Table of Contents
Telugu Fonts Purushoth Kumar.. అప్పట్లో.. అంటే, చాలాకాలం క్రితం టైప్ రైటింగ్ మెషీన్లు వుండేవి.! ఇక రాసుడు పనేముంటుంది.? అనుకునేవాడ్ని.! కాల క్రమంలో కంప్యూటర్లు కూడా వచ్చేశాయ్.!
ఫ్యామిలీ ఫ్రెండ్.. సోదరుడి లాంటి ఓ వ్యక్తి సూచనతోనే టైప్ రైటింగ్ మెషీన్ మీద, అక్షరాల్ని పేపర్‌పై టైప్ చేయడం నేర్చుకున్నాను.
ఆ తర్వాత కంప్యూటర్‌నీ ఆ ‘అన్న’నే పరిచయం చేశాడు.! అక్షరాల టైపింగ్, ఆ తర్వాత డెస్క్ టాప్ పబ్లిషింగ్.. కాస్త పట్టు వచ్చాక, డిగ్రీ పట్టా లేకుండానే హైద్రాబాద్ రైలెక్కేశాను.
హైద్రాబాద్ వచ్చాక, ‘కుమార్ అని.. నా ఫ్రెండ్ వున్నారు..’ అంటూ నన్ను టైప్ రైటింగ్ మెషీన్‌కీ, కంప్యూటర్‌కీ పని చేసిన ‘అన్న’ శ్రీనివాస్ తరచూ చెబుతుండేవాడు. ఇప్పుడు ఆ అన్న మన మధ్యన లేడు.
Telugu Fonts Purushoth Kumar.. ఫాంట్స్ కుమార్..
అలా, ‘ఫాంట్స్ కుమార్’ అనే వ్యక్తి నా ‘అన్న’ మాటలతోనే పరిచయం.! ఆయన కూడా నాలానే డీటీపీ చేస్తుండేవారట. బహుశా ఆయనలానే నేనూ డీటీపీ చేస్తున్నానని అనడం సబబేమో.!
నేను, మా అన్న ఓ సారి ‘ఫాంట్స్’ కుమార్‌ని కలిశాంగానీ, పెద్దగా మాట్లాడింది లేదు. జస్ట్ ముఖ పరిచయం.
రోజులు, నెలలు కాదు, ఏళ్ళు గడిచాయ్. ఫోన్ నెంబర్ మళ్ళీ మా ‘అన్న’ దగ్గరే తీసుకుని, ఆ ఫాంట్స్ కుమార్‌తో మాట్లాడాను. అక్కడికి ఆ పని అలా అయిపోయింది.
ఆ తర్వాత ఆయనలోని హాస్య చతురత, వృత్తి పట్ల నిబద్ధత.. ఇవన్నీ నన్ను కట్టి పడేశాయ్. మరీ ముఖ్యంగా, అక్షరాల మీద అతనికున్న ప్రేమ.. నన్ను ఆశ్చర్యపరిచింది.
తెలుగు అక్షరాలకి విలువా పాడూ లేకుండా పోతున్న రోజులవి. తెలుగుని తెల్గు.. అని రాసినా చెల్లిపోతోన్న రోజులవి.
కానీ, అక్షరాల్ని పొందికగా, అందంగా డిజైన్ చేసి, ‘ఫాంట్స్’గా మార్చి, జనానికి పరిచయం చేస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆయనంటే ‘ఫాంట్స్ కుమార్’ అనే నా మొబైల్‌లో పేరుంటుంది.
అసలు పేరు పురుషోత్ కుమార్..
పూర్తి పేరు పురుషోత్ కుమార్.! ఇంటి పేరు నేనెప్పుడూ అడగలేదు. హైద్రాబాద్‌లో నన్ను చాలామంది ‘మీ క్యాస్ట్ ఏంటి.?’ అని అడిగారు.. నేనలా ‘కుమార్’ని క్యాస్ట్ గురించి అడగలేదు.!
మళ్ళీ రోజులు గడుస్తున్నాయ్.. అప్పుడప్పుడూ వాట్సాప్ వేదికగా అభిప్రాయాల్ని పంచుకోవడం.. పండగలకీ, ఇతరత్రా సందర్భాల్లో విషెస్ చెప్పుకోవడం జరుగుతూ వచ్చింది.
ఇదిగో, ఈ వెబ్ సైట్ గురించి కూడా ఆయనతో చర్చించాను. ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. మరోపక్క, ఆ ఫాంట్స్ కుమార్ పేరు మరింతగా పాపులర్ అవుతూ వచ్చింది.
ఇక్కడ, ఇలా రాస్తున్నదంతా నిజానికి ఎప్పుడో రాయాలి. కానీ, కుదరలేదు.! ఇప్పుడైతే రాసేస్తున్నా.! రాయాలనిపించింది. అదీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున.!
అక్షరం మీద ఎంత ప్రేమ వుంటే.. మాతృ భాష మీద ఎంత గౌరవం వుంటే.. అక్షరాలకు ఇంతటి అందమైన రూపాల్ని కుమార్ ఇవ్వగలుగుతారు.?
అక్షర వ్యవసాయం..
తెలుగులో మాట్లాడితే ప్రైవేటు స్కూళ్ళలో విద్యార్థుల్ని చావగొడుతున్న రోజులివి.! అంతెందుకు, ఇంట్లో తల్లిదండ్రులు సైతం ‘అమ్మ, నాన్న’ అనొద్దని హుకూం జారీ చేస్తున్నారు. ‘మమ్మీ, డాడీ..’ అని మాత్రమే అనమంటున్నారు.
ఇంకోపక్క, మాతృ భాషని మృత భాషగా ప్రభుత్వాలు మార్చేస్తున్న రోజులివి. భాష మీద మమకారం వున్న చాలా చాలా కొద్ది మంది మాత్రమే, తమకు తోచిన రీతిలో తెలుగు భాషకి సేవ చేయగలుగుతుంటారు.
ఆయన రూపొందించే అందమైన అక్షరాలకు వెల కట్టలేం.! అందుకే, అక్షరాల తోటలో లక్షణమైన కుమారుడని చెబుతున్నది.! తెలుగు తల్లి ముద్దుబిడ్డ.. అని కూడా అనొచ్చు.!
అభిమానులు వాళ్ళకేనా.?
సినిమా హీరోలకి, రాజకీయ నాయకులకి అభిమానులుండడం మామూలే. ఇదిగో, నాలా.. అక్షరాన్ని అభిమానించేవారికీ అభిమానులుంటారు.
కుమార్ గారూ.. నేను మీకు అభిమానిని.! తెలుగు మాటల్ని పలకలేని నత్తి పకోడీలు తెలుగుని చంపేద్దామనుకుంటున్నారు.. చంపేశామనుకుంటున్నారు.. మీరు మాత్రం.. తెలుగు అక్షరాలకు సరికొత్త గ్లామర్ తీసుకొస్తున్నారు. హ్యాట్సాఫ్.!
Also Read: మూర్తిగారూ.! అప్పుడెప్పుడో.. ఆ స్నేహం.!
ప్రముకుల చేతుల మీదుగా సన్మానాలు.. సత్కారాలు.. ఇవన్నీ మీకు మన తెలుగు అక్షరాలపై మమకారాన్ని మరింత పెంచుతాయని అనలేంగానీ.. తెలుగాక్షర వ్యవసాయంలో మీకు మరింత ప్రోత్సాహాన్ని ఖచ్చితంగా ఇస్తాయ్.!
మీ ఫొటోని.. మీ వాట్సాప్ ప్రొఫైల్ నుంచి తీసేసి.. ఇక్కడ పెడుతున్నా.. ఏమీ అనుకోకండే.!
మన మాట.. మన యాస.. మన భాష.. మన అక్షరం.. ఇదంతా మన సంపద.!
– yeSBee