Telugu Cinema Future తెలుగు సినిమాకి చాలా చాలా పెద్ద కష్టమే వచ్చింది. ఓ వైపు సినిమా టిక్కెట్ల ధరల రగడ, ఇంకో వైపు ఒమిక్రాన్.. వెరసి తెలుగు సినిమాకి ఊపిరి అందడంలేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలు రావాల్సింది పోయి, చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అవైనా విడుదలవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి.
మొన్న ‘ఆర్ఆర్ఆర్’, నేడు, ‘రాధేశ్యామ్’.. ‘వాయిదా’ ప్రకటనలు వచ్చేశాయి. దాంతో, సంక్రాంతి పండక్కి సినిమా సంబరాలు చేసుకోవాలనుకున్న తెలుగు సినీ ప్రేక్షకులు ఉస్సూరుమనాల్సి వస్తోంది. సినిమా థియేటర్ల యాజమాన్యాలదీ, పంపిణీదారులదీ, నిర్మాతలదీ.. ఇలా ఎవరి ‘ఆవేదన’ వాళ్ళది.
Telugu Cinema Future.. ఒమిక్రాన్ కొట్టిన సంక్రాంతి దెబ్బ..
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు ఎప్పుడో రావాల్సినవి.. కరోనా కారణంగానే వీటి విడుదలలు వాయిదా పడ్డాయి. సంక్రాంతి కోసం చాన్నాళ్ళ క్రితమే డేట్లు ఖరారు చేసుకున్నాయి. ఇంతలోనే ఒమిక్రాన్ వచ్చిపడింది. దాంతో, వేరే దారిలేక ఇంకోసారి వాయిదా పడాల్సి వచ్చింది.
ఇంతకీ, ‘ఆచార్య’ పరిస్థితేంటి.? అది కూడా వాయిదా పడాల్సిందేనా.? ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన సినిమాలన్నిటిదీ అదే పరిస్థితా.? ‘ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ విజ్ఞప్తి మేరకు సంక్రాంతి నుంచి వెనక్కి వెళ్ళిన ‘భీమ్లానాయక్’ ఫిబ్రవరి రేసులోంచి కూడా తప్పుకోవాల్సిందేనా.? చాలా ప్రశ్నలున్నాయ్.. సమాధానాలే దొరకట్లేదు.
ఇలాగైతే సినిమా మనుగడ ఎలా సాధ్యం.?
ఏడాది, రెండేళ్ళు.. ఇలా ఏళ్ళు గడిచిపోతున్నాయ్.. కరోనా సంకటం నుంచి తెలుగు సినిమా బయటపడ్డంలేదు. ఇండియన్ సినిమా మొత్తానికీ ఇదే పరిస్థితి. ఇంకెన్నాళ్ళిలా.? సినిమా అంటే, నిన్న మొదలు పెట్టి.. నేడు పూర్తి చేసేసి.. రేపు విడుదల చేసే వ్యవహారం కాదు. నెలల తరబడి ప్లానింగ్ జరగాలి.
Also Read: ‘ఛీ’పు లిక్కరు.. మందు బాబులూ మీకర్ధమౌతుందా.?
ఈ పాండమిక్ ఇంకెన్నాళ్ళు వేధిస్తుందోగానీ, సినిమాలన్నీ ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతోంటే, మొత్తంగా సినిమా రంగం ఇకపై కోలుకోలేనంత నష్టాల్లోకి కూరుకుపోవడం ఖాయం. ఓటీటీ అనేది ఓ చిన్న ఆప్షన్ మాత్రమే.. అదీ లేకపోతే, సినిమా అనేది ‘గతం’ (Telugu Cinema Future) అయిపోయేదేమో ఈపాటికే.!