Table of Contents
గురువు అంటే బాధ్యత.. శిష్యుడిని ప్రయోజకుడిగా చూడాలనే తపనతో, ఆ శిష్యుడికి అన్ని విధాలా సహకరించేవాడే గొప్ప గురువు (Sukumar Buchibabu Sana Uppena) అవుతాడు. గురువు అంటే, తండ్రి తర్వాత తండ్రి.! మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ.. అనేది అందుకే మరి.
కానీ, ఎంతమంది గురువులు, తమ శిష్యుల్ని ప్రయోజకులుగా చూడాలనుకుంటారు. ఈ క్రమంలో బాధ్యతగా వ్యవహరిస్తారు.? శిష్యుడ్ని ప్రయోజకుడిగా చూడాలన్న తపనతో, బాధ్యతనంతా తమ భుజాల మీద మోస్తారు.? సినీ రంగంలో ఎందరో గురువులు, ఎందరో శిష్యులు.
కానీ, కొందరు మాత్రమే అసలు సిసలు గురువులన్పించుకునా్నరు. అతి కొద్ది మంది మాత్రమే అసలు సిసలు శిష్యలునిపించుకున్నారు. గురువుకి శిష్యుడంటే ‘ఉప్పెనంత’ అభిమానం, బాధ్యత.. అని సుకుమార్ – బుచ్చిబాబు సన గురించి ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా చర్చించుకుంటోంది.
గురువు అంటే బాధ్యత.. Sukumar Buchibabu Sana Uppena
తెలుగు సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావుని చాలామంది ‘గురువుగారు’ అని పిలుస్తుంటారు. దాసరి నారాయణరావు శిష్యులమని చెప్పుకునేందుకు ఎంతోమంది శిష్యులు గర్వపడుతుంటారు. అయితే, సుకుమార్ సమ్‌థింగ్ స్పెషల్.
తన శిష్యుడు బుచ్చిబాబు సన ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవడానికి సుకుమార్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. నిజానికి, దాన్ని ఆయన కష్టంగా ఏనాడూ భావించలేదేమో.
ఓ మంచి కథ తయారు చేసుకున్న బుచ్చిబాబుని, మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు పంపడంతో చేతులు దులిపేసుకోలేదు సుకుమార్. ఓ పెద్ద బ్యానర్ మైత్రీ మూవీస్‌కి బుచ్చిబాబుని (Sukumar Buchibabu Sana Uppena) అప్పగించేసి ఊరుకోలేదు. ‘ఉప్పెన’ సినిమాకి నిర్మాణ భాగస్వామ్యం కూడా తీసుకున్నాడు సుకుమార్.
సుకుమార్ సమ్‌థింగ్ స్పెషల్.. Sukumar Buchibabu Sana Uppena
సినిమా ఎక్కడిదాకా వచ్చింది.? ఎలా వస్తోంది.? కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్.. కొత్త హీరో.. సినిమా ఎలా చేస్తున్నారు.? వంటి విషయాలపై సుకుమార్ ఎప్పటికప్పుడు అన్ని విషయాలూ తెలుసుకోవడమే కాదు, తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగని ఎక్కడా సినిమాలో వేలు పెట్టలేదు. దటీజ్ సుకుమార్.
సుకుమార్ సినిమాకి ఎలాగైతే సంగీతం అందిస్తాడో, అంతకు మిన్నగా సుకుమార్ శిష్యుడికీ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడంటే.. బుచ్చిబాబుని సుకుమార్, దేవిశ్రీప్రసాద్‌కి ఎలా అప్పగించి వుంటారో అర్థం చేసుకోవచ్చు.
సినీ పరిశ్రమలో ఎందరో గురువుతున్నారు. తాము గురువులమన్న గర్వం చాలామందిలో వుండొచ్చు. కొంతమంది, శిష్యులు తమ వద్ద వున్నన్నాళ్ళూ వారిని ఉపయోగించుకుని పబ్బం గడుపుకోవచ్చుగాక. కానీ, సుకుమార్ – బుచ్చిబాబుల (Sukumar Buchibabu Sana Uppena) బంధం అలాంటిది కాదు. ఇదొక ఆదర్శవంతమైన బంధం.
గురువుని మించిన శిష్యుడు..
గురువు అంటే ఇలా వుండాలి, శిష్యడుంటే ఇలానే వుండాలి. శిష్యుడికి గురువుగా కాదు, గురువుగా మారిన శిష్యడి వద్ద శిష్యరికం చేయాలనుకునేంతలా గురువు గర్వపడే సందర్భం ఎంత ప్రత్యేకమైనది.? సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే చాలామందికి చిన్నచూపు వుంది.
నెలల తరబడి, ఏళ్ళ తరబడి దర్శకుల వద్ద పనిచేసే అసిస్టెంట్లకు అసలు సరైన గుర్తింపే వుండదు. ఏదన్నా కారణంతో సినిమా ఆగిపోతే ఇక, అసిస్టెంట్ డైరెక్టర్ పరిస్థతి అంతే. ‘మీ దగ్గర ఫలానా సినిమాకి పని చేశాను సర్..’ అని ఓ అసిస్టెంట్ డైరెక్టర్, ఓ డైరెక్టర్‌కి గుర్తు చేయాల్సిన దుస్థితి వస్తే.? రావడమేంటి, చాలామంది విషయంలో ఇలాంటిది జరుగుతుంటుంది.
‘సినిమా పిచ్చి’ అని సినిమా మీద అభిమానం గురించి చాలామంది చెబుతుంటారు. అది నిజం కూడా. ఆ పిచ్చి అభిమానంతోనే, ఉన్నత చదువులు చదివినవారు సైతం, పది వేలకో పదిహేను వేలకో అసిస్టెంట్లుగా మారిపోతుంటారు.. తమ టాలెంట్‌ని కొందరు దర్శకులు దోచుకుంటున్నా, మౌనంగా రోదించేవారెందరో.
గురువు అంటే, క్రియేటివ్ చోరుడు కాదండోయ్..
ఓ ప్రముఖ ‘సంచలన’ దర్శకుడు తన కథను దొంగిలించి, తనను మోసం చేశాడంటూ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ మీడియాకెక్కినా.. అతనికి న్యాయం జరగలేదు. బయటకొచ్చినోడు ఒకడే.. లోలోపల కుమిలిపోయేవారెందరో.! అందరూ అసిస్టెంట్లను వాడుకుని వదిలేస్తారనుకోలేం.. నిజానికి, సినీ పరిశ్రమ ఒక్కటే ఈ క్రియేటివిటీ దోపిడీకి కేరాఫ్ అనీ అనలేం. అన్ని రంగాల్లోనూ వున్నట్టే, ఇక్కడా వుంటుంది.
అయితే, ఇతర రంగాల్లో దోపిడీ జరిగితే.. వెంటనే తమ ఆలోచనల్ని వేరే మార్గం వైపు మళ్ళించుకునే అవకాశం వుంటుంది. కానీ, సినీ పరిశ్రమలో అలా వుండదు.. ఎందుకంటే, ఇక్కడ ‘సినిమా పిచ్చి’ వుంటుంది గనుక. ‘ఉప్పెన’ సినిమా విషయంలో సుకుమార్, తన శిష్యుడిని ప్రమోట్ చేసిన తీరు, శిష్యుడికి అడుగడుగునా అండగా నిలిచిన సుకుమార్ తీరు.. ఇవన్నీ చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు ‘మాక్కూడా ఇలాంటి గురువు దొరికితే బావుండు’ అనుకునేలా చేశాయి.
మరోపక్క, బుచ్చిబాబు సన (Buchibabu Sana) కూడా, తనకు పేరు రావడంతోపాటుగా.. తన గురువు (Sukumar) గౌరవాన్ని నిలబెట్టాలనే తపనతో మంచి సినిమా చేసి హిట్టు కొట్టడమే కాదు, ‘గురువుని మించి శిష్యుడు’ అనే మెప్పు పొందుతున్నప్పటికీ, ఆ గర్వాన్ని ప్రదర్శించడంలేదు. ఈ గురు శిష్యుల బంధం.. ఈ గురు శిష్యుల కథ.. (Sukumar Buchibabu Sana Uppena) భావితరాలకు స్ఫూర్తి.
