క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina IPL Suspense), ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో ఆడాల్సి వుంది. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టులో సురేష్ రైనా కీలక ఆటగాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కి అనూహ్యంగా గుడ్ బై చెప్పేసిన విషయం విదితమే. ఇప్పుడేమో, ఐపీఎల్‌కి కూడా దూరమయ్యే పరిస్థితి వచ్చింది.
ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్ళాడుగానీ.. అందరికీ షాకిస్తూ, స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు. సురేష్ రైనాకి కరోనా సోకడంతోనే ఆయన స్వదేశానికి వచ్చేశాడన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో, యూఏఈలో ‘క్వారంటైన్’ భరించలేక, ఇండియాకి వచ్చేశాడనీ అన్నారు.
ఇవేవీ కాదు, అక్కడి సౌకర్యాలు నచ్చక అహంకారంతో అలిగి మరీ అతను స్వదేశానికి వచ్చేశాడనీ గుసగుసలు విన్పిస్తున్నాయి. ‘చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో సురేష్ రైనా అనుబంధం తెగిపోయింది..’ అంటూ సీఎస్కే యాజమాన్యం తరఫున శ్రీనివాసన్ ప్రకటన కూడా చేసేశారు. ఇంతలోనే సీన్ మారిపోయింది.
‘అబ్బే, అదేమీ లేదు’ అని శ్రీనివాసన్ కవరింగ్ డైలాగ్ పేల్చారు. తన బంధువులపై కొందరు దాడి చేశారనీ, ఈ క్రమంలో తాను ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోవాల్సి వచ్చిందనీ, ఇది మాటలకు అందని విషాదమనీ, ఈ సమయంలో తాను తన బంధువులకు అండగా వుండాలి కాబట్టే, యూఏఈ నుంచి ఇండియాకి వచ్చేశానని సురేష్ రైనా వివరణ ఇచ్చాడు.
తన బంధువులకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటూ పంజాబ్ ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశాడు. ‘సురేష్ రైనా కుటుంబానికి సానుభూతి’ అంటూ పేర్కొన్న పంజాబ్ ప్రభుత్వం, దోషుల్ని శిక్షిస్తామనీ పేర్కొంది. ఇక, ఇప్పుడు అంతా కుదుటపడినట్లుంది.
‘నేను తిరిగి ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్ళే అవకాశాలు లేకపోలేదు’ అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. ‘ఈ విషయమై జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. ధోనీ కూడా సురేష్ రైనా పట్ల సానుకూలంగానే వుంటాడేమో..’ అని శ్రీనివాసన్ చెప్పడం కొసమెరుపు.
ఇంతకీ, యూఏఈలో ఏం జరిగింది.? వేరే కారణాలేవీ లేకుండానే శ్రీనివాసన్, సురేష్ రైనా (Suresh Raina IPL Suspense) మీద అంతలా మాటల దాడి చేస్తాడా.? ఏదో జరిగింది.! అదేంటో ఇప్పట్లో బయటకు పొక్కేలా కన్పించడంలేదు. ఇంతకీ, సురేష్ రైనా ఐపీఎల్ ఆడతాడా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.