Table of Contents
Third World War The End: ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక చోట యుద్ధం జరుగుతూనే వుంటుంది. కొన్ని ప్రధాన వార్తలుగా మీడియాకెక్కుతాయ్. కొన్ని మీడియాకి ఎక్కవు గానీ, అమాయకుల ప్రాణాల్ని తీసేస్తూనే వుంటాయ్.
ఏమున్నది గర్వకారణం. మన భూమిపై నిత్యం రగులుతున్న రావణ కాష్టం. తప్పెవరిది.? ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. ఇండియా, పాకిస్థాన్ మధ్య గొడవ గురించి చైనా మనమీదకి కాలు దువ్వుతున్న వైనం గురించి నిత్యం మాట్లాడుకుంటూనే వున్నాం.
విధ్వంసం.. దురాక్రమణ సిద్ధాంతం.!
మొన్నటిదాకా ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం గురించి ప్రపంచం ఆందోళన చెందింది. కాలం అన్ని గాయాల్నీ ఏమార్చుతుంది. అలాగే, ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని మర్చిపోయాం. ఇంతలోనే, ఉక్రెయిన్ సంక్షోభం పుట్టుకొచ్చింది.
ఉక్రెయిన్ కవ్వింపులు, రష్యా దూకుడు, అమెరికా సన్నాయి నొక్కులు.. వెరసి నాశనమైపోతున్నది ఉక్రెయిన్ ప్రజలే. ఉక్రెయిన్ వేదికగా అమెరికా, రష్యా తలపడాల్సి వస్తే, తదనంతర పరిణామాలు మనమెవరం ఊహించనంత భయానకంగా వుంటాయ్.
ఈ దూకుడు.. మానవాళి వినాశనం దిశగా.!
ఉక్రెయిన్ మీదకి రష్యా దూసుకొచ్చేసింది. అమెరికా ప్రస్తుతానికి మాటు వేసింది. ఏ క్షణాన్నయినా రష్యా మీదికి అమెరికా దూసుకెళ్లొచ్చు. అయితే, అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోనని చిన్నపాటి అనుమానం అమెరికాకి వుంది.
గోతికాడి నక్కలా కాచుకుని కూర్చొన్న చైనా, రష్యా మీద అదో విధమైన ప్రేమ చూపిస్తూ తాను సూపర్ పవర్ అనిపించుకోవాలని తహతహలాడుతోంది.
Third World War The End.. మనమేం చేయగలం.?
ఇక భారత దేశం విషయానికి వస్తే, విడవమంటే పాముకి కోపం. కరవమంటే కప్పకి కోపం.. అన్నట్లుగా తయారయింది పరిస్థితి. ఎన్నో దశాబ్ధాలుగా రష్యాతో భారతదేశానికి సన్నిహిత సంబంధాలున్నాయ్. మరోపక్క అమెరికాతో భారత్ బంధం ఈ మధ్యనే బలం పుంజుకుంది.
సో, భారతదేశం తటస్థంగా వుండడం తప్ప ఇప్పుడేమీ మాట్లాడలేని పరిస్థితి. కానీ, ఎప్పుడయినా భారతదేశానికంటూ కష్టమొస్తే ఆదుకునేది అమెరికా కాదు, రష్యానే.
Also Read: కొత్త రాజ్యాంగం రాస్కో బాసూ.! ఇంతకీ, ఏ సిరాతో.!
ఏది ఏమైనా, రష్యా – ఉక్రెయిన్ సంక్షోభం వీలైనంత తొందరగా సమసిపోవాలని భారతదేశం కోరుకుంటోంది. ప్రపంచంలో మిగతా అన్ని దేశాలూ అదే కోరుకుంటున్నాయ్. ఒకవేళ పరిస్థితులు విషమించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే మానవ వినాశనం కొద్ది నిమిషాల వ్యవధిలో జరిగిపోతుంది.