Telangana Triangle Political Fight: రాజకీయం అంటేనే కలగాపులగం.! మేం అధికారంలోకి వస్తే ఉద్ధరించేస్తాం.. అని చెప్పని నాయకుడుండడు.
రాజకీయం కప్పల తక్కెడ వ్యవహారంగా మారిపోయాక, ఎవరెప్పుడు ఏ పార్టీలో వుంటారో.. ఏం మాట్లాడతారో ఊహించడం చాలా చాలా కష్టంగా మారిపోయింది.
అసలు విషయంలోకి వస్తే, తెలంగాణలో మూడు ముక్కల రాజకీయం నడుస్తోంది. మూడు పేకముక్కలున్నాయ్.!
ఒకటి అధికార తెలంగా రాష్ట్ర సమితి, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ, మూడోది భారతీయ జనతా పార్టీ. మరి, మజ్లిస్ పార్టీ సంగతేంటి.? అదొక ట్రంప్ కార్డ్.
తెలుగుదేశం పార్టీ కూడా వున్నా, అది ఆటలో అరటి పండు అయిపోయింది. జనసేన వున్నా లేనట్టే. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, బీఎస్పీ పార్టీతో చేసే హంగామాని పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు.
ఇదీ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ప్రస్తుతానికి.
Telangana Triangle Political Fight.. మూడు ముక్కల రాజకీయ పంచాయితీ.!
2023లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. అయితే, రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కేసింది. ముందస్తు ఎన్నికల ప్రచారంతో జాతీయ స్థాయి నాయకులు రంగంలోకి దిగుతున్నారు.

ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. బహిరంగ లేఖలు, వాటికి కౌంటర్ ఎటాక్ లేఖలూ కనిపిస్తున్నాయి. ఎవరెవరితో కలుస్తారన్నదానిపైనా రోజుకో విధంగా చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్ – బీజేపీ కలిసిపోతాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ – టీఆర్ఎస్ కలిసి నాటకాలాడుతున్నాయన్నది బీజేపీ ఆరోపణ. బీజేపీ – కాంగ్రెస్ కలిసి తెలంగాణను నాశనం చేశాయని టీఆర్ఎస్ మండిపడుతోంది.
ఇప్పటికైతే గులాబీకి తిరుగులేదుగానీ.!
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రస్తుతానికి చాలా చాలా బలంగా కనిపిస్తోంది.
కానీ, ఆ తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. గ్రేటర్ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం.
అయితే, రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతాయ్. ఎవరు ఎవరితో కలవబోతున్నారు.? మజ్లిస్ పార్టీ రాజీయమేంటి.? ఇవన్నీ ఎన్నికల వేళ కీలకంగా మారతాయ్.
Also Read: పవన్ కళ్యాణ్ వేళ్ళకున్న ఉంగరాల్లో ఏ రహస్యం దాగుందంటే.!
ఈలోగా కలగాపులగం రాజకీయం.! ఈ క్రమంలో నానా యాగీ తప్పనిసరి. కేసీయార్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఈ ముగ్గురి మధ్యా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కుర్చీ విషయమై రాజకీయ పోరు నడుస్తున్నట్లే కనిపిస్తోంది.
ఈ మూడు ముక్కలాటలో ఎడ్జ్ ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర సమితిదేగానీ, ఈక్వేషన్స్ మారకూడదన్న రూల్ అయితే ఏమీ లేదు కదా.?