Table of Contents
Romanchakam Review.. సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా తెరకెక్కిన సినిమా అంటే, ఆ సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
‘అర్జున్ రెడ్డి’ గుర్తుకొస్తుంది.. ‘యానిమల్’ కూడా గుర్తుకొస్తుంది. ఆ స్కేల్ వేరే.! కానీ, నిర్మాతగా చాలా చిన్న సినిమాని ఈసారి రూపొందించారు సందీప్ రెడ్డి వంగా.
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రల్లో ‘రోమాంచకం’ సినిమాని వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ రెడ్డి వంగా నిర్మించారు.
‘సందీప్ రెడ్డి వంగా పిలిచినప్పుడు రాకపోతే నేను బతికి వేస్ట్’ అంటూ, ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
మరోపక్క, ‘రోమాంచకం’ టీమ్, ‘స్పిరిట్’ హీరో ప్రభాస్‌ని కలిసింది. సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా ‘రోమాంచకం’ సినిమా గురించి స్పందించారు.
ఎలా చూసినా, ‘రోమాంచకం’ సినిమాకి గ్రౌండ్ పెర్‌ఫెక్ట్‌గా సెట్ అయినట్లే. సెట్ అయ్యింది.. థియేటర్లలోకి సినిమా వచ్చింది. యూత్ ఈ సినిమాని చూసేందుకు ఒకింత ఇంట్రెస్ట్ కూడా చూపించారు.
‘8 వసంతాలు’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనంతిక సనీల్ కుమార్, ఈ సినిమాలో ఏం మ్యాజిక్ చేసిందోనని అంతా ఎదురు చూడటం సహజమే.
Romanchakam Review.. ఇంతకీ, ‘రోమాంచకం’ కథా కమామిషు ఏంటి.?
ఓ కుర్రాడు, ‘స్టార్టప్ కంపెనీ’ కోసం ప్రయత్నిస్తుంటాడు. డేటింగ్ యాప్ తీసుకురావాలన్నది అతని ఆలోచన. ఈ క్రమంలో మరో యాప్ ద్వారా, ఓ అమ్మాయికి కనెక్ట్ అవుతాడు.
తీరా, ఆ అమ్మాయిని కలవడానికి వెళితే, అక్కడ అతనికి చుక్కెదురవుతుంది. హీరోని హీరోయిన్ బ్లాక్ చేస్తుంది. కట్ చేస్తే, హీరో దగ్గరకి హీరోయిన్ వస్తుంది. కానీ, అంతలోనే ఆమె ఆచూకీ గల్లంతవుతుంది.
ఎందుకు బ్లాక్ చేసింది.? ఎందుకు తిరిగొచ్చింది.? ఎందుకు ఆమె ఆచూకీ గల్లంతయ్యింది.? హీరో, అతని ఫ్రెండ్స్.. హీరోయిన్‌ని పట్టుకున్నారా.? ఈ క్రమంలో వాళ్ళకి ఎదురైన ఇబ్బందులేంటి.? ఇదంతా మిగతా కథ.
నటీనటులెలా చేశారంటే..
సుమంత్ ప్రభాస్ మంచి నటుడు. చాలా ఈజ్‌తో తన పాత్రని డీల్ చేశాడు. అన్వేష్ పాత్రలో ఒదిగిపోయాడు సుమంత్ ప్రభాస్. కామెడీ టైమింగ్ భావుంది. అసహనం ప్రదర్శించే సన్నివేశాల్లో జీవించేశాడు.
చాలామంది కుర్రాళ్ళు అన్వేష్ పాత్రతో తమను తాము రిలేట్ చేసుకుంటారు. అంతలా కుర్రకారుకి నచ్చేస్తుంది అన్వేష్ పాత్ర. ఆ పాత్రలో అంత చక్కగా ఒదిగిపోయాడు సుమంత్ ప్రభాస్.
‘8 వసంతాలు’ సినిమాతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది అనంతిక. కాకపోతే, ఈ సినిమాలో ఆమెకు అంత బలమైన పాత్ర దక్కలేదు. వున్నంతలో, చాలా క్యూట్‌గా కనిపించింది.
అనంతిక నటనకి వంక పెట్టడానికేమీ లేదు. ఆమె నేచురల్ అప్పీల్, కుర్రకారుని ఆకట్టుకుంటుంది. అనంతిక పాత్రని ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది వుండాల్సింది.
హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించినవాళ్ళంతా బానే చేశారు.
టెక్నికల్‌గా చూసుకుంటే..
సినిమాటోగ్రాఫర్ పవన్ పప్పుల విజువల్స్ బావున్నాయి. వాసుకి వైభవ్ సంగీతం ఫర్లేదు. పాటలు బానే వున్నాయి. రిచ్‌గానే తెరకెక్కించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే.
కొన్ని సన్నివేశాల్లో సాగతీత ఎక్కువైంది. కత్తెర పదును సరిగ్గా చూపించాల్సి వుంది. కొన్ని డైలాగ్స్ గట్టిగా పేలాయి. కొన్ని జస్ట్ ఓకే అనిపిస్తాయి. మేకింగ్ రిచ్‌గానే వుంది.
దర్శకుడు కొన్ని సీన్స్‌లో కామెడీని బాగా వర్కవుట్ చేశాడు. అతనికి నటీనటుల నుంచి మంచి సహకారమే లభించింది. కాకపోతే, పాత్రల్ని రాసుకున్న తీరు, స్క్రీన్ ప్లే.. ఈ విషయాల్లో ఇంకాస్త బాగా వర్క్ చేసి వుండాల్సింది డైరెక్టర్.
కామెడీ సీన్స్ కొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అదే సమయంలో కథా గమనంలో అయోమయం, అలసత్వం, కొన్ని చోట్ల సాగతీత సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి.
ఓవరాల్‌గా యూత్‌ని టార్గెట్ చేసిన దర్శకుడు, కొన్ని విషయాల్లో ఆ యూత్‌ని మెప్పించగలిగాడు. సందీప్ రెడ్డి వంగా లాంటి బిగ్ హ్యాండ్ నుంచి వచ్చిన భరోసాని దర్శకుడు ఇంకాస్త బెటర్‌గా ఉపయోగించుకుని వుండాల్సింది.
లాజిక్కులు వెతక్కుండా, యూత్‌ఫుల్ సన్నివేశాల్ని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ‘వన్ టైమ్ వాచబుల్’ అనిపిస్తుంది. ఎలా చూసినా, ఇది నిరాశపర్చే సినిమా అయితే కాదు.
