Table of Contents
Putin vs Zelenskyy: ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ చుట్టూ చాలా రాజకీయం జరుగుతోంది. ప్రపంచంలో చాలా దేశాలు జెలెన్‌స్కీ పట్ల సానుభూతి చూపిస్తున్నాయి. నిజమే, సానుభూతి చూపించాల్సిందే.! కానీ, మరీ ఇంతలాగానా.?
ఒకవేళ రష్యా చేస్తున్న దాడిలో ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ హతమైతే ఏంటి పరిస్థితి.? అన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయంటే, ఆ చర్చలకు స్వయంగా ఆయనే ఆస్కారం కల్పించారు మరి.!
రష్యా నిజంగానే జెలెన్‌స్కీని చంపేస్తుందా.? అంటే, ఆ ఉద్దేశ్యం రష్యాకి వుంటే, ఈపాటికే ఆయన హతమై వుండేవాడు. అగ్ర రాజ్యం అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా ఇలా చాలామందిని హత్య చేసింది. తీవ్రవాదులనే ముద్ర వేయడమో, ఇంకో కోణంలో కసి తీర్చుకోవడమో.. ఇలాంటివన్నీ అమెరికాకి వెన్నతో పెట్టిన విద్య.
నన్ను చంపేస్తారేమో.. జెలెన్‌స్కీ
‘నేను గనుక జీవించి లేకపోతే..’ అంటూ జెలెన్‌స్కీనే తాజాగా వ్యాఖ్యానించాడు. రష్యన్లు తనను చంపేందుకు కుట్ర పన్నారనీ, ఏ క్షణంలో అయినా మృత్యువు తనను కబళించేస్తుందనీ చెప్పుకొచ్చాడాయన.
అంతే, అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయమై స్పందించింది. ఉక్రెయిన్ నాయకత్వం చాలా బలమైనది.. సంకల్ప బలం కలిగినది.. ఒకవేళ జెలెన్‌స్కీ హత్యకు గురైనా, ఉక్రెయిన్ గట్టిగా నిలబడగలదు.. అంటూ అమెరికా వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
చిత్ర విచిత్రమైన రాజకీయం జరుగుతోంది కదూ.! దీన్ని సింపతీ రాజకీయం అనాలా.? రష్యా కాకుండా ఇంకెవరైనా జెలెన్‌స్కీని చంపేసి, ఆ పాపాన్ని రష్యా మీదికి నెట్టేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా.?
Putin vs Zelenskyy.. నాయకత్వానికి ముప్పు.. సాధ్యమేనా.?
ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై తిగరబడినప్పుడు కూడా, అంతకు ముందు ప్రజా ప్రభుత్వాన్ని నడిపిన ప్రముఖులెవరూ ప్రాణాలు కోల్పోలేదు. ‘నాయకత్వాన్ని హతమార్చడం’ అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది.
రష్యా – ఉక్రెయిన్ మధ్య తలెత్తిన వివాదమనండీ, యుద్ధమనండీ.. ఏదైతేనేం, ఉక్రెయిన్‌లో విధ్వంసమే చోటు చేసుకుంటోంది. ‘ఇదిగో నేనున్నా.. బతికే వున్నా.. ప్రాణమున్నంతవరకూ పోరాడతా..’ అంటూ జెలెన్‌స్కీ.. అడపా దడపా వీడియోలు విడుదల చేస్తున్నాడు.
ఇంకోపక్క, రష్యన్ సైన్యం ఉక్రెయిన్‌ని పూర్తిగా ఆక్రమించేదిశగా ముందుకు దూసుకుపోతూనే వుంది.
మానవాళి భవిష్యత్తేంటి.?
చివరికి ఏం జరుగుతుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. నాటో గనుక రష్యా మీద దాడికి దిగితే, ఆ తర్వాత పరిణామాల గురించి ఊహించడానికేమీ వుండదు.
రష్యా లేకపోతే, ప్రపంచమే వుండదని రష్యా అధినేత పుతిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ వేస్తున్న ప్రతి అడుగూ ప్రపంచ వినాశనం కోసమే అవుతుందన్నది నిర్వివాదాంశం.
Also Read: కొత్త రాజ్యాంగం రాస్కో బాసూ.! ఇంతకీ, ఏ సిరాతో.!
జెలెన్‌స్కీ వెనుక నాటో వుందా.? అమెరికానే, రష్యాపై ‘పరోక్ష యుద్ధం’ ప్రకటించిందా.? అన్నది వేరే చర్చ. అంతిమంగా మానవాళి వినాశనం కోసమే వచ్చినట్టుంది ఈ సంక్షోభం.