Table of Contents
ఇదివరకటి రోజుల్లో సినిమా పోస్టర్లపై ‘పేడ’ కొట్టి, తమ వ్యతిరేకతను చాటుకునేవారు ‘హేటర్స్’. ట్రెండ్ మారిపోయింది. సినిమాలపైనా, రాజకీయాలపైనా జుగుప్సాకరమైన రీతిలో వ్యవహరించడానికి సోషల్ మీడియాని (Social Media Trolling Movies Politics) ఎంచుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో ‘వినయ విధేయ రామ’ సినిమా ఎదుర్కొన్నంత ‘ట్రాలింగ్’ (Social Media Trolling Movies Politics) ఇంకే ఇతర సినిమా ఎదుర్కోలేదనడం అతిశయోక్తి కాదేమో. ఈ ట్రాలింగ్ అనేది ఒక్క రామ్‌చరణ్‌కే పరిమితం కాదు. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో కూడా ఇలాంటి అనుభవాన్ని చవిచూశాడు. మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్, ప్రభాస్.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఎవరూ అతీతం కాలేదు.
నచ్చకపోతే చూడటం మానెయ్యడం అనేది పాత కథ. నచ్చినా, నచ్చకపోయినా, జుగుప్సాకరమైన రీతిలో వ్యవహరించడం కొత్త ట్రెండ్. ఏ హీరోకి దెబ్బ తగిలితే, ఆ హీరో అభిమానులు ఆవేదన చెందడం, మిగతావారు చూసి, ‘ఇది అవసరమా.?’ అని ఆందోళన చెందడం చాలాకాలంగా జరుగుతూనే వుంది. అయినా, ఆగడంలేదు.
సినిమాలు మాత్రమే కాదు.. రాజకీయాలు కూడా!
సినిమా రంగమే ‘ట్రాలింగ్’ సమస్యను ఎదుర్కొంటోందనుకుంటే అది పొరపాటే. ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. ఇలా ఒకరేమిటి? ట్రాలింగ్‌ని తప్పించుకున్న రాజకీయ నాయకుడు ఎవరూ లేరు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఆఖరికి.. జగన్ సోదరి షర్మిల కూడా ట్రాలింగ్ బాధను అనుభవిస్తున్నవారే.
వైఎస్ జగన్‌ని (YS Jaganmohan Reddy) రాజకీయంగా విమర్శిస్తే అదొక లెక్క, షర్మిల ఏం పాపం చేశారని, ఆమెను ట్రాలింగ్ (Social Media Trolling Movies Politics) చేస్తున్నారు? చంద్రబాబు మీద, ఆయన తనయుడు లోకేష్ (Nara Lokesh) మీదా విమర్శలు చేయడంతో సరిపెట్టడంలేదు, చంద్రబాబు కోడలు బ్రాహ్మణినీ ట్రాలింగ్‌లోకి లాగుతున్నారు.
పవన్‌కళ్యాణ్ వైవాహిక జీవితం గురించీ, పవన్ నుండి విడాకులు పొందిన రేణుదేశాయ్ గురించీ ట్రాలింగ్ చేయడమంటే, అంతకన్నా దారుణం ఇంకేముంటుంది?
వాళ్ళింట్లో అక్కా చెల్లెళ్ళు లేరా? (Social Media Trolling Movies Politics)
ట్రాలింగ్ చేసేవాళ్ళు కూడా దురదృష్టవశాత్తూ మనుషులే. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఒకరి మీద అభిమానం చూపించడం తప్పు కాదు కానీ, ఇంకొకరి మీద ద్వేషం చూపాలనుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవత్వం కాదు. అలాంటోళ్ళని ‘మనుషులు’గా భావిస్తే, అంతకన్నా పొరపాటు ఇంకొకటి వుండదు.
సృష్టిలో ఏ మనిషి అయినా, తల్లి గర్భంలోంచి బయటకు రావాల్సిందే. కానీ, అత్యంత జుగుప్సాకరమైన భాషని కొందరి మీద ప్రయోగిస్తూ, ఈ క్రమంలో తల్లిని దూషించడం హేయం. క్యాన్సర్‌కి వైద్యం అందుబాటులో వుందేమోగానీ, ఇలాంటి ‘ట్రాలింగ్’ (Social Media Trolling Movies Politics) రోగానికి వైద్యం చాలా చాలా కష్టం. విమర్శ వేరు, ద్వేషం వేరు. ఆ ద్వేషాన్ని మించిపోయింది ట్రాలింగ్. హీరోల అందాలపై కామెంట్లు చేసే కురూపి ధోరణి ట్రాలింగ్ చేసేవారికే చెల్లింది.
ఓ వ్యక్తి మీద కావొచ్చు, ఓ వార్త మీద కావొచ్చు.. సోషల్ మీడియాలో స్పందించేందుకు ఎవరికైనా అవకాశం వుంది. కానీ, ద్వేషించడం కోసమే సోషల్ మీడియాని ఎంచుకుంటే, అసలు ఇలాంటోళ్ళని ఏమనాలో కూడా ఎవరికీ అర్థం కాదాయె. మాటలు కొత్తగా వెతుక్కోవాలి. ‘సంస్కారం పరిధి’ దాటి, ఇలాంటి వ్యక్తులపై స్పందించాల్సి వస్తుందేమో.
సినిమాలపై ట్రాలింగ్ ఎవరికి నష్టం? (Social Media Trolling Movies Politics)
ఓ నిర్మాత కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు. ఫలానా హీరోతో సినిమా చేస్తే లాభమొస్తుందని నిర్మాత భావిస్తాడు. మంచి సినిమా తీస్తే లాభాలొస్తాయి, చెత్త సినిమా తీస్తే నష్టాలొస్తాయి. ఒకే హీరోకి ఆ నిర్మాత పరిమితం కాడు కదా? సినిమా అంటే హీరో ఒక్కడే కాదు, వందలాదిమంది ఆ సినిమా కోసం కష్టపడ్తారు. ‘
ట్రాలింగ్, నెగెటివ్ ట్రెండింగ్’ వల్ల హీరోకి పెద్దగా వచ్చే నష్టమేమీ వుండదు. సినిమాకి పనిచేసిన వందలాదిమందిపై ఆ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా వుంటుంది. ఓ సినిమా చచ్చిపోతే, ఆ నష్టం తెలుగు సినీ పరిశ్రమకి.
సినిమా విడుదలకు ముందే తొందర
రేపు సినిమా విడుదలవుతోందంటే, రెండు మూడు రోజుల ముందే ‘జుగుప్స’ని ఒంటికి గట్టిగా దట్టించేసుకుని సోషల్ మీడియాలోకొస్తున్నారు కొందరు. ‘సినిమా డిజాస్టర్, సినిమా ఫ్లాప్..’ అంటూ కథ మొదలు పెడుతున్నారు. సినిమా చూశాక ప్రేక్షకుడెలాగూ చూసేస్తాడు.
మౌత్ టాక్ కంటే సినిమాపై ప్రభావం చూపేది ఇంకేమీ వుండదు. కానీ, దురదృష్టవశాత్తూ ఓవర్సీస్‌లో సినిమాల్ని చంపెయ్యడానికి, ఈ ‘ముందస్తు తొందర’ బాగా ఉపయోగపడ్తోంది. ఈ పైత్యానికి మందు వేసేదెలా.?
వాళ్ళసలు మనుషులేనా?
చివరగా ఒక్క మాట.. సోషల్ మీడియా మనందరిది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. మంచి విషయాల కోసం సోషల్ మీడియాని వినియోగించకపోయినా నష్టం లేదు.. కానీ, జుగుప్స కోసమే సోషల్ మీడియాని ఆశ్రయిస్తామంటే.. వాళ్ళని మనుషులుగా కాక, సోషల్ జంతువులుగా పరిగణించాల్సి వస్తుంది.
చిన్న కరెక్షన్, హేటర్స్ కావొచ్చు.. దుష్ప్రచారం చేసేవాళ్ళే కావొచ్చు.. ట్రాలింగ్ మీదనే బతికేసేవాళ్ళని కావొచ్చు.. వాళ్ళని ‘జంతువులతో’ పోల్చితే, వాటికీ అవమానమే.