Table of Contents
జీరో సైజ్ ఫిజిక్ గురించి విన్నాం. హీరోయిన్లు బక్క చిక్కిపోయి కన్పిస్తే అది జీరో సైజ్ ఫిజిక్. అంత నాజూగ్గా మారిపోవడమంటే ఆషామాషీ కాదు. బాలీవుడ్‌లో దాదాపు హీరోయిన్లంతా ఈ జీరో సైజ్ ఫిజిక్‌ని ట్రై చేసేశారు. తెలుగులో ‘సైజ్ జీరో’ అనే ఓ సినిమా వచ్చింది. ఇందులో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషించింది. కానీ, జీరో సైజ్ ఫిజిక్‌కి భిన్నంగా వుంటుందీ ‘సైజ్ జీరో’ సినిమా. అనుష్క ఈ సినిమా కోసం చాలా భారీగా తయారైంది. బొద్దుతనం హద్దులు దాటేసి, తెరపై భరించలేనంత లావుగా మారి అలరించింది. అనుష్క కమిట్‌మెంట్‌కి ఎవరైనా హేట్సాఫ్ చెప్పాల్సిందే.
ఆయన జీరో కాదు, హీరో.!
ఇప్పుడు బాలీవుడ్ సినిమా ‘జీరో’ గురించి మాట్లాడుకుందాం. కింగ్ ఖాన్ (King Khan) షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన సినిమా ఇది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. తాజాగా సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఇందులో కింగ్ ఖాన్ షారుక్ కాస్తా ‘మరుగుజ్జు’ వ్యక్తిగా కన్పించబోతున్నాడు. చాలాకాలం క్రిందట విశ్వ నటుడు కమల్‌హాసన్ (Kamal Hassan) ఓ సినిమాలో మరుగుజ్జులా నటించాడు. అందులో త్రిపాత్రాభినయం కూడా చేసేశాడు కమల్‌హాసన్. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత షారుక్‌ఖాన్, ఈ ‘జీరో’ సినిమాలో, సినిమా అంతటా మరుగుజ్జు వ్యక్తిగా నటిస్తున్నాడు. అయితే ఇందులో షారుక్‌ది సింగిల్ రోల్.
అనుష్క అలా, కత్రినా ఇలా..
‘జీరో’ సినిమాలో అందాల భామలు అనుష్క శర్మ (Anushka Sharma), కత్రినా కైఫ్ (Katrina Kaif) హీరోయిన్లుగా నటించారు. నిజానికి ఈ ఇద్దరూ షారుక్ ఖాన్ కంటే హైట్‌గా వుంటారు. మరి, షారుక్ ‘మరుగుజ్జు’ పాత్రలో కన్పిస్తే, వాళ్ళ పరిస్థితేంటి.? అనుష్కనేమో వీల్ ఛెయిర్‌కి పరిమితం చేసేశారు. కత్రినా కైఫ్ మాత్రం సూపర్ హాట్‌గా కన్పించబోతోంది. ఓ సినీ నటిగా.. లేడీ సూపర్ స్టార్ పాత్రలో నటిస్తోంది. ట్రైలర్‌లో అనుష్కని చూస్తే, ‘టూ హాట్ టూ హ్యాండిల్’ అనకుండా వుండలేరు. అంత హాట్‌గా కన్పించింది. అనుష్క మాత్రం, వీల్ ఛెయిర్‌లో వుంటూనే తన హావభావాలతో కొల్లగొట్టేసింది. ఒకరు గ్లామర్‌తో, ఇంకొకరు గ్లామర్ లేకుండా అదరగొట్టేశారన్నమాట.
బవ్వే సింగ్.. బుడ్డర్ ఖాన్
ఇంతకీ ‘జీరో’ (Zero) సినిమాలో షారుక్ ఖాన్ పాత్ర పేరేంటో తెలుసా? బవ్వే సింగ్ (Bavve Singh). పాపం, అతని మరుగుజ్జుతనమే అతనికి శాపమై పెళ్ళీడు వయసు దాటేసినా ఎవరూ అతనికి పిల్లనివ్వడానికి ముందుకు రారు. మ్యారేజీ బ్యూరోల చుట్టూ తిరుగుతుంటాడు బవ్వే సింగ్. మ్యారేజ్ బ్యూరో సైతం, బవ్వే సింగ్‌ని ఎగతాళి చేస్తే ఓ ఫొటో చూపించి, అందులోని అనుష్కని చూసి మనసుపడతాడు. అయితే ఆమెను కలిసేందుకు వెళ్ళి, ఆమె వీల్ ఛెయిర్‌కే పరిమితమైన దివ్యాంగురాలని తెలుసుకుని షాకవడం.. ఈ క్రమంలో ‘ఫొటోలో నాకు చక్రాల కుర్చీ కన్పించలేదు’ అని డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంటుంది. అనుష్క, వీల్ ఛెయిర్‌కి పరమితమవడమే కాదు, ఆమెకు మాట కూడా సరిగ్గా రాదు. వణుకుతున్నట్లుగా ఆమె మాట్లాడే డైలాగ్స్ కొంత ఇబ్బందికరంగా అన్పించాయి ట్రైలర్‌లో.
కత్రినా కైఫ్ లిప్పు కిస్సు..
ఈ ట్రైలర్‌లో హైలైట్ పాయింట్స్ చాలానే వున్నాయి. అన్నిటిలోకీ కత్రినా, షారుక్ ఖాన్‌కి ఇచ్చే లిప్ కిస్‌ని మెయిన్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. మరుగుజ్జు కదా, అందుకే బవ్వే సింగ్‌ని ముద్దు పెట్టడానికి కత్రినాకైఫ్ బాగా కిందికి వంగాల్సి వచ్చింది. ఈ సీన్ భలేగా పండింది. ఓ సీన్‌లో కత్రినా, షారుక్ ఖాన్‌ని తోసేస్తుంది. ఆ సీన్‌లో షారుక్‌ఖాన్ ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతం అంతే. మొత్తంగా ట్రైలర్‌లో ఏ పాత్రని చూసినా, నటించినట్లుండదు.. జీవించినట్లే వుంటుంది. అదీ ‘జీరో’ ప్రత్యేకత. డిసెంబర్ 21న ఈ ‘జీరో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెడ్ చిల్లీస్ నిర్మాణం
షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Red Chillies Entertainments) పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆనద్ ఎల్ రాయ్ (Anand L Rai) ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో మాధవన్ నటించాడు.