బాలీవుడ్ నటి రియా చక్రవర్తి (Swara Stands Support For Rhea), బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ డెత్ మిస్టరీకి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇదొక్కటే కాదు, డ్రగ్స్ కేసులోనూ ఆమెపై ఆరోపణలున్నాయి. సుశాంత్, రియా చక్రవర్తి.. పెళ్ళి చేసుకుందామనుకున్నారు.. కొంతకాలం సహజీవనం కూడా చేశారు.
ఏమయ్యిందో, అనూహ్యంగా సుశాంత్‌కి దూరంగా జరిగింది రియా.. అదీ సుశాంత్ మరణానికి చాలా కొద్ది రోజుల ముందే. ఇదే చాలా అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్ హత్యకు గురయ్యాడనడానికి ఆధారాల్లేవని ఇప్పటికే ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎయిమ్స్ తేల్చి చెప్పింది.
దాంతో, సుశాంత్ మిస్టీరియస్ డెత్ కేస్‌లో రియా చక్రవర్తికి ఊరట కలిగినట్లే. కానీ, ఆమెను అరెస్ట్ చేసింది ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ అధికారులు. సుశాంత్‌కి రియా చక్రవర్తి డ్రగ్స్ సరఫరా చేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఇందుకు తగిన ఆధారాల్ని ఇప్పటికే సేకరించిన ఎన్‌సిబి, ఆ ఆధారాల్ని న్యాయస్థానం ముందుంచింది కూడా. మరింత లోతుగా ఆమెను విచారించాలని ఎన్‌సిబి భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తితో సంబంధాలున్న పలువురు నటీనటులు, దర్శక నిర్మాతల్ని విచారిస్తున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. అయితే, రియా చక్రవర్తి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర వుందని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఆరోపిస్తోంది.
‘సుశాంత్‌ది హత్య కాదు.. ఆత్మహత్య అని తేలింది గనుక, రియా చక్రవర్తిని విడుదల చేయాలి.. ఆమె రాజకీయ కుట్రకు బలైంది..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది స్వరా భాస్కర్. రియా చక్రవర్తిని విడుదల చేయాల్సింది న్యాయస్థానం. ఆ మాత్రం ఇంగితం లేకుండా స్వరాభాస్కర్ ఎలా మాట్లాడగలుగుతుంది.? అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న.
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్వరా భాస్కర్, ఇంతలా రియా చక్రవర్తిని వెనకేసుకొస్తోందంటే.. బహుశా ఆమెకి కూడా డ్రగ్స్ కేసుతో సంబంధం వుండే వుంటుందంటూ కొత్త వాదన తెరపైకొస్తోంది. రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యింది.
ఇక్కడ రియా చక్రవర్తికి ‘మహిళా కోటా’ ఏమీ వర్తించదు. ఆమె నేరస్తురాలా.? కాదా.? అన్నది న్యాయస్థానం తేల్చాల్సి వుంటుంది. రియా చక్రవర్తికి సర్టిఫికెట్ ఇచ్చేసి సంబరపడాలని స్వరాభాస్కర్ (Swara Stands Support For Rhea) అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?