Sir Movie Review.. కమర్షియల్ సినిమాలు వేరు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వేరని అంటుంటారు. అందులోనూ కొంత వాస్తవం లేకపోలేదు. కథ నేల విడిచి సాము చేస్తే.. దాన్ని కమర్షియల్ సినిమా అనాలేమో.!
కానీ, అన్ని సినిమాలూ ఒకేలా వుండవు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతోనూ కమర్షియల్ హిట్ కొట్టొచ్చు. కాకపోతే, ఆ ‘చిట్కా’ తెలియాలంతే.!
తమిళ హీరో ధనుష్‌తో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి.. అందునా తెలుగు బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’. తెలుగులో టైటిల్ ‘సార్’ కాగా, తమిళంలో టైటిల్ ‘వాతి’.
సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్. ఇంతకీ, ‘సార్’ అలియాస్ ‘వాతి’ ఎలా వుంది.? సినిమా కథా కమామిషు ఏంటి.?
Sir Movie Review.. ఇదీ కథా కమామిషు..
ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కార్పొరేట్ మాఫియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ప్రభుత్వ కాలేజీల్ని సర్వనాశనం చేసెయ్యాలనుకునే ఓ కార్పొరేట్ రాక్షసుడు (సముద్ర ఖని).. దాన్ని అడ్డుకునే ఓ సాధారణ లెక్చరర్ (ధనుష్).. ఇదీ క్లుప్తంగా ‘సార్’ సినిమా కథ.
‘విద్య అనేది గుడిలో పెట్టిన నైవేద్యం లాంటిది.. పంచండి. అంతేగానీ, ఫైవ్ స్టార్ హోటళ్ళలో డిష్‌లా అమ్మకండి..’ అని ఓ సందర్భంలో హీరో చెబుతాడు. ‘సార్’ కథ కమామిషు గురించి మొత్తంగా ఈ డైలాగ్‌లోనే చెప్పేశారు.
‘అవసరానికి కులం వుండదు’ అనే ఓ డైలాగ్.. అలాగే ‘అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్క రోజే ఏడుస్తారు. కానీ, వాళ్ళ అమ్మ నాన్న కొనివ్వలేని పరిస్థితి వున్నంత కాలం ఏడుస్తూనే వుంటారు..’ అని సాగే మరో డైలాగ్.. ఇలా చాలానే వున్నాయ్.
‘డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. కానీ, మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది’ అనే డైలాగ్ కూడా ఆలోచింపజేస్తుంది.
ఇది సగటు వ్యక్తి కథ.. అన్నట్లుగానే చాలా సీన్స్ అనిపిస్తాయి. దాదాపుగా ప్రతి విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రులూ.. ఈ కథతో కనెక్ట్ అవుతారని నిస్సందేహంగా చెప్పొచ్చు.

కొన్ని సాధారణ సన్నివేశాల్నీ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ తనదైన నేపథ్య సంగీతంతో వేరే లెవల్‌కి తీసుకెళ్ళాడు.
సినిమాటోగ్రపీ బావుంది. దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితం విద్యా వ్యవస్థలోని పరిస్థితుల్ని.. కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ సినిమాలో.
జెన్యూన్ అటెంప్ట్..
ఓ జెన్యూన్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. మంచి మెసేజ్‌కి అవసరమైన మేర మాత్రమే కమర్షియల్ అంశాలు జోడించి తీసిన సినిమా ఇది.
ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా సినిమా తెరకెక్కించడం ఈ రోజుల్లో పెద్ద టాస్క్. ఆ టాస్క్‌ని చాలా అందంగా పూర్తి చేశాడు దర్శకుడు. అవసరానికి తగ్గట్టు హాస్యం వుంది తప్ప.. బోర్డర్ దాటేసిన వెకిలితనం అయితే లేదు.
Also Read: హైపర్ ఆది వాడకం మామూలుగా లేదుగా.!
నిర్మాణపు విలువలు బావున్నాయ్. ఎడిటింగ్ కూడా బావుంది. ఓవరాల్‌గా ఇదొక మంచి సినిమా. అందుకే, ధైర్యంగా.. సినిమాని ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్‌గా ప్రదర్శించేశారు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల.
సంయుక్త మీనన్ పాత్ర నిడివి తక్కువే అయినా బాగా చేసింది. తెరపై హుందాగా కనిపించింది. ఆది పంచ్ డైలాగులు నవ్విస్తాయ్. సముద్ర ఖని విలనిజం ఆకట్టుకుంటుంది.
ఓవరాల్‌గా ‘సర్’ సినిమా యూత్‌కే కాదు, వారి తల్లిదండ్రులకూ బాగా కనెక్ట్ అవుతుంది. విమర్శకుల ప్రశంసలే కాదు, అవార్డులు సైతం ఈ సినిమాకి దక్కే అవకాశాల్లేకపోలేదు.