Table of Contents
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై వుండే అంచనాల తీరే వేరు. ఆకాశమే హద్దు.. అన్నట్లుంటాయి ఆ అంచనాలు. అలాంటిది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ సినిమా అంటే, ఆకాశపుటంచుల్నీ దాటేస్తాయి ఆ సినిమాపై అంచనాలు. ‘అరవింద సమేత’ సినిమాపై అంచనాల పరిస్థితి ఇదే ఇప్పుడు. ఆల్రెడీ టీజర్‌తో, సినిమాలో కంటెంట్ ఏంటన్నదానిపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇదిగో, ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చేసింది. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ‘అరవింద సమేత’ తెరకెక్కింది. అలాగని, పూర్తిగా నడుకుడు వ్యవహారమే వుండదు. అదే అసలు ట్విస్ట్.
మంది లేరా? కత్తులు లేవా?
‘మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్, సినిమాలోని కథేంటన్నదానిపై ఓ స్పష్టతనిస్తుంది. ట్రైలర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం, సినిమా కథని జనాల్లోకి తీసుకెళ్ళేలానే వుంది. ఫ్యాక్షన్ సినిమాలు యంగ్ టైగర్‌కి కొత్తేమీ కాదు. మీసం పూర్తిగా మొలియకముందే ‘ఆది’ సినిమాలో కత్తి పట్టాడు. ఆ సినిమా బంపర్ హిట్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే అదో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా అప్పట్లో రికార్డులకెక్కింది. ఆ తర్వాత చాలా సినిమాలొచ్చాయి. అవన్నీ ఓ ఎత్తు.. ‘అరవింద సమేత’ ఓ ఎత్తు.
రొమాంటిక్ ట్రాక్.. ఆ కిక్కే వేరప్పా
హీరో, హీరోయిన్ పేరు అడిగితే.. పేరొక్కటే చాలా.? అడ్రస్ కూడా కావాలా.? అని హీరోయిన్ నుంచి సమాధానమొస్తే, హీరో అవాక్కయితే.. ఆ ట్రాక్ అంతా ఓ డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. పూజా హెగ్దే, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రొమాంటిక్ ట్రాక్ ఈ సినిమాకే హైలైట్ కాబోతోందట. అయితే, ట్రైలర్‌లో అవేమీ చూపించలేదు. కానీ, సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత కీలకమో, ఓ డైలాగ్‌తో చెప్పేశారు. గొడవల్ని కొనసాగించడం గొప్పతనం కాదు, ఆ గొడవల్ని ఆపడమే గొప్పతనం అని హీరోయిన్ చెప్పే డైలాగ్, దానికి ఇన్‌స్పయిర్ అయిన హీరో, తన పంథా మార్చుకోవడం.. ఇదీ ఈ సినిమాలోని మరో ప్రత్యేకత.
పెనిమిటి.. ఇంతలా ఎమోషనల్ చేసేశావేంటీ?
‘పెనిమిటి..’ అంటూ సాగే ఓ సాంగ్ ఇప్పటికే విడుదలయ్యింది. అందులో లిరిక్స్ అందరితోనూ కంటతడి పెట్టించాయి. ఆ పాట ప్రాముఖ్యత ఏంటో, సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ‘మీ తాత కత్తి పట్టాడంటే అది అవసరం.. మీ నాన్న కత్తి పట్టాడంటే అది వారసత్వం.. నువ్వు కత్తి పట్టావంటే అది లక్షణం.. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపం అవుతుందా?’ అనే డైలాగ్ చుట్టూనే ఈ ‘పెనిమిటి’ పాటకు రూపకల్పన జరిగినట్లు కన్పిస్తోంది. ఆ పాట ఎంతలా జనాన్ని కదిలించిందో, అంతకన్నా ఎక్కువ ఎన్టీఆర్‌ని ఎమోషన్‌కి గురిచేసింది. ఇటీవల హరికృష్ణ మరణించడంతో, హరికృష్ణ తనయులైన ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ – అరవింద సమేత ఆడియో ఫంక్షన్‌లో కంటతడి పెట్టారు. వారి బాధకి అభిమానులూ చలించిపోయారు ఆ వేడుకలో.
జగపతిబాబు క్రూరత్వం
ఇప్పటికే ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర గురించి చాలా ప్రచారం జరిగింది. క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా జగపతిబాబు పాత్ర గురించి అంతా చెప్పుకున్నారు. ట్రైలర్‌లో జగపతిబాబు పాత్ర కన్పించి, భయపెట్టింది. బహుశా తెలుగు తెరపై ఇంతటి క్రూరత్వం వున్న పాత్రని ఇంకోటి మనం చూసి వుండమేమో. గెటప్ దగ్గర్నుంచి, జగపతిబాబు స్లాంగ్ వరకూ త్రివిక్రమ్ తీసుకున్న శ్రద్ధకు హేట్సాఫ్ చెప్పాలి. త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, తమన్ మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఎన్టీఆర్ అల్టిమేట్ పెర్ఫామెన్స్.. ఇవన్నీ ట్రైలర్‌కి కొత్త గ్లామర్‌ని తెచ్చాయి. అయితే, ఈ ట్రైలర్‌లో ఎన్టీఆర్ డాన్సులేమీ కన్పించలేదు. పాటలకు సంబంధించిన ప్రస్తావనేమీ లేకపోవడం అభిమానులు కొంత డీలా పడేలా చేసింది.
‘దమ్ము’, ’మిర్చి‘ సినిమాలు కనిపించాయ్
ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు.. యంగ్ టైగర్ గతంలో నటించిన ‘దమ్ము’ సినిమాతో పాటుగా, ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ’మిర్చి‘ సినిమా కూడా గుర్తుకొస్తుంటుంది. ఆ సినిమాలతో ఈ ’అరవింద సమేత‘ను ఎంతవరకు పోల్చగలం.? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ‘దమ్ము’ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సంగతి తెల్సిందే.
100 కోట్ల అంచనాలున్నాయ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా.. 100 కోట్ల క్లబ్‌లోకి.. అదీ షేర్ పరంగా ఎంటర్ అవడం ఈ ‘అరవింద సమేత’తోనేనని అభిమానులు అప్పుడే ఫిక్సయిపోయారు. దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ టాప్ క్లాస్‌లో జరిగింది. ఓవర్సీస్‌లో త్రివిక్రమ్‌కీ, ఎన్టీఆర్‌కీ మంచి మార్కెట్ వుంది. అందుకే, అక్కడ ప్రీమియర్స్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. విజయదశమి సీజన్‌లో.. ఓ వారం రోజుల ముందే.. అంటే అక్టోబర్ 11న అభిమానుల ముందుకు ‘అరవింద సమేత’ అనే పండగని తీసుకొచ్చేస్తున్నాడు యంగ్ టైగర్. ఆల్ ది బెస్ట్ టు అరవింద సమేత టీమ్.