352
‘సినిమా కోసం ఎంత ఖర్చుపెట్టాలో అంత ఖర్చు పెడుతున్నాం. భారీ బడ్జెట్ అనే చెప్పాలి.. ఏం చేసినా, అది సినిమా కోసమే. లాభాలొస్తే మంచిదే. రాకపోయినా మంచిదే. ఎందుకంటే, ఇది చిరంజీవి కోసం తీస్తున్న సినిమా. పన్నెండేళ్ళ కల ఇది. ఆ కల ఇప్పుడు నిజమవుతోంది..’ అంటూ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ, తన తండ్రి చిరంజీవి నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి టీజర్ రిలీజ్ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై అంచనాలు పెరిగిపోవడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి.? డబ్బుల కోసం కానే కాదు, ఇది చిరంజీవి కోసం చేస్తున్న సినిమా.. అదీ తండ్రి కోసం తనయుడు నిర్మిస్తున్న సినిమా అంటే, ఆ సినిమా టాలీవుడ్ గత రికార్డుల్ని తిరగరాయడం కోసమేనని వేరే చెప్పాలా?
సరే, టీజర్ వచ్చింది. ఇంతకీ ఇందులో ఏముంది? అని ఆలోచిస్తే, చాలా వున్నాయ్. ఎన్ని వున్నా, అన్నిటికీ మించి చిరంజీవి వున్నాడు. అదొక్కటి చాలు అభిమానులకి.
ఓ సీన్‌లో చిరంజీవి, సైరా నరసింహారెడ్డిగా కోట బురుజు మీద నిల్చుని.. వుంటాడు. చేతిలో పొడుగాటి కర్ర. ఆ కర్ర చివరన జెండా, సగర్వంగా ఎగురుతుంటుంది. ఆ జెండానే పౌరుషం. కెమెరా అలా స్పాన్ అవుతూ, చిరంజీవి గెటప్ రివీల్ అవుతుంది. సురేందర్‌రెడ్డి టేకింగ్‌కీ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనితనానికీ నిదర్శనం ఈ ఒక్క సన్నివేశం. ‘న భూతో న భవిష్యతి’ అని ఈ ఒక్క సన్నివేశం గురించి చెప్పాల్సి వస్తే అది అతిశయోక్తి కాదు.
‘ఈ యుద్ధం ఎవరి కోసం..’ అని సైరా నరసింహారెడ్డి అడిగితే, ‘మన కోసం’ అని ఆయన మద్దతుదారులు నినదించే సన్నివేశం మరో హైలైట్. ఇంతేనా? ఇంకా వున్నాయి. ‘మగధీర’ సినిమాలో రామ్‌చరణ్, గుర్రమ్మీద.. దూసుకొచ్చే సీన్ ఒకటుంటుంది. దాన్ని తలపించేలా, మెగాస్టార్ చిరంజీవి గుర్రమ్మీద దూసుకొచ్చాడు. సైరా నరసింహారెడ్డి పాత్రలోని గాంభీర్యాన్ని చిరంజీవి, అక్కడ ఆ సన్నివేశంలో ప్రదర్శించిన తీరుకి హేట్సాఫ్ అనేది చాలా చాలా చిన్న మాట. ఆ కళ్ళల్లోంచి ఆ క్షణం నిప్పులు ప్రత్యర్థులపై కురిశాయంతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అన్నట్టుగా, గుర్రం పైకెక్కి.. ఆ గుర్రాన్ని రెండు కాళ్ళపైనా నిల్చునేలా చేసి.. అహో, ఎంతటి అద్భుతం.. అనేంతలా చూసేవారికి షాకిచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
‘చిరంజీవి సినిమా టిక్కెట్ల కోసం క్యూ లైన్లలో చొక్కాలు చింపుకున్నాన్నేను ఒకప్పుడు. ఆ చిరంజీవి సినిమాకి దర్శకత్వం వహిస్తానని అనుకోలేదు. సెట్స్‌లో చిరంజీవిని చూశాక, నేను నేర్చుకోవాల్సింది చాలా వుందని తెలుసుకున్నాను..’ అనే మాటలు సురేందర్‌రెడ్డి లాంటి దర్శకుడి నుంచి ఊరికే రాదు. సినిమా కోసం ఆయనెంత ప్యాషన్‌తో పనిచేశారో ఈ మాటలు చెప్పకనే చెబుతున్నాయి. పన్నెండేళ్ళుగా ఈ సినిమాపై పరుచూరి బ్రదర్స్ పెట్టుకున్న నమ్మకం, టీజర్ రిలీజ్‌తో దాదాపు నిజమైనట్లే. ఎందుకంటే ఇది జస్ట్ టీజర్ మాత్రమే కాదు, ఓ సినిమా..
అదీ సూపర్ హిట్ సినిమా అనేంతటి ఇంపాక్ట్ ఇచ్చింది మరి. ఎ.ఆర్. రెహమాన్ తప్పుకోవడంతో ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఛాన్స్ దక్కించుకున్న అమిత్ త్రివేది ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ ఎలా వుండబోతోందో టీజర్‌తోనే స్పష్టమైపోయింది. ‘టీజర్ వెంటాడేస్తోంది’ అనే భావన కలుగుతోందంటే, ఆ టీజర్‌లో వున్న మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌కి తోడు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా దానికి కారణమే.
ఏదిఏమైనా, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఇచ్చిన ‘పుట్టిన రోజు కానుకగా’ సైరా టీజర్‌ని అభివర్ణించడమే సబబు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి హీరోగా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా నిర్మించి, సినిమాల్లో చిరంజీవి గ్రాండ్ రీ-ఎంట్రీకి తెరలేపిన చరణ్, మరోసారి మెగా అభిమానులకి అంతకు మించిన విక్టరీని ‘సైరా’తో ఇవ్వబోతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిన తనయుడు రామ్‌చరణ్ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.
ఒకటి కాదు, రెండు కాదు.. 150 సినిమాలతో తెలుగు సినిమా బాక్సాఫీస్‌పై చెరగని ‘ముద్ర’ వేసిన మెగాస్టార్ చిరంజీవి, ‘సైరా’ సినిమాతో మరోమారు అంతకు మించిన మెగా ‘ముద్ర’ని సైరాతో వేస్తారని ఆశిస్తూ, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిద్దాం.