Table of Contents
‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాలొచ్చాక, తెలుగు సినీ పరిశ్రమ ఆలోచనలు మారిపోయాయా? అంటే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాటల్లో ‘అవును’ అనే సమాధానం వస్తుంది. ‘నేను కూడా అలా మారిపోవాలేమో’ అని ‘దిల్’ రాజు వ్యాఖ్యానించారు తాజాగా ‘హుషారు’ అనే సినిమా ఫంక్షన్‌లో.
‘దిల్’ రాజు చెప్పింది, వెండితెరపై ఆన్ స్క్రీన్ ‘ఘాటు ఘాటు లిప్ కిస్ సీన్స్’ గురించి. సినిమా అంటేనే గ్లామర్ కాబట్టి, ఆ గ్లామర్ కోసం ఒక్కో డైరెక్టర్ ఒక్కో రకంగా ఆలోచిస్తుంటాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, హీరోయిన్ బొడ్డు మీద ‘పండ్లను’ విసురుతుంటారు.
‘ఝుమ్మంది నాదం’ సినిమాలో అయితే, కొబ్బరిచెక్కలతో ఆయన చేసిన ‘గ్లామరస్ ప్రయత్నం’ ఆ తర్వాత వివాదాస్పదమయ్యింది కూడా. అందాల భామ తాప్సీ, ‘బొడ్డు మీద కొబ్బరి చెక్కలా.? అందులో గ్లామర్ ఏముంది.?’ అని బాలీవుడ్‌కి వెళ్ళాక చేసిన వ్యాఖ్యలతో అంతా అవాక్కయ్యారు.
అయితే, ఆ తర్వాత తాప్సీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అది వేరే అంశం.
ట్రెండ్ మారింది గురూ
ఈ మధ్య కాలంలో లిప్ కిస్ లేకపోతే సినిమా ఆడటం కష్టమేనన్న అభిప్రాయం కొందరు దర్శక నిర్మాతల్లో కన్పిస్తోంది.
ఇంకొందరైతే, ‘లిప్ కిస్’ సీన్స్ వుంటే చాలు, సినిమా ఆడేస్తుందన్న నమ్మకంతో అలాంటి సీన్స్ రాసుకుని, వాటి చుట్టూ కథలు అల్లేస్తున్నారు. అందరూ కాకపోయినా, చాలామంది ఇప్పుడు చేస్తున్నది అదే పని. ఎక్కువగా ఈ ట్రెండ్ యంగ్ డైరెక్టర్స్‌లో కన్పిస్తోంది.
ఓ సినిమా సక్సెస్ అయితే, ఆ ఫార్మాట్‌లో అలాంటి సినిమాలే రావడం మామూలే. ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా సాధించిన వసూళ్ళతో ఇప్పుడన్నీ అదే జోనర్‌లో, అలాంటి హాట్ అప్పీల్‌తోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ‘ముద్దు’ ఒక్కటీ వుంటే సరిపోదు, అంతకు మించిన హాట్ అప్పీల్ సినిమాలో వుంటే, ‘ఓ వర్గం ఆడియన్స్’ ఆ సినిమా పట్ల ప్రత్యేకంగా ఆకర్షితులవుతున్నారు.
బూతు సినిమాలంటే ఒళ్ళు మండిపోద్ది
ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి సినిమాల్ని ఒకప్పుడు ‘బూతు సినిమాలు’ అనేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.
మెచ్యూర్డ్ లెవల్స్ తక్కువగా వున్నవారే, బూతు సినిమాలుగా అపహాస్యం చేస్తారనీ.. ట్రెండ్‌కి తగ్గట్టు మెచ్యూరిటీతో ఆలోచిస్తే.. ఆ సన్నివేశాల్లో కళాత్మకత అర్థమవుతుందనీ ఈ తరం దర్శకులే కాదు, నటీనటులూ క్లాసులు తీసుకుంటున్నారు.
సినిమా కోసం ఏం చేయడానికైనా వెనుకంజ వేసేది లేదని అవకాశాల కోసం చెప్పే అందాల భామలు.. ఆ తర్వాత, ‘తెలిసీ తెలియని వయసులో నా చేత అలాంటివి చేయించారు..’ అంటూ గగ్గోలు పెట్టడం కూడా చూసేశాం. తప్పించుకోవడానికి ఇదొక మార్గం అన్నమాట.
అర్జున్ రెడ్డి.. ఆ లెక్కే వేరు
ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో లిప్ టు లిప్ కిస్ సీన్స్ పరంగా ట్రెండింగ్ అయిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’ అందులోని ‘రా’ టచ్ చాలామందికి నచ్చేసింది.
లవ్ ఇలాక్కూడా వుంటుందా.? సినిమాని ఇంత హాట్‌గా వైల్డ్‌గా చూపించొచ్చా? అని చాలామంది ముక్కున వేలేసుకుంటూనే ఈ సినిమాని ఆదరించేశారు. ఆ తర్వాత ‘ఆ టైపులో సినిమా తీస్తే ఎలాగైనా విజయం సాధించేయొచ్చు’ అన్న నమ్మకం సినీ పరిశ్రమలో పలువురు దర్శక నిర్మాతలకు కలిగింది.
యంగ్ డైరెక్టర్స్‌కి అయితే ఈ జోనర్ పూలబాటలానే కన్పించింది.
లిప్ టు లిప్ కిస్ మొదలు పెట్టిందెవరు?
తెలుగులో ‘లిప్ టు లిప్ కిస్’ సీన్‌కి ఆన్ స్క్రీన్ పాపులారిటీ బాగా ఎక్కువ లభించడానికి కారణం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పక తప్పదు. ‘ఆర్య-2’ సినిమాలో కాజల్‌తో అల్లు అర్జున్‌కి లిప్ కిస్ సీన్ ఒకటి వుంటుంది. ఆ సీన్ అప్పట్లో పెను సంచలనం.
అయితే అది టెక్నికల్‌గా ఓ మ్యాజిక్ చేసి తీసిన సీన్ తప్ప, అది నిజం లిప్ కిస్ సీన్ కాదని ఆ తర్వాత అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ చెప్పారు. అందులో కొంత నిజం వుండి వుండొచ్చుగాక. కానీ, తెరపై చూస్తే.. గాఢమైన ముద్దులానే కన్పిస్తుంది.
పాత సినిమాల్లో అయితే ఇలాంటి సీన్స్ వచ్చేటప్పుడు ఏ పువ్వునో అడ్డంగా పెట్టి.. అసలు వ్యవహారం కన్పించనీయకుండా చేసేవారు. ‘ఆర్య-2’ లిప్ కిస్ తర్వాత, కొంతకాలం అలాంటి సీన్ల జోలికి చాలామంది వెళ్ళలేదుగానీ, ఈ మధ్యకాలంలో లిప్ కిస్ సీన్స్ సర్వసాధారణమైపోయాయి.
బికినీ బలాదూర్
ఒకప్పుడు బికినీల్లో హీరోయిన్లు కన్పించడం ఓ ట్రెండ్. బికినీలేం ఖర్మ.. బికినీ కా బాప్ అనే స్థాయిలో అందాల విందు చేయించేస్తున్నారు హీరోయిన్లతో చాలామంది దర్శకులు. దాంతో, బికినీ ట్రెండ్ దాదాపుగా అటకెక్కేసింది.
అయితే అప్పుడప్పుడూ ఆ బికినీ గ్లామర్ కూడా సినిమాకి కాసుల పంట పండిస్తూనే వుందనుకోండి. అది వేరే సంగతి. అస్సలేమాత్రం వల్గారిటీ లేకుండా, అసలు గ్లామరే లేకుండా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయాల్ని అందుకుంటోంటే, ఇంకొన్ని సినిమాలు కేవలం ‘రా అండ్ హాట్’ సీన్స్‌తో వసూళ్ళను కొల్లగొట్టేస్తున్నాయి.
సినిమాలో కథ కాకరకాయ లేకపోయినా కేవలం హాట్ సీన్స్‌తోనే పెద్ద సినిమాలకూ ఝలక్ ఇచ్చే స్థాయికి చిన్న సినిమాలు ఎదిగినందుకు సంతోషపడాలా.? బాధపడాలా?