హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi Rowdy Baby), చాలామంది హీరోయిన్లలా వెండితెరపై గ్లామరస్ రోల్స్‌లో కనిపించదు. అలాగని, ఆమె గ్లామర్‌కి వ్యతిరేకం కాదు.
‘నేను అందాల ప్రదర్శన చేస్తే బావుండదేమో. బహుశా నాకు అది అస్సలేమాత్రం బావుండని అంశం కావొచ్చు. అందుకే, నేను అందాల ప్రదర్శన చేయలేను. అయినా, గ్లామర్ అనేది అంగాంగ ప్రదర్శనలో వుండదు..’ అని చాలా ఇంటర్వ్యూల్లో సాయి పల్లవి చెప్పింది.
ఆ సంగతి పక్కన పెడితే చాలామంది నటీనటులు ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా..’ అని చెబుతుంటారు. కొందరు డాక్టర్లు నటనా రంగంలోకి వచ్చిన సందర్భాలూ లేకపోలేదు.
ఇక, సాయిపల్లవి విషయానికొస్తే, ఆమెకు వైద్య వృత్తి పట్ల మక్కువ ఎక్కువ. అందుకే, కష్టపడి వైద్య విద్య అభ్యసించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే, ఇంకోపక్క చదువు కూడా పూర్తి చేసింది.
తాజాగా వైద్య విద్యకు సంబంధించి కొన్ని పరీక్షలు రాసింది. ఈ క్రమంలో ఆమె పరీక్షా కేంద్రానికి వెళితే, అక్కడామెను గుర్తు పట్టిన తోటి విద్యార్థినీ విద్యార్థులు.. ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ‘నాకు చదువే ముఖ్యం. చదువుకి సినిమా అడ్డంకిగా మారితే, సినిమాల్నే వదిలేస్తానేమో..’ అని చాలా సందర్భాల్లో చెప్పింది సాయి పల్లవి.
అలాగని ఆమె సినిమాల్ని వదిలెయ్యలేదు. ముందే చెప్పుకున్నాం కదా.. సాయి పల్లవి (Sai Pallavi Rowdy Baby) మిగతా హీరోయిన్లలా కాదు. ‘ఫిదా’ సినిమాలో డైలాగ్ గుర్తుంది కదా.! ‘భానుమతి.. ఒక్కటే పీస్..’ అని.. అలా, సాయి పల్లవి కూడా.. సింగిల్ పీస్.! అవును, ఆమె వెరీ వెరీ రేర్ పీస్.
ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకుడు. మరోపక్క వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ‘విరాట పర్వం’ సినిమాలోనూ సాయి పల్లవి నటిస్తోంది.
ఇవి కాక తమిళంలోనూ, మలయాళంలోనూ సాయి పల్లవి పలు సినిమాలు చేస్తోన్న సంగతి తెల్సిందే.