Peddada Murthy.. స్నేహితుడనాలా.? గురువు అనాలా.? గురువుగారు అంటే బావుంటుందేమో.! పెద్దాడ మూర్తి.. కలిసి కొంతకాలం పని చేశాం మనం.!
‘టీ వేడిగానే తాగాలి.. చల్లారిపోతే ఏం బావుంటుంది.?’ అంటూ సరదాగా మందలింపుతో కూడిన ఓ సూచన మీనుండి.!
ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తితో మీ పరిచయం, ఆ పరిచయం తాలూకు అనుభూతుల్ని మీరు నాతో పంచుకుంటోంటే, ఆయన మీద.. మీ మీద నాకు పెరిగిన గౌరవం.. చాలా చాలా ప్రత్యేకం.
మధ్యలో చాలాకాలం మనం కలుసుకోలేదు. వేర్వేరు దారుల్లో ఎవరి వ్యాపకం వాళ్ళు చూసుకుంటూ వచ్చాం మరి.!
ఓసారి కలిశాం.. రోడ్డు మీద, ‘ఎలా వున్నావోయ్..’ అంటూ మీ పిలుపు. ‘బావున్నాను మూర్తిగారూ..’ అంటే నా సమాధానం. మళ్ళీ కలుద్దామని మీరు చెప్పారు, మళ్ళీ ఆ కలయిక జరగనేలేదు.
అనూహ్యంగా ‘పెద్దాడ మూర్తి ఇక లేరు’ అన్న ఓ వార్త చూసి.. చెప్పలేనంత బాధ కలిగింది. నేనుండే చోటకి కూతవేటు దూరంలోనే మీరూ వున్నారనే విషయం నిజ్జంగానే నాకు తెలియదు.
అప్పుడప్పుడు.. అలా కలిసినప్పుడు..
చాలా ఏళ్ళ క్రితం ‘అప్పుడప్పుడు’ అనే సినిమా షూటింగ్ నిమిత్తం, పాలకొల్లు అనే ఊరి పక్కనే వున్న ఓ చిన్నగ్రామానికి వెళ్ళాం.
అలా వెళ్ళే క్రమంలో.. మీతోపాటే నా ప్రయాణం.. అదిప్పటికీ గుర్తుంది. ఆ సినిమా కోసం మీరు రాసిన పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో.. మీ నుండి నేను చాలా నేర్చుకున్నాను.
ఇక్కడ ఇంకో చిన్న విషయం గుర్తు చేసుకోవాలి. ‘నేను నీకు బాకీ పడిపోయానోయ్..’ అన్నారు మీరు.! ‘గురు దక్షిణ’ అనుకోండి.. అనేశాన్నేను. నవ్వేశారు మీరప్పుడు.
అది ఎందుకు.? ఏంటన్నది.. మీకూ, నాకూ మాత్రమే తెలుసు.
తెలుగు సినిమా పాట మీద మీకున్న మమకారం.. తెలుగు సాహిత్యంపై మీకున్న పట్టు.. ‘తెలుగు భాష’ అంటే నాకు మరింత ఇష్టం ఏర్పడేలా చేశాయనడం అతిశయోక్తి కాదేమో.!
Peddada Murthy ఆ మాటే భరోసా..
‘రాసెయ్.. నేను చూసుకుంటాను కదా..’ అంటూ నాకు సరిగ్గా రాయడం రాకపోయినా, ప్రోత్సహించిన మీరు.. నేనెప్పుడు ఏం రాసినా, అందులో మీ నుంచి నేర్చుకున్న కొన్ని పదాలు వాడేలా నాపై బలమైన ముద్ర వేశారు.
ఒకప్పుడు రాయడం సరదా.. అది ప్రవృత్తిగా కూడా మారింది.. రాయడం, విశ్లేషించడం, విమర్శించడం.. వీటిని బహుశా నేను మీ నుంచి నేర్చుకున్నానేమో.!
అప్పటికి నా వయసు చాలా చాలా తక్కువ. ఎవరైనా నన్ను ఆటపట్టించేందుకు ప్రయత్నిస్తే, మీరు నాకు అండగా నిలిచేవారు.
నాలో ఏదో ప్రత్యేకత వుందని మీరు పదే పదే చెబుతుండేవారు. ఆ ప్రత్యేకత ఏంటో.. నేనైతే ప్రత్యేకంగా ఇప్పటికీ గుర్తించలేకపోయాను.
మీరు రాసిన ‘చెలియా చెలియా..’ (‘ఇడియట్’ సినిమాలోనిది) నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్.
అది వింటున్నప్పుడల్లా.. ఆ పాట మీరు రాసినప్పుడు, మీ పక్కనే వున్న నాకు కలిగిన అనుభూతి.. అలా అలా కొనసాగుతూనే వుంటుంది.
ఆ పాటే కాదు, మీరు రాసిన పాటల రూపంలో మీరెప్పుడూ జీవించే వుంటారు. ఏదో రాసెయ్యాలని కాదు.. మీ మీద వున్న గౌరవంతో ఇలా రాసేశాను.. బహుశా మీరే రాయించారేమో నాకైతే తెలియదు.
మరో ముఖ్యమైన సందర్భం.. ఆ సందర్భంలో ‘అతను నా మనిషి.. నా బ్రదర్..’ అని మీరు లీడ్ తీసుకున్నారట.
ఆ విషయం నాకు ఆ తర్వాత తెలిసింది. అప్పడనుకున్నాను.. మీరు నాకు స్నేహితుడు, గురువు మాత్రమే కాదు.. ‘అన్న’ లాంటివారని.!
ఎక్కడ పోస్ట్ చెయ్యాలి.? అనుకున్నాను రాసేముందు.? ఇదిగో.. ఇలా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.! అన్నట్టు.. నా కలం పేరు ‘సింధు’. ‘చాలా మంచి పేరు’ అని మీరు పలు సందర్భాల్లో ఈ కలం పేరునీ అభినందించారు గుర్తుందా.?
బహుశా మీ ‘ముద్ర’ నా మీద అంత బలంగా వుండడం వల్లేనేమో ఇదంతా.!
– సింధు