.
జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.
లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది.
కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను.
22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను.
11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా… నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను.
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు.
నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది.
వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది.
ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.
ధర్మో రక్షతి రక్షితః
ఇదీ పవన్ కళ్యాణ్ ఆవేదన.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయిశ్చిత్త దీక్షలో.. హిందువులంతా పాల్గొందాం.! మనమూ ఆ దీక్షని చేపడదాం.!
హిందూ దేవాలయాల్లో పవిత్రను కాపాడే దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొద్దాం. హిందూ ధర్మంపై వ్యూహాత్మకంగా జరుగుతున్న దాడిని తిప్పి కొడదాం.!