Pithapuram MLA Gari Thaaluka.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో గెలవనున్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థులు తమ తమ గెలుపుపై ధీమాగా వున్నారు.
‘మళ్ళీ జగనేనట కదా..’ అన్న వైసీపీ ప్రచారం ఓ వైపు, ‘కూటమిదే విజయమట కదా..’ అంటూ టీడీపీ – జనసేన – బీజేపీ పార్టీల నమ్మకం ఇంకో వైపు.. రాష్ట్రంలో రాజకీయాలు కనీ వినీ ఎరుగని స్థాయిలో హీటెక్కాయి.
రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టీ పిఠాపురం నియోజకవర్గం మీదనే. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని, ఈసారి మాత్రం రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంటారని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.
Pithapuram MLA Gari Thaaluka.. లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారు..
పిఠాపురంలో లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారని అధికార పార్టీకి చెందిన మద్దతుదారులే బెట్టింగులు వేస్తుండడం గమనార్హం.
ఈ నేపథ్యంలో జనసేన శ్రేణులు, కొత్త ఉత్సాహంతో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఉత్సాహంతోనే, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా..’ అంటూ వాహనాలకు నెంబర్ ప్లేట్లను తయారు చేయించుకుంటున్నారు.

‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాల్లోనూ, జనసేన శ్రేణులు ఈ తరహా స్టిక్కర్లను వాహనాలకు అంటించుకుంటున్నారు.
అయితే, ఇది రవాణా శాఖ నిబంధనలకు వ్యతిరేకమంటూ వైసీపీ కొత్త వాదనకు తెరలేపింది. అందులో నిజం లేకపోలేదు కూడా.
వైసీపీ చేస్తేనే సంసారమా.?
అయితే, ఐదేళ్ళుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో, కేవలం వైసీపీ జెండా రంగులు పోలిన స్టిక్కర్లతోనే వాహనాలు నడిపేస్తున్నారు కొందరు. వాటికి నెంబర్ ప్లేట్లు కూడా వుండవు.
‘సిద్ధం’ స్టిక్కర్లను నెంబర్ ప్లేట్లకు అంటించుకుని వాహనాలు నడుపుతున్న వైసీపీ శ్రేణులూ కనిపిస్తున్నాయి. వైసీపీ చేసింది తప్పు కానప్పుడు, జనసేన శ్రేణులు చేస్తున్నదాన్ని వైసీపీ ఎలా తప్పు పట్టగలుగుతుంది.?
Also Read: క్రికెట్టూ.. సినిమాలూ.. సూడకపోతే కొంపలు మునిగిపోవ్.!
ఏదిఏమైనా, పొలిటికల్ స్టిక్కర్లను నెంబర్ ప్లేట్లకు కాకుండా వాహనంపై ఇంకెక్కడైనా అంటించుకుంటే తప్పేమీ కాదు.
ఇంతకీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి లభించబోయే మెజార్టీ ఎంత.? దీనిపై బెట్టింగులు కొనసాగుతూనే వున్నాయి. లక్ష మెజార్టీ మీదనే ఎక్కువ పందాలు నడుస్తున్నాయ్.
‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అని పవన్ కళ్యాణ్ అభిమానులందరూ గర్వపడే రోజు ఎంతో దూరంలో లేదు. జూన్ 4, పవన్ కళ్యాణ్ అభిమానులు గర్వంగా చెప్పుకునే రోజవుతుందనడం నిస్సందేహం.