TDP YSRCP Political Vulgarity.. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అత్యంత తీవ్రమైన బూతులతో విరుచుకుపడ్డారు.
తమ అధినేతని బూతులు తిట్టిన అంబటి రాంబాబు ఇంటిపై దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. అంబటి రాంబాబు ఇంటిని దాదాపుగా తగలబెట్టేశారు.
మరోపక్క ఇంకో మాజీ మంత్రి జోగి రమేష్, మంత్రి నారా లోకేష్ మీద పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. సేమ్ రిజల్ట్.. జోగి రమేష్ ఇంటిని తగలబెట్టేశారు టీడీపీ కార్యకర్తలు.
కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే, వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద బూతులతో విరుచుకుపడ్డారు కొందరు టీడీపీ నేతలు.

ఫలితంగా, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై విధ్వంసానికి తెగబడ్డారు వైసీపీ కార్యకర్తలు. అప్పట్లో ఆ దాడిని సమర్థించారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అప్పట్లో వైఎస్ జగన్ తీరు అభ్యంతకరం.. ఇప్పుడు చంద్రబాబు తీరు కూడా అభ్యంతకరమే. ముఖ్యమంత్రి హోదాలో వుండి, భౌతిక దాడుల్ని జగన్ సమర్థించి వుండకూడదు.
TDP YSRCP Political Vulgarity.. బాధ్యత.. ఏదీ ఎక్కడ.?
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు, జరుగుతున్న దారుణాలపై కఠిన చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగా చూస్తుండకూడదు.!
అయినా, బూతులు తిడితే పెద్ద నాయకులుగా మారతారని ఏ రాజ్యంగంలో రాసి వుంది.? అసలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఆ బూతులేంటి.?

ఇంట్లోవాళ్ళు కూడా సమర్థించరు రాజకీయ నాయకుల బూతుల్ని. మరి, ప్రజలు ఆ బూతుల పట్ల ఇంకెంత అసహనంతో వుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వైసీపీ చేసిన బూతు రాజకీయాల నేపథ్యంలోనే ఆ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. వైసీపీ అప్పట్లో అధికారమనే అహంకారంతో విర్రవీగి, భౌతిక దాడులకు తెగబడి, మూల్యం చెల్లించుకుంది.
ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో నడుస్తోంది. ఫలితమెలా వుంటుందో 2029 ఎన్నికల్లో చూడబోతున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన బాధ్యతల్ని గుర్తెరగాలి. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదు. అదే సమయంలో, బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీల్లో చోటుండకూడదు.
బూతే భవిష్యత్తు.. అనుకుని విర్రవీగుతున్న రాజకీయ నాయకుల్ని చట్ట ప్రకారంగా కఠిమైన శిక్షలతో అదుపు చేయాల్సిందే. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
