Table of Contents
మిలిటరీ గెటప్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబు.. సుదీర్ఘ విరామం తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడం.. ఎంటర్‌టైనింగ్ మూవీస్ తెరకెక్కించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి దర్శకత్వం.. వీటితోపాటు, ట్రెండింగ్ బ్యూటీ రష్మిక మండన్న హీరోయిన్ కావడం.. ఇలా అన్నీ శుభ శకునాలే ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru Movie Review) సినిమాకి.
తమ అభిమాన హీరో మరోమారు ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడనే సంతోషంలో వున్న అభిమానుల్ని ‘సరిలేరు నీకెవ్వరు’ మెప్పించిందా.? అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ ఈ సినిమాతోనూ కొనసాగుతుందా.? లక్కీ బ్యూటీ రష్మిక మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందా.? రీ-ఎంట్రీతో విజయశాంతి సత్తా చాటడం ఖాయమేనా.? ఇంకెందుకు ఆలస్యం.. వివరాల్లోకి వెళ్ళిపోదాం.
నటీనటులు: మహేష్, విజయశాంతి, ప్రకాష్‌రాజ్, రష్మిక మండన్న, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సంగీత, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు
బ్యానర్: ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఘట్టమనేని మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేదీ: జనవరి 11, 2020
అసలు కథ..
కాశ్మీర్ టు కర్నూల్.. ఓ ఆర్మీ మేజర్ కథ ఇది. నిజాయితీకి నిలెవుత్తు నిదర్శనం ఓ మహిళా లెక్చరర్. తప్పులు చేయడాన్నే ఓ హోదాగా పెట్టుకున్న ఓ పొలిటీషియన్. ఇలా ఈ ముగ్గురి మధ్యా నడిచే కథ ఈ ‘సరిలేరు నీకెవ్వరూ’. ఆ లెక్చర్‌కి ఓ కష్టమొస్తుంది. ఆమె ఇంటి సభ్యుడిగా మారిపోయిన మేజర్, ఆమెను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. సరిహద్దుల్లో శతృవుల్ని తరిమికొట్టడమే కాదు.. దేశంలో అక్రమార్కులైన ప్రజా ప్రతినిథుల్లోనూ మార్పు తీసుకురావాలన్న ఆ మేజర్ ఆలోచన ఫలించిందా.? అంటే, అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు ఎలా చేశారంటే..
సూపర్ స్టార్ మహేష్‌బాబు ఫుల్ ఎనర్జీతో కన్పించాడు. తన పాత్ర తెరపై పరిచయమయ్యింది మొదలు, ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా వన్ మేన్ షో అన్పించేశాడు మహేష్. ఈ సినిమాలో డాన్సులతోనూ అదరగొట్టేసి అభిమానులకి నిజంగానే పెద్ద పండగ తీసుకొచ్చాడు సూపర్ స్టార్. హీరోయిన్‌తో కెమిస్ట్రీ అదిరింది. కామెడీ టైమింగ్‌తో సత్తా చాటాడు. ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఆల్‌రౌండ్ షో.. అనడం అతిశయోక్తి కాదేమో.
హీరోయిన్ రష్మిక మండన్న ఆన్ స్క్రీన్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఈ సినిమాలో డబుల్ ఎనర్జీతో కన్పించింది. సూపర్ స్టార్ మహేష్‌తో సినిమా కదా.. మరింత చెలరేగిపోయింది. డాన్సుల్లో దుమ్ము రేపేసింది. మిల్కీ బ్యూటీ తమన్నాస్పెషల్ సాంగ్ ఈ సినిమాకి మరో హైలైట్.
సీనియర్ నటి విజయశాంతి చాలాకాలం తర్వాత తెరపై కన్పించారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌లో అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదు. ఆమె అలా తెరపై కన్పిస్తోంటే.. అభిమానులకి ఓ రేంజ్‌లో కిక్ లభించింది. విజయశాంతి తప్ప ఇంకెవర్నీ ఆ పాత్రలో ప్రేక్షకులు ఊహించుకోలేరేమో. ప్రకాష్ రాజ్‌కి అలవాటైన పాత్రే ఇది. ఆయన తనకు లభించిన పాత్రలో ఒదిగిపోయారు.
మిగతా పాత్రధారుల్లో రాజేంద్ర ప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, పోసాని, సంగీత, బండ్ల గణేష్ తదితరులంతా తమ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు..
టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా సినిమాటోగ్రఫీని అభినందించాలి. విజువల్స్ చాలా బావున్నాయి. సంగీతం విషయానికొస్తే, మ్యూజికల్ ఆల్బవ్‌ు సినిమా రిలీజ్‌కి ముందే సూపర్ హిట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బావుంది. ఎడిటింగ్ కూడా గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. అస్సలేమాత్రం రాజీ పడకుండా సినిమా కోసం ఖర్చు చేశారు. గుర్తుండిపోయే డైలాగ్స్ చాలానే వున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్.. ఇలా అన్ని కోణాల్లోనూ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
విశ్లేషణ
సూపర్ స్టార్ మహేష్‌బాబు నుంచి అభిమానులు ఎలాంటి సినిమాని ఆశిస్తారో అలాంటి సినిమానే చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌నీ, కర్నూలు ఫ్యాక్షన్‌కి లింక్ చేయడం, సూపర్ స్టార్ మహేష్ – లేడీ సూపర్ స్టార్ అమితాబ్ మధ్య సీన్స్.. ఇలా అన్నీ బాగా కుదిరాయి. హీరోయిన్‌ని కథలో లింక్ చేసే విషయంలోనే మరింత జాగ్రత్త తీసుకుని వుండాల్సిందేమో. ఓవరాల్‌గా ఇది పక్కా సంక్రాంతి సినిమా. సంక్రాంతి పండగ లాంటి సినిమానే. సంక్రాంతి సీజన్‌లో సగటు సినీ అభిమాని ఆశించే అన్ని అంశాలూ ఇందులో పొందుపర్చి వుండడంతో సంక్రాంతి హిట్ (Sarileru Neekevvaru Movie Review) సెంటిమెంట్ అనిల్ రావిపూడికి ఇంకోసారి కలిసొచ్చినట్లే కన్పిస్తోంది.
ఫైనల్ టచ్
సంక్రాంతి వసూళ్ళ జోరులో సరిలేరు నీకెవ్వరూ..