Home » ‘ది గర్ల్ ఫ్రెండ్’ సమీక్ష: కామంతో కళ్ళు మూసుకుపోయిన స్టూడెంట్స్.!

‘ది గర్ల్ ఫ్రెండ్’ సమీక్ష: కామంతో కళ్ళు మూసుకుపోయిన స్టూడెంట్స్.!

by hellomudra
0 comments
Rashmika Mandanna The Girl Friend

The Girl Friend Review.. అసలు, హీరో అలానే హీరోయిన్.. కాలేజీకి ఎందుకు వెళ్ళినట్లు.? చదువుకోవడానికా.? ‘కామ వాంఛలు’ తీర్చుకోవడానికా.?

పీజీ స్టూడెంట్స్ కాబట్టి.. ‘అడల్ట్స్’ అనే ట్యాగ్ తగలించేసి, కళాశాలలో ‘విచ్చలవిడి శృంగారానికి’ తెగబడితే, చూసీ చూడనట్లు, అధ్యాపకులు వుంటారా.?

తన కూతురు అలానే, ఆమెను ప్రేమించినవాడు.. ఇద్దరూ కళాశాల హాస్టల్‌లో, ఒకే రూమ్‌లో అసభ్యకర వ్యవహారాలు చేస్తోంటే, ‘హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్’ని తండ్రి ప్రశ్నించకూడదా.?

దర్శకుడు రాహుల్, తన సినిమా కథని అసలెలా రాసుకున్నాడు.? రష్మిక పాత్రని ఎలా డిజైన్ చేసుకున్నాడు.? ఆ పాత్ర ద్వారా ఏం చెప్పదలచుకున్నట్లు.?

దీక్షిత్ శెట్టి పాత్రని ఎలా మొదలెట్టాడు.? ఎలా ముగించాడు.? సీనియర్ నటి రోహిణి, సీనియర్ నటుడు రావు రమేష్ పాత్రల ప్రవర్తన ఏంటి.?

ఇలా చాలా ప్రశ్నలు మెదళ్ళలో మెదులుతాయి ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా చూశాక కూడా. అలానే, అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర కూడా.!

The Girl Friend Review.. కళాశాలలో.. కామ కేళి.?

సినిమా మొత్తం, కాలేజీలోనే పూర్తి చేసేశారు. అక్కడక్కడా ఔటింగ్ అంతే.! పాత్రలూ తక్కువే.! కాలేజీలోనూ, ఎవరి గోల వారిదే.!

హీరోయిన్‌ని ఓ సందర్భంలో హీరో కాపాడతాడు, ఆ సంఘటన తర్వాత హీరోకి హీరోయిన్ దగ్గరవుతుంది. హీరోయిన్ తన సొంతమనుకుంటాడు హీరో. ఇదీ రొటీన్.

తనకు మాత్రమే సొంతం.. అన్న భావనలో హీరో వుండడం కొత్తేమీ కాదు. హీరోయిన్, అన్ని విషయాలకీ భయపడుతూ వుంటుంది. దానికో, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అదేమీ అంత ఇంప్రెసివ్‌గా అనిపించదు.

హీరోయిన్‌కి, అనూ ఇమ్మాన్యుయేల్ నుంచి జ్ఞానోదయం అవుతుంది. అదీ, ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంటుంది. కాకపోతే, అనూ ఇమ్మాన్యుయేల్ మాత్రం తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది.

తెరపై అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించి ప్రతిసారీ చాలా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. దర్శకుడు చెప్పింది చెయ్యడానికి, రష్మిక కష్టపడింది. అది ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.

కాకపోతే, ఆమె పాత్రని దర్శకుడు డిజైన్ చేసిన విధానమే, అస్సలు సెట్ కాలేదు. మరీ, అంతలా హీరోయిన్ పాత్రని దర్శకుడు ఎందుకు ‘ఇరికించేశాడు.?’ అన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్.

క్లయిమాక్స్ అయితే, ఇలా వచ్చి.. అలా సినిమా ముగిసిపోతుంది. అంత రియలైజేషన్, మరీ అంత తక్కువ టైమ్‌లో.. అదే విచిత్రంగా అనిపిస్తుంది.

ఎలా మొదలెట్టావ్.? ఎలా ముగించావ్.?

హీరోయిన్‌ని హీరో పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఏదేదో హంగామా చేసేస్తాడు. హీరో క్యారెక్టర్‌ని ఎలా మొదలెట్టాను? ఎలా ముగించాను? అన్నది దర్శకుడు క్రాస్ చెక్ చేసుకుని వుండాల్సింది.

రక్షిత్ శెట్టి నిజానికి, చాలా బాగా చేశాడు. ‘దసరా’ సినిమాలో చూశాం కదా.! ఈసారి సినిమా అంతా వున్నాడు. ఇకపై, అతన్నుంచి మరిన్ని మంచి పాత్రల్ని ఆశించొచ్చు.

రోహిణి మొల్లేటి, సీనియర్ నటి. తనకిచ్చిన పాత్రలో ఆమె ఒదిగిపోయింది. కానీ, ఆ పాత్ర కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు.

భర్త వేధింపుల కారణంగా, ఆమె అదో రకంగా మారిపోతుంది. భర్త చనిపోయాకా, అదే పిచ్చితనంలో బతికేస్తుంటుందామె. ఆమెని చూసి, తనను తాను అలా ఊహించేసుకుంటుంది రష్మిక పాత్ర.

రావు రమేష్, కూతుర్ని అనుమానించేస్తాడు.. అవమానించేస్తాడు. వున్నపళంగా, అతన్ని వరస్ట్ క్యారెక్టర్‌గా ప్రొజెక్ట్ చేసేశాడు దర్శకుడు.

కుమార్తె మీద తండ్రికున్న బాధ్యత.. అని దర్శకుడెందుకు అనుకోలేకపోయాడో ఏమో.!

ఉద్దేశ్యం క్లియర్, రోహిణి పాత్ర ద్వారా, రష్మిక పాత్ర ద్వారా.. ‘మహిళా పక్షపాతి’ అనుకున్నాడుగానీ, ‘పురుష సమాజంపై ద్వేషంతో’ సినిమా తీస్తున్నట్లు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెలుసుకోలేకపోయాడు.

రాహుల్ కూడా, సినిమాలో నటించాడు. అతను మాత్రం మంచోడే.! హీరో స్నేహితుల్లో ఒకడు మంచోడే. హీరోయిన్ స్నేహితుల్లోనూ ఓ కుర్రాడు మంచోడే సుమీ.!

సినిమా అంతా సాగదీసి.. క్షణాల్లో ముగించేశాడు.!

సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే కుదిరాయి. సినిమా నిడివిని చాలా చాలా తగ్గించేయొచ్చు. ఎడిటింగ్ సమయంలో కత్తెర పదును ఇంకాస్త గట్టిగానే చూపించి వుంటే బావుండేది.

ఈ తరహా సినిమాలు తెలుగు తెరకు కొత్త కాదు.! రాహుల్ సతీమణి చిన్మయి సోషల్ మీడియా వేదికగా వేసే ట్వీట్లు.. ఈ సినిమా.. రెండిటినీ పరిగణనలోకి తీసుకుంటే, కథ చిన్మయి నుంచే రాహుల్‌కి అందిందా.?

అబ్బే, లేదు.! అసలు చిన్మయిని చెడగొట్టిందే తానని రాహుల్ రవీంద్రన్, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో చెప్పాడు కదా.!

సినిమాని సినిమాలానే చూడాలి.! కానీ, ఈ సినిమాని అలా కేవలం సినిమాలా చూడలేం.! ఏదో చెప్పాలని, ఎవరి మీదనో ద్వేషం చూపించాలని పనిగట్టుకుని తీసిన సినిమాలా వుందంతే.

‘అత్తతో వెళతాను’ అని కూతురు అంటే, ‘చిన్న పిల్ల.. అలానే అంటుంది’ అని ఏ తండ్రి అయినా, సరదాగా తీసుకుంటాడు. అంతేగానీ, అలిగి కూతురి మీద కోపం తెచ్చుకోడు.

ఓ ఆడపిల్లకి తండ్రి అయిన రాహుల్ రవీంద్రన్‌కి ఇది అర్థం కాలేదా.? అతని ఇంట్లోనూ అలానే వుంటాడా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తుంది సగటు తండ్రి నుంచి.

‘ఓ వెయ్యి సార్లు కిస్ చేసి (హీరోని) వుంటాను..’ అని హీరోయిన్, చివర్లో స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. వావ్.. అని క్లాప్స్ కొట్టాలేమో.!

‘చాలా సార్లు నీతో పడుకున్నాన్రా..’ అని హీరోకి, వందలాది మంది స్టూడెంట్స్ వున్న ఓ ఈవెంట్‌లో చెబుతుంది.. ఇదీ క్లయిమాక్స్‌లోనే.. ఇక్కడ కూడా క్లాప్స్ కొట్టాలి.

‘నీకు లేని సిగ్గు నాకెందుకురా.?’ అంటుంది, ఇక్కడ కూడా దర్శకుడు రాహుల్, ప్రేక్షకుల నుంచి క్లాప్స్ ఆశించాడు.

ఇంతకీ, కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళారా హీరో హీరోయిన్లు.? లేదంటే, ముద్దులాటలు.. శృంగార పాఠాలు నేర్చుకోవడానికా.? కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా రాహులా.!?

ఫక్తు కమర్షియల్ మూవీ తీసి, ఏం చేసినా.. అదో లెక్క.! మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం.. అని చెప్పి, ఏంటిదంతా.? చెప్పేవి నీతులు, తీసేవి బూతులు.!

పీజీ స్టూడెంట్స్ అయితే మాత్రం, అమ్మాయిల హాస్టల్‌లో.. అమ్మాయితో, అబ్బాయ్.. రాత్రంతా ‘ఏకాంతంగా’ గడపడానికి అనుమతి వుంటుందా.? ఒక్క రోజు కాదు, చాలా రోజులు.! ఏంటీ ఛండాలం రాహులా.?

– yeSBee

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group