Table of Contents
‘రంగ్ దే’ (Rang De Review) సినిమా టైటిల్ రంగులమయంగానే ఆలోచించారు. నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం.. అనేలా సినిమా ప్రమోషన్స్ జరిగాయి.
2020లో ‘భీష్మ’తో హొట్టు కొట్టిన నితిన్, 2021లో ‘రంగ్ దే’ సినిమాతో మరో హిట్టు కొట్టబోతున్నాడని టాలీవుడ్ వర్గాల అంచనా వేశాయి. సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయంటే, కాంబినేషన్ అలాంటిది.
మరి, ఆ అంచనాల్ని ఈ కాంబినేషన్ అందుకోగలిగిందా.? దర్శకుడు వెంకీ అట్లూరి మించి హిట్ తన ఖాతాలో వేసుకున్నడా.? ఇంకెందుకు ఆలస్యం.. సినిమా కథా కమామిషు ఎంటో తెలుసుకుందాం పదండిక..
చిత్రం: రంగ్ దే (Rang De Review)
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్ (సీనియర్ నటుడు), అభినవ్ గోమటం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్:
సినిమాటోగ్రఫీ: పిసి శ్రీరామ్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల తేదీ: 26 మార్చి 2021
నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
కథలోకి వెళితే.. Rang De Review
ఇరుగు పొరుగునుండే రెండు కుటుంబాల్లోని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రేమించుకోవడం.. ఆ కుటుంబాల మధ్య స్నేహం.. అమ్మాయి, అబ్బాయి మధ్య గిల్లి కజ్జాలు.. ఈ క్రమంలో ప్రేమ, పెళ్ళి.. ఇలాంటి కథలు చాలానే తెలుగు తెరపై చూశాం. ఇది కూడా అచ్చం అలాంటిదే.
అర్జున్ (నితిన్) పక్కింట్లోనే వుండే అను (కీర్తి సురేష్) మధ్య చిన్నప్పటినుంచీ గిల్లికజ్జాలుంటాయి.. అవి వాళ్ళు పెరిగినా అలాగే కొనసాగుతాయి. ఓ షాకింగ్ సన్నివేశం తర్వాత ఇష్టం లేకపోయినా అను మెడలో తాళి కట్టాల్సి వస్తుంది అర్జున్‌కి. ఆ తర్వాత ఏమయ్యింది.? పెళ్ళయ్యాక కూడా అను, అర్జున్ మధ్య గొడవలు కొనసాగుతాయా.? అసలు ఏంటా షాకింగ్ సన్నివేశం.? అన్నది తెరపైనే చూడాలి.
నటీనటులెలా చేశారంటే..
హీరో నితిన్ కంటే ముందుగా హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆమె నటన ఈ సినిమాకి అదనపు ప్లస్ పాయింట్. అయితే, కాస్త బక్క చిక్కిపోవడం వల్ల కొన్ని సన్నివేశాల్లో ఆమె లుక్ కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. నటన పరంగా ఆమెకు ఫుల్ మార్క్స్ పడిపోతాయ్. కొన్ని చోట్ల అయితే నితిన్‌ని ఆమె డామినేట్ చేసేసిందనడం అతిశయోక్తి కాదు.
ఇప్పుడిక హీరో నితిన్ విషయానికొద్దాం. చాలా తేలిగ్గా అర్జున్ పాత్రలో ఒదిగిపోయాడు నితిన్. హీరోయిన్ కీర్తి సురేష్‌తో కెమిస్ట్రీ బాగా కుదిరింది నితిన్‌కి. నటుడిగా ప్రతి సినిమాకీ కొత్తదనం చూపిస్తోన్న నితిన్, ఈ సినిమాతో మరింత ఈజ్ ప్రదర్శించాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. చాలా చాలా ట్రెండీగా కనిపించాడు.
సీనియర్ నటుడు నరేష్ తన అనుభవాన్ని రంగరించారు. వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, సుహాస్ తదితరులు తమదైన రీతిలో తెరపై అలరిస్తారు. బ్రహ్మాజీ పాత్ర నవ్వులు పూయిస్తుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.
సాంకేతికంగా ఎలా వుందంటే..
సినిమా టైటిల్.. రంగులతో ముడిపడి వుంది. దాంతో, సినిమాని రంగులమయంగా చూపించడానికి సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తన అనుభవాన్ని రంగరించారు. సంగీతం ఆకట్టుకుంటుంది. విజువల్స్‌కి తోడు, మ్యూజిక్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది.
పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బావున్నాయి. బ్యక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా వున్నా, కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త సాగతీతగా అనిపిస్తాయి. నిడివి తక్కువ కావడం సినిమాకి మరో ప్లస్ పాయింట్. నిర్మాణపు విలువలు సితార బ్యానర్ స్థాయిని నిలబెట్టేలా వున్నాయి.
విశ్లేషణ Rang De Review
ముందే చెప్పుకున్నట్లు కథ తెలిసిందే. ఓ చిన్న పాయింట్.. అదే సినిమాలో పెద్ద ట్విస్ట్. మిగతాదంతా తదుపరి ఏం జరుగుతుందనేది ఊహించగలిగిందే. నటీనటుల ఎంపిక దగ్గర్నుంచి, టెక్నీషియన్స్ ఎంపిక వరకు దర్శకుడి టేస్ట్ అదుర్స్. కావాల్సినన్ని నవ్వులు పూయిస్తూనే, ఎమోషనల్ సీన్స్‌ని కూడా జాగ్రత్తగానే డీల్ చేశాడు.
అయితే, ఎమోషనల్ సీన్స్‌లో డెప్త్ వుండాల్సిన స్థాయిలో లేకపోవడం కొంచెం ‘డల్’ అనే భావనను కలిగిస్తుంది. ఫస్టాఫ్ అయితే పూర్తిగా ఫన్ రైడ్. సెకెండాఫ్ కొంచెం వేగం నెమ్మదిస్తుంది. అంతలోనే పాటలు మళ్ళీ మనల్ని ఇంకో లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి.
ఓవరాల్‌గా చూసుకుంటే ఫన్‌తో కూడిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అనుకోవచ్చు. సినిమా ప్రమోషన్ కూడా ‘ఎంటర్టైన్మెంట్ యాంగిల్’లోనే జరిగింది గనుక, థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌కి పైసా వసూల్ అని చెప్పక తప్పదు. కొత్తదనమో.. ఇంకోటో ఆశించేవారికి కాస్త నిరాశ కలిగించవచ్చు.
ఒక చిన్న మాట: అందమైన రంగులన్నీ (Rang De Review) బాగానే కలబోశారు..