Table of Contents
పార్లమెంటు సమావేశాల సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ (Narendra Modi), తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao)ని అభినందించారు. అయితే, అభినందించడానికి కారణం.. తెలుగుదేశం పార్టీ – భారతీయ జనతా పార్టీ మధ్య తెగతెంపులు జరగడమే.
చంద్రబాబు (Nara Chandrababu Naidu) దూరమవడంతో చంద్రశేఖరుడ్ని దగ్గర చేసుకునేందుకు నరేంద్రమోడీ ప్రయత్నించారు. ఆ సమయంలో మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాసం తీర్మానానికి కేసీఆర్ మద్దతిచ్చి వుంటే.. అదొక చారిత్రక ఘట్టం అయి వుండేది.
ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోడీ (Prime Minister), టీఆర్‌ఎస్ (Telangana Rashtra Samithi) అధినేత కేసీఆర్‌పై (KCR) నిప్పులు చెరిగారు. సోనియాగాంధీ, చంద్రబాబు వద్ద కేసీఆర్ శిష్యరికం చేశారనీ, కాంగ్రెస్ – టీఆర్‌ఎస్ వేరు కాదనీ విమర్శలు చేశారు. ఈ విమర్శలు తెలంగాణ సమాజాన్ని ఆశ్చర్యంలోకి నెట్టేశాయి.
తెలుగు రాష్ట్రాలపై మోడీ ప్రేమ ఇదీ..
తెలంగాణ నుంచి సీనియర్ నేత అయిన బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya)కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి, తక్కువ కాలంలోనే దాన్ని లాగేసుకున్నారు నరేంద్రమోడీ. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇప్పుడు ఏ ఒక్కరికీ కేంద్ర మంత్రిగా అవకాశం లేదు. అలా తెలుగు రాష్ట్రాలకు పదవుల పంపకాల్లో కూడా నరేంద్రమోడీ సమ అన్యాయం చేసిన మాట వాస్తవం అని బీజేపీపై వివిధ రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
సొమ్ములెవరివి.? సోకులెవరివి.?
ఇంకో వైపున, తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో మెజార్టీ వాటా తమదేనని బీజేపీ చెబుతుండగా, రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే, కేంద్రానికి నిధులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మోడీ పైకి ఇదే ప్రశ్న దూసుకెళుతోంది. తెలంగాణలో 2014 ఎన్నికల్లో గెలిచిన సీట్లు కూడా ఈసారి రాకపోవచ్చుననే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుండగా, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దింపి, అధికారంపై కన్నేసింది బీజేపీ.
మోడీ ప్రశ్నకు కేసీఆర్ ఘాటు జవాబు..
ఇదిలా వుంటే, ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించి తెలంగాణ రాష్ట్ర సమితిపై చేసిన ఆరోపణలకు, గులాబీ బాస్ కేసీఆర్ గట్టి సమాధానమే ఇచ్చారు. నిజామాబాద్‌లో కరెంటు, నీళ్ళు లేవని చెబుతున్న నరేంద్రమోడీ, ఆ మాటకు కట్టుబడి వుంటే ఆయనతో తాను చర్చకు సిద్ధమనీ, నిజామాబాద్‌లోనే నిజానిజాలేంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు కేసీఆర్. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం రావాలనీ, అలాంటి ప్రభుత్వం కోసం తాను కృషి చేస్తానని కేసీఆర్ అన్నారు.
నిన్న స్నేహం.. నేడు వైరం..
రాజకీయాల్లో నిన్నటి మాట, నేడు వుండదు. నిన్నటి స్నేహం, నేడు శతృత్వంగా మారవచ్చు. స్నేహితులు, శతృవులుగా.. శతృవులు, స్నేహితులుగా అతి తక్కువ సమయంలో మారిపోవడం రాజకీయాల్లో మామూలు విషయమే అయిపోయింది. అవిశ్వాసం నుంచి గట్టెక్కడానికి కేసీఆర్ సాయం తీసుకున్న నరేంద్రమోడీ, ఇప్పుడు అవసరం తీరాక.. కేసీఆర్‌ని రాజకీయంగా విమర్శిస్తున్నారనే విమర్శలు ఓ వైపు, నరేంద్రమోడీని గుడ్డిగా నమ్మినందుకు కేసీఆర్‌కి తగిన శాస్తి జరిగిందన్న అభిప్రాయాలు ఇంకో వైపు విన్పిస్తున్నాయి.
ఎవరు మిత్రుడు.. ఎవరు శతృవు.?
ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీ ఏ రకంగానూ ప్రత్యర్థి కానే కాదు. అయితే, బీజేపీ – టీఆర్‌ఎస్ మధ్య అవగాహన వుందనీ, ఆ అవగాహన నేపథ్యంలోనే నరేంద్రమోడీ ఉత్తుత్తి విమర్శలు చేస్తే, కేసీఆర్ కూడా నరేంద్రమోడీపై ఉత్తుత్తి విమర్శలే చేశారని కాంగ్రెస్ (Congress Party) అంటోంది. బీజేపీ మాత్రం, కాంగ్రెస్ – కేసీఆర్ ‘ఫేక్ డబ్ల్యుడబ్ల్యుఎఫ్’ ఫైట్ చేసుకుంటున్నాయని ఎదురుదాడి చేస్తోంది. ఎన్నికల వేళ ఇలాంటి ‘సిత్రాలు’ మామూలే. ఇప్పుడే ఏమయ్యింది, ముందు ముందు ఇంకా ఫన్ చూడబోతున్నాం. రాజకీయం అంటేనే, ఫన్‌గా మారిపోయింది మరి.