సినిమా వేదిక, రాజకీయ వేదిక.. ఏదైనా ఆయనకి ఒక్కటే. ప్రశ్నించాలనుకుంటే, ప్రశ్నించి తీరతాడు. ప్రజల తరఫున నిలబడతారు.. పరిశ్రమ తరఫున కూడా ప్రశ్నిస్తాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Sensational Speach) అంటే రాజకీయంగా కొందరికి నచ్చకపోవచ్చుగాక.. సినీ పరిశ్రమలోనూ కొందరికి ఆయనంటే గిట్టకపోవచ్చుగాక. కానీ, పవన్ పరిశ్రమ తరఫున తాజాగా మాట్లాడిన మాటలు.. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరినీ కదిలించాయి.
కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రభుత్వాలు పెట్రో ధరల్ని పెంచేశాయ్.. ప్రజలు ఆ భారాన్ని మోస్తున్నారు. సినీ పరిశ్రమ కూడా కరోనా కారణంగా దెబ్బ తింది. సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచమని కోరడంలేదు.. గతంలో పరిస్థితి ఎలా వుందో, ఆ పరిస్థితిని కొనసాగించాలని కోరుకుంటోంది.
Also Read: ఒక ప్రమాదం.. పతనమైంది ‘పెద్దరికం’.!
తెలంగాణ ప్రభుత్వంతో తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు సమస్యలున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమాకి టిక్కెట్ల ‘పేచీ’ పెట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అప్పటిదాకా లేని టిక్కెట్ల పంచాయితీ, అప్పుడే ఎందుకు వచ్చిందన్నది జగమెరిగిన సత్యం.
రాజకీయ సభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. కానీ, సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ సమస్యలొచ్చాయి.. రోజుకు నాలుగు ఆటలు పూర్తిగా ప్రదర్శించుకోలేని పరిస్థితి. సినిమా రంగం కోలుకోవడమెలా.? మరి, ప్రశ్నించాల్సిన సినీ పెద్దలు ‘బతిమాలుకోవడం’ ఏమంటి.? ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తీరు పట్ల కూడా కొంత అభ్యంతరం వ్యక్తమవుతోంది.
Also Read: నిస్సిగ్గు రాజకీయం.. ఓ మై సన్.. మదర్స్ హజ్బెండ్..!
సినీ పరిశ్రమలో చాలామందికి రాజకీయాలతో లింకులున్నాయి. రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ, ఎవ్వరూ నోరు మెదపరేం.? ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళవి. ఎవరి సినీ అవసరాలు వాళ్ళవి.
‘నా సినిమాల్ని ఆపేసుకోండి.. సినిమా పరిశ్రమపై మాత్రం కక్ష సాధింపు చర్యలొద్దు..’ అంటూనే, ‘పరిశ్రమ జోలికొస్తే, ఊరుకునేది లేదు..’ అని ఓ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ఆషామాషీ వ్యవహారం కాదు. పరిశ్రమ కష్టాల్ని ఏకరువు పెట్టారు.. అదే సమయంలో, పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా కష్టపడి సంపాదించుకుంటున్న వైనాన్నీ ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.
సినీ పరిశ్రమ ఇంత కష్టాల్లో వుంటే, సినీ రాజకీయాలు మాట్లాడుతున్న కొందరు.. సినిమాల విడుదలకు ఎదురవుతున్న రాజకీయ అడ్డంకులపై ఎందుకు మాట్లాడటంలేదు.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు.!
Also Read: చట్ట సభల్లో నేర చరితులు.. పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Sensational Speach) మాటల్లో కొన్ని పదాలు హద్దులు దాటి వుండొచ్చు.. కానీ, సినిమా అనే ఓ కుటుంబానికి ప్రతినిథిగా ఆయన తన ఆవేదన వెల్లగక్కారంతే.
చెత్త మీద పన్నులు.. ఆఖరికి టాయిలెట్ల మీద కూడా పన్నులేసి, ఖజానా పెంచుకోవాలని ప్రభుత్వాలు చూడొచ్చుగానీ.. సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించి పరిశ్రమ పొట్టకొట్టడమా.? అని ఒక్కరంటే ఒక్కరు సినీ పరిశ్రమ తరఫున ప్రశ్నించకపోవడం శోచనీయం.