TVK Vijay Single Simham.. ప్రముఖ సినీ నటుడు విజయ్, తమిళనాట కొత్త రాజకీయ పార్టీ టీవీకే (తమిళగ వెట్రి కజగం) ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
త్వరలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేయబోతోంది. ఎవరితోనూ పొత్తు లేదనీ, టీవీకే పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని తాజాగా టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు.
చిత్రమేంటంటే, విజయ్ పార్టీకి సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు మద్దతిస్తున్నాయి. కారణాలేంటన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో, ‘విజయ్ ఒంటరిగానే పోటీ చేయబోతున్నాడు.. అదీ, ధైర్యంగా.. సింగిల్ సింహం’ అంటూ వైసీపీ శ్రేణులు సెటైర్లేయడం చూశాం.
అయితే, పవన్ కళ్యాణ్‌కి విజయ్ అత్యంత సన్నిహితుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే, వైసీపీ దిక్కుమాలిన రాజకీయం.. అది మళ్ళీ వేరే చర్చ.
TVK Vijay Single Simham.. తమిళ రాజకీయాలు.. సమ్‌థింగ్ వెరీ స్పెషల్..
తమిళ రాజకీయాలు ఒకింత చిత్రంగా వుంటాయి. అక్కడ, ప్రతీకార జ్వాల ఒకింత ఎక్కువగా వుంటుంది. కరుణానిధి – జయలలిత మధ్య రాజకీయ పోరు.. పరస్పర అరెస్టులదాకా వెళ్ళింది.
విజయ్, తన సినిమా ‘జననాయగన్’ విడుదలకు ఎన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయో చూస్తున్నాం. అధికార డీఎంకే, విజయ్ సినిమాకి మోకాలడ్డుతోంది.
తన సినిమాని రిలీజ్ చేసుకోవడానికి, విజయ్ నానా తంటాలూ పడుతున్నాడు. విజయ్ మీద డీఎంకే నుంచే కాదు, ప్రతిపక్షం అన్నాడీఎంకే నుంచి కూడా ఒత్తిడి వుంది.
ఈ ఒత్తిళ్ళ నడుమ విజయ్, ఎటో ఒక వైపు చూడక తప్పదన్న ప్రచారం జరిగింది. కానీ, చిత్రంగా విజయ్, ఒంటరి పోరాటానికే సిద్ధమయ్యాడు.
ఎన్నికల్లో తమిళ ఓటర్లు తమకే పట్టం కడతారని విజయ్ బలంగా నమ్ముతున్నాడు. తమిళ రాజకీయాల్లో సినీ ప్రముఖుల హవా తెలిసిన విషయమే.
విజయ్ ఎంత భిన్నం.?
ఎంజీఆర్, జయలలిత మాత్రమే కాదు, కరుణానిధి కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తే. అదే సమయంలో, రజనీకాంత్ రాజకీయాలకు భయపడితే, కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టినా, ఏమీ సాధించలేకపోయారు.
మరో తమిళ సినీ ప్రముఖుడు విజయ్ కాంత్ కూడా, ముఖ్యమంత్రి పదవి మీద ధీమాతో రాజకీయ పార్టీ పెట్టినా, ఆ పదవిని అందుకోలేకపోయారు.
ఏమో, గుర్రం ఎగరావచ్చు. అలానే, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. కాకపోతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీకే విజయ్, ‘సింగిల్ సింహం’ రాజకీయాలు ఏమౌతాయో వేచి చూడాల్సిందే.
అన్నట్టు, ఎన్నికల కమిషన్ టీవీకే పార్టీకి ‘విజిల్’ గుర్తుని కేటాయించింది.
