Table of Contents
తుపాకిలోంచి దూసుకొచ్చిన బుల్లెట్.. మనిషి తల్లోంచి బయటికొచ్చేయడం చాలా అరుదు. అలా ఒక్క తలకాయ కాదు.. ఒకే బుల్లెట్ వరుసగా నలుగురు తలకాయల్లోంచి బయటికొచ్చేస్తుంది. ‘సిటీమార్’ (Seetimaarr Review) సినిమాలోని ఈ సీన్ ముందుగా పెట్టి సినిమా ఎలా ఉండబోతోంది.? అన్నదానిపై స్పష్టత ఇచ్చేశాడు దర్శకుడు.
సినిమా చూసినంత సేపు మైండ్‌ని ఆప్సెన్స్‌లో పెట్టేసి చూసేయండి.. అని చెప్పినట్టుంది దర్శకుడు. సంపత్ నంది అనగానే రిచ్ మేకింగ్.. అనే అభిప్రాయం సినీ జనాల్లో ఉంది. రిచ్ మేకింగ్ సరే, లాజిక్‌లెస్ మేకింగ్.. అస్సలు సబబు కాదు.. అన్న విషయాన్ని మర్చిపోతే ఎలా.?
వై దిస్ కొలవెరి సంపత్ నంది.?
టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ సంపత్ నంది నుంచి సినిమా వస్తోందంటే, ఏదో కొత్తగా ఆశించొచ్చు.. అనే అభిప్రాయాన్ని ఇకపై పాతరేసేయొచ్చు. గోపీచంద్‌లాంటి హీరో, తమన్నా లాంటి హీరోయిన్, రెహ్మాన్ లాంటి సీనియర్ నటుడు, భూమిక లాంటి టాలెంటెడ్ నటి.. ఇంతకన్నా ట్రెజర్ ఏముంటుంది.? సంపత్ నందికి.

రావు రమేష్‌ని కూడా సరిగ్గా వాడలేదు. సెకండ్ హీరోయిన్ దిగంగనా ఎందుకో ఎవరికీ తెలీదు. విలన్ తరుణ్ అరోరా ఏం చేశాడో అతనికే తెలీదు.
ఓ బ్యాంక్ మేనేజర్, కబడ్డీ కోచ్‌గా మారి (పార్ట్ టైమ్) ఊళ్లో అమ్మాయిలకి శిక్షణ ఇస్తాడు. ఊరు, అందులో ఓ స్కూలు, దానిపై కార్పొరేట్ కన్ను, స్కూలును కాపాడుకోవడానికి అర్ధం పర్ధం లేకుండా కబడ్డీ అనే ఓ సాకు. ఎంత వెతికినా కనెక్షన్ అస్సలు సెట్టవ్వదు.
కలగాపులగమైపోయింది..
మాస్, కమర్షియల్, ఎంటర్‌టైనర్ చేయాలనుకుంటే అది వేరే లెక్క. దీంతో ఏదో మెసేజ్ ఇద్దామనుకున్నారు. ఆ మెసేజ్ ఏంటో సినిమా చూశాకా ఎవరికీ గుర్తుండదు. గోపీచంద్, తమన్నా మధ్య కెమిస్ర్టీకి ఏం పేరు పెట్టాలో అర్ధం కాదు. కలగాపులగం చేసి పాడేశారు.
Also Read: సినిమా రివ్యూ: ‘టక్ జగదీష్’ బల్బు వెలిగిందా.?
ఓ సీన్‌లో కిడ్నాపైన కబడ్డీ ఆటగాళ్లను రక్షించడానికి బోర్డు మీద స్కెచ్ వేస్తాడు హీరో. ఆ గదిలోకి హీరో బావ వస్తాడు. అతనో సిన్సియర్, పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. కానీ, బోర్డు మీదున్న స్కెచ్‌ని కనీసం పట్టించుకోడు. ఇదొక్కటి చాలు సినిమా ఎంత అయిష్టంగా తెరకెక్కిందో చెప్పడానికి.
కబడ్డీ జట్టులో ఓ ప్లేయర్ గొంతుని విలన్ కోసేస్తాడు. ఒక్క రోజులోనే ఆ ప్లేయర్, బెడ్ మీద నుంచి లేచిపోయి, కబడ్డీ కోర్టులోకి వచ్చేసి, బీభత్సమైన ఫీట్ చేసేసి జట్టును గెలిపించేస్తుంది. కామెడీ సినిమాల్లో ఇలాంటివి పెట్టొచ్చు కానీ, సీరియస్ యాక్షన్ సినిమాల్లో, అదీ క్లైమాక్స్ సీన్ కోసం ఇంత కామెడీ పెడితే ఎలా.?
వీళ్ళందరికీ అసలేమయ్యింది.?
నటీ నటుల్లో ఎవ్వరూ బాగా చేయలేదు. గోపీచంద్, తమన్నా సహా అందరూ వృధా అయ్యారు. ఎవ్వరూ ఏమీ చేయడానికి లేదు. ‘జ్వాలా రెడ్డి..’ పాట హిట్టయ్యింది. మాస్ జనాలకు నచ్చే యాక్షన్ ఎపిసోడ్లు ఓకే. సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ మాత్రం చాలా వీకే.
సంపత్ నంది నుంచి ఇలాంటి సినిమా ఎవరూ ఆశించరు. గోపీచంద్ నుంచి కూడా. కరోనా కారణంగా రిలీజ్ లేటయ్యి, ప్రేక్షకుల ముందుకొచ్చి ఉసూరుమనిపించింది. ఓటీటీలో సినిమా చూస్తున్నంత సేపూ సినిమాని వీలైనంత ఎక్కువ సార్లు ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టేసినా తేడీ అస్సలు తెలీని సినిమా సీటీమార్ (Seetimaarr Review).
- BeeyeS