The Baker And The Beauty Review అన్ని కథల్నీ సినిమాగా తెరకెక్కించలేరు గనుక.. ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్‌ల రూపంలో ప్రేక్షకుల ముందుకు కొన్ని ప్రత్యేకమైన కథల్ని తీసుకొస్తున్నారన్నది.. ఇటీవల చాలా వెబ్ సిరీస్‌ల విషయంలో వినిపిస్తోన్న వాదన. సెన్సార్ సమస్యలు కావొచ్చు, ఇతరత్రా పరిమితులు కావొచ్చు.. చాలామంది దర్శక నిర్మాతలు, నటీ నటులు ఓటీటీ వైపు చూడాల్సి వస్తోంది.
ఓటీటీపై కొన్ని వెబ్ సిరీస్‌లు మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. పెద్ద హీరోల సినిమాల కంటే ఎక్కువగా వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు తీరిగ్గా చూసే వీలుండడం, మొబైల్ ఫోన్లలోనూ తిలకించే అవకాశం దొరుకుతుండడంతో.. ‘టార్గెట్ ఆడియన్స్’ ఓటీటీకి ఓటేస్తున్నారు.
మనం ఇక్కడ ఇప్పుడు మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ పేరు ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’. మొత్తం పది భాగాలుగా ఈ వెబ్ సిరీస్ రూపొందిందింది. బాయ్ ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిన ఓ సినీ నటి, ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి కమిట్ అవ్వాలా.? వద్దా.? అనే గందరగోళంలో వున్న అబ్బాయి.. ఈ ఇద్దరితోపాటు, మరిన్ని పాత్రల సంఘర్షణ ఈ ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’.
The Baker And The Beauty Review.. ఎలా వుందంటే..
హీరో కుటుంబానికి ఓ బేకరీ వుంటుంది. హీరో బాగా బొమ్మలు గీస్తాడు, కానీ.. తన ఇష్టాన్ని పక్కన పెట్టి, బేకరీ వ్యవహారాలు చూసుకుంటాడు. హీరో తమ్ముడేమో సింగర్. వీళ్ళిద్దరికీ ఓ చెల్లి. ఈ ముగ్గురికీ తల్లి, తండ్రి వుంటారు. సినీ నటి.. అదేనండీ హీరోయిన్‌కి అసిస్టెంట్ వుంటాడు.. అతనూ ఈ కథలో కీలక పాత్రధారి.

సంతోష్ శోభన్, టినా శిల్పరాజ్, విష్ణు ప్రియ, సంగీత్ శోభన్, ఝాన్సీ, వెంకట్ తదితరులు వెబ్ సిరీస్‌లో ప్రధాన తారాగణం. వెబ్ సిరీస్ అనగానే యూత్‌కి కనెక్ట్ అయ్యేలా వుంటాయన్న వాదన వుంది. ఇందులోనూ కంటెంట్ అదే. ప్రేమ, బ్రేకప్, అబ్బాయిల మీద కాకుండా అమ్మాయిల మీద మోజుపడే అమ్మాయి.. మూతి ముద్దుల వ్యవహారాలు, పెళ్ళి కాకుండా ‘అన్ని పనులూ’ పూర్తి చేసేసుకోవడం.. ఇవన్నీ ఇందులోనూ వున్నాయ్.
అయితే, వెబ్ సిరీస్ చాలా లావిష్‌గా తెరకెక్కింది. దానికి తోడు ఎంటర్టైనింగ్‌గా కూడా వుంది. నిడివి బాగా ఎక్కువవడం బోరింగ్‌గా అనిపిస్తుందేమోగానీ, చూస్తున్నంతసేపూ అయితే పెద్దగా బోర్ కొట్టదు. పది ఎపిసోడ్లు.. కాస్త టైమ్ వుంటే సరిపోద్ది.. ఓపిక అన్న మాటకు ఆస్కారం లేకుండా ఎంటర్టైనింగ్‌గానే తీర్చదిద్దగలిగారు.
వెండితెరపై చెప్పలేనివి ఏమున్నాయబ్బా.?
వెండి తెరమీద చెప్పలేని అంశం.. అని ఏదన్నా అంటే, అది హీరో చెల్లెలికి అబ్బాయిల మీద ప్రేమ కాకుండా, అమ్మాయిల మీద ప్రేమ వుంటుంది. అంతే, దానికి మించి.. ఇందులో పెద్దగా క్వశ్చన్ చేసే కాంట్రవర్షియల్ సీన్ అంటూ ఏదీ లేదు.
సంతోష్ శోభన్, అతని తమ్ముడు సంగీత్ శోభన్.. ఇద్దరూ చాలా బాగా చేశారు. టినా శిల్పరాజ్, హీరోయిన్ ఎలా వుండాలో అలానే వుంది. వెంకట్ బావున్నాడు, హీరోయిన్ మేనేజర్ పాత్రలో. విష్ణు ప్రియ ఆకట్టుకుంటుంది. ఝాన్సీ, శ్రీకాంత్ అయ్యంగర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్ చెల్లెలిగా నటించిన సాయి శ్వేత కూడా చాలా బాగా చేసింది.
Also Read: రివ్యూ: ‘కుడి ఎడమైతే’ ఆహా.. థ్రిల్ అదిరింది
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మరీ అంత ఎక్కువ అవసరమా.? అంటే, వెబ్ సిరీస్ కదా.. ఆ మాత్రం వుండాలి. సినిమాల్లో ఇంతకు మించిన డోసులోనే వుంటోందనుకోండి.. అది వేరే సంగతి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ.. అన్నీ గుడ్ స్టాండర్డ్స్‌లోనే వున్నాయి. డైలాగ్స్ బావున్నాయి. టైమ్ పాస్ కోసం ఎన్నిసార్లైనా చూడొచ్చు.. ఓటీటీ బొమ్మ కదా.!
చివరగా.. మధ్య తరగతి కష్టాలు, బాగా రిచ్ అయిన హీరోయిన్ ఎదుర్కొనే ఒంటరితనం, నేటితరం కుర్రాళ్ళ జోరు.. అదే సమయంలో కన్‌ఫ్యూజన్.. ఇలా చాలా అంశాల్ని కొంచెం సున్నితంగా, కొంచెం ఘాటుగా.. మరికొంచెం ఆటిట్యూడ్‌తో.. బాగానే తెరకెక్కించగలిగారు.