భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO), అంతరిక్ష ప్రయోగాల్లో తనదైన ముద్రను ఏనాడో వేసింది. చంద్రుడి మీద మనిషి ఎప్పుడో యాభయ్యేళ్ళ క్రితమే అడుగు పెట్టినా, జాబిల్లికి సంబంధించి చాలా రహస్యాల చిక్కుముడులు ఇంకా వీడలేదు.. ఆ చిక్కు ముడులు విప్పే క్రమంలో ‘చంద్రయాన్-1’ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఆ చంద్రయాన్-1 ఇచ్చిన ఉత్సాహంతో, చంద్రయాన్-2కి (Chandrayaan 2 ISRO GSLV) ఇస్రో శ్రీకారం చుట్టింది.
నిజానికి, జులై 15న ఇస్రో, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ‘చంద్రయాన్-2’ (Chandrayaan 2 ISRO GSLV) ప్రయోగం చేపట్టాల్సి వున్నా, ప్రయోగానికి సరిగ్గా 56 నిమిషాల ముందు, రాకెట్‌లో చిన్నపాటి సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దాంతో, ప్రయోగం అప్పటికప్పుడు నిలిచిపోయింది.
అంతే, చాలామంది ‘ఇస్రో’పై సెటైర్లు షురూ చేసేశారు. అలా సెటైర్లు వేసినోళ్ళంతా, ‘ఇస్రో’ ఘనతల్ని చూసి కుళ్ళుకున్నవారే. ఎవరైతే వెటకారం చేశారో, వారి నోళ్ళను మూయించేయడానికి ‘ఇస్రో’ పెద్దగా టైమ్ తీసుకోలేదు. సరిగ్గా వారం తిరగకుండానే విజయవంతంగా జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ని నింగిలోకి పంపింది ఇస్రో.
‘జీఎస్‌ఎల్‌వీ’ రాకెట్‌ని నాటీ బాయ్ అనీ, ఫ్యాటీ బాయ్ అనీ ‘ఇస్రో’ పిలుచుకోవడం అందరికీ తెల్సిన విషయమే. క్రయోజనిక్ ఇంజన్ విషయమై చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతుండడమే అందుక్కారణం. అయినాగానీ, ‘జీఎస్‌ఎల్‌వీ’ భారత అంతరిక్ష పరిశోధనల్లో అత్యవంత విలువైన ‘అస్త్రం’.
వారం రోజులు ఆలస్యమైతేనేం, ‘అంతకు మించిన’ ఫలితం రాబట్టామని ఇస్రో ఛైర్మన్ శివన్ చెప్పారంటే, జీఎస్‌ఎల్‌వీ ఎంత గొప్పగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ దూసుకుపోయింది. భూ కక్ష దాటి, చంద్రుడి (Chandrayaan 2 ISRO GSLV) కక్షలోకి చేరుకుని.. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి.. చంద్రుడి మీద అది ల్యాండ్ అయి.. ఆ ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి మీద నడుచుకుంటూ వెళ్ళే ఆ అద్భుత క్షణాల కోసం 130 కోట్ల మంది భారతీయులే కాదు, ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది.
నాసా, చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించి వుండొచ్చుగాక. కానీ, ఆ నాసా ఇప్పుడు ‘చంద్రయాన్-2’ (Chandrayaan 2 ISRO GSLV) ప్రయోగం గురించి ఆసక్తి ప్రదర్శిస్తోంది. అంటే, భారత సాంకేతికతపై అమెరికాకి వున్న నమ్మకం, అవసరం ఏంటన్నది అర్థమవుతున్నట్లే కదా.!
ఓ హాలీవుడ్ సినిమాకయ్యే ఖర్చుతో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టేసింది ఇస్రో. ‘ఉపగ్రహం ఖరీదు.. రోబో 2.0 సినిమా ఖర్చుతో సమానం..’ అని బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ పేర్కొన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి తీరాలి.
చౌకగా, ఉపగ్రహాల్ని నింగిలోకి పంపడంలో ఇస్రో తర్వాతే ఎవరైనా. భారతదేశానికి అవసరమైన అంతరిక్ష పరిశోధనలు చేస్తూనే, ఇంకోపక్క విదేశీ ఉపగ్రహాల్ని నింగిలోకి పంపడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ‘ఇస్రో’ ఘనత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రయాన్-2 (Chandrayaan 2 ISRO GSLV) తర్వాత ఇస్రో ప్లాన్ ఏంటో తెలుసు కదా.? మానవ సహిత అంతరిక్ష యాత్ర.!