Home » ‘రిపోర్టింగ్ లైవ్’ రివ్యూ: ఇసుకాసురుడి గుట్టు రట్టు చేశారిలా.!

‘రిపోర్టింగ్ లైవ్’ రివ్యూ: ఇసుకాసురుడి గుట్టు రట్టు చేశారిలా.!

by Mudra369 Editorial Desk
0 comments
Reporting Live Review

Reporting Live Review.. బంగారం స్మగ్లింగ్ గురించీ, మాదక ద్రవ్యాల గురించీ.. నిత్యం మీడియాలో వార్తా కథనాల్ని చూస్తుంటాం.! ఇసుక మాఫియా గురించి కూడా అలానే చూస్తుంటాం.

మట్టి మాఫియా, ఇసుక మాఫియా.. మనుషుల్ని చంపేస్తుందనీ, రాజకీయాల్ని శాసిస్తోందనీ.. తరచూ వార్తా కథనాలు, విశ్లేషణలు దర్శనమిస్తుంటాయ్.!

దేశంలో ఏ నది కూడా ఇప్పుడీ ఇసుక మాఫియా నుంచి తప్పించుకోలేదు.! దోపిడీ.. దోపిడీ.! నదీ మార్గాలు మారిపోతున్నాయ్.. ఆకస్మిక వరదలతో ముంచెత్తేస్తున్నాయ్. అన్నిటికీ కారణం ఇసుక మాఫియానే.!

అందరికీ అన్నీ తెలుసు.. కానీ, ఎవరికీ ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే, రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా నడుస్తోంది కాబట్టి.

Reporting Live Review.. ఇసుక మాఫియా..

ఈ ఇసుక మాఫియా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయ్.. వస్తూనే వున్నాయ్. బాలీవుడ్ నుంచీ ఓ సినిమా వచ్చింది. ‘రిపోర్టింగ్ లైవ్’ పేరుతో.!

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, నాజర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. మిగతా నటీనటులెవరూ మనకి పెద్దగా తెలిసినవాళ్ళు కాదు.!

పరిణీతి చోప్రా ఓ జర్నలిస్ట్. ఓ కెమెరామెన్‌తో కలిసి ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తుంటుందామె.! ఇద్దరూ కలిసి ఓ బ్రిడ్జి కూలిన ఘటనను ‘కవర్’ చేయడానికి వెళతారు.

అక్కడే, ఆ జర్నలిస్ట్ ద్వయానికి అక్కడ జరుగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. బ్రిడ్జి కూలిపోవడానికి, 17 మంది చనిపోవడానికి ఇసుక మాఫియానే కారణమని తెలుసుకుంటారు.

తమ ప్రాణాల్ని పణంగా పెట్టి, ఇసుక మాఫియాకి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించి, తమ న్యూస్ ఛానెల్ యాజమాన్యానికి అందజేస్తారు. దాంతో, ఛానెల్ రేటింగ్ పెరుగుతుంది.

అసలు కథ.. అక్కడే మొదలైంది..

కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మరిన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఆ జర్నలిస్టు ద్వయానికి, తాము పని చేస్తున్న సంస్థ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది.

అయితే, ఆ సంస్థలోనే వాళ్ళకి ఓ వ్యక్తి (ఛానెల్ పాత యజమాని) నుంచి మద్దతు దొరుకుతుంది. దానిపై ఆ ఇద్దరూ పరిశోధన కొనసాగిస్తారు.

ఇంతకీ, ఈ మాఫియా వెనుక వున్నదెవరు.? ఆ మాఫియా నుంచి ఈ జర్నలిస్టులకు ఎదురైన సవాళ్ళు ఏంటి.? అన్నది మిగతా కథ.!

ఇసుక మాఫియా, దానికి రాజకీయ అండదండల గురించీ, మీడియాలో ఇలాంటి కథనాలు తొక్కిపెట్టేయడం గురించీ.. కాస్త ‘బోల్డ్’ గానే చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

తెలుగులోనూ డైలాగ్స్ బావున్నాయి. చూస్తున్నంతసేపూ ఇదేదో డబ్బింగ్ సినిమాలా అనిపించదు. స్ట్రెయిట్ తెలుగు సినిమానే.. అనిపిస్తుంది. అంత బాగా డబ్ చేశారు.

ఎండింగ్.. ఇది ముగింపు కాదు, కఠోర వాస్తవం..

పరిణీతి చోప్రా చక్కని నటనా ప్రతిభను ప్రదర్శించింది. మిగతా నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిజానికి, ఇలాంటి సినిమాలు తెరకెక్కించాలన్నా సాహసించాల్సిందే.

చివర్లో, జర్నలిస్టులిద్దర్నీ ఇసుక మాఫియా చంపేసినట్లే చూపించారు. ఆ ఎండింగ్ చాలామందికి నచ్చకపోవచ్చుగానీ.. అదే జరుగుతోంది.

పట్టణీకరణ తాలూకు ప్రభావం, నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాల్ని ఎలా నాశనం చేస్తుందో చాలా చక్కగా చూపించారు ఈ ‘రిపోర్టింగ్ లైవ్’లో.!

సినిమాల్లో చూపించడానికీ, ఊసుపోక చర్చించుకోవడానికీ.. ఇలాంటి అంశాలు ఇంట్రెస్టింగ్‌గానే వుంటాయిగానీ.. మనల్ని చంపేస్తున్నా.. ఇలాంటి అంశాలపై చిత్తశుద్ధితో స్పందించడం మనమెప్పుడో మర్చిపోయాం.

ప్రకృతి, పశు పక్షాదులు.. ఇవన్నీ నాశనమైపోతున్నాయన్నది ఓ కోణం.! ఇసుక మాఫియా మనిషే చచ్చిపోతున్నాడన్నది అత్యంత కీలకమైన అంశం.!

ప్రారంభం కాస్త ‘స్లో’గా అనిపించినా.. క్రమంగా వేగం పుంజుకుని, కథలో లీనమయ్యేలా వుంది ‘రిపోర్టింగ్ లైవ్’.! ఇప్పుడిది అవసరం.! దీనిపై ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవడం ఇంకా అవసరం.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group