Table of Contents
ఈ సినిమాలో ఏదో కొత్తగా (Uppena Review) చూపించబోతున్నారేమో.. అన్న ఉత్కంఠ సినిమా ప్రారంభమవుతూనే చాలామందిలో ‘ఆశ’ రేకెత్తించారు చిత్ర దర్శక నిర్మాతలు. అలా ‘ఉప్పెన’ సినిమా పట్ల ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది.
దర్శకుడు, హీరో, హీరోయిన్.. ఇలా అంతా కొత్తవారే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ వద్ద ‘అసిస్టెంట్’గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం.. సినిమా కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్ అవడం.. ఇవన్నీ సినిమాపై అంచనాల్ని అమాంతం పదింతలు చేసేశాయి.
‘ఇది వంద కోట్ల సినిమా’ అని దర్శకుడు సినిమా చెప్పడం మరింతగా సినిమాపై హైప్ ఏర్పడటానికి కారణమయ్యింది. ఇంతకీ ఉప్పెన కథేంటి.? వివరాల్లోకి వెళదాం.
చిత్రం: ఉప్పెన (Uppena Review)
నటీనటులు: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, సాయి చంద్ తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: షాందత్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్, సుకుమార్
దర్శకత్వం: బుచ్చిబాబు సన
విడుదల తేదీ: 12 ఫిబ్రవరి 2021
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
కథలోకి వెళితే..
ఓ జాలరి కొడుకు ఆశి (Panja Vaishnav Tej), ఆ ఊరి పెద్ద రాయణం (Vijay Sethupathi) కుమార్తె బేబమ్మతో (Krithi Shetty) ప్రేమలో పడతాడు. బేబమ్మది సంపన్న కుటుంబం, ఆశిది పేద కుటుంబం కావడంతో ఇద్దరి ప్రేమకీ ఇబ్బందులు ఎదురవుతాయి. మరి, కుమార్తె ప్రేమ వ్యవహారం తెలుసుకున్న రాయనం ఏం చేస్తాడు.?
ఆశి – బేబమ్మ తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు.? ఈ క్రమంలో ఇద్దరికీ ఎదురైన సమస్యలు ఎలాంటివి.? రొటీన్ ప్రేమ కథలా అనిపిస్తోన్న ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటి.? ఎందుకు ‘ఓ ప్రత్యేకమైన అంశం’ చుట్టూ అంత ప్రచారం జరిగింది.? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.
నటీనటులెలా చేశారంటే..
తొలి సినిమా అన్న బెరుకు అస్సలు కనిపించనంత బాగా పెర్ఫామ్ చేశాడు పంజా వైష్ణవ్ తేజ్. ఆశి పాత్రలో ఒదిగిపోయాడు. కళ్ళతోనే చాలా భావాలు పలికించేశాడు. ‘ఈజ్’ విషయంలో వైష్ణవ్ నూటికి నూరు మార్కులూ వేయించేసుకున్నాడు. తొలి సినిమాతోనే ఇంత ఈజ్ ప్రదర్శించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
కృతి శెట్టి చాలా క్యూట్ అప్పీల్ చాటుకుంది. నటన పరంగా ఆమెకీ మంచి మార్కులే పడతాయి. లీడ్ పెయిర్ ఇంత చక్కగా పెర్ఫామ్ చేశాక, ఆ సినిమాకి అది బోనస్ పాయింట్ కాకుండా ఎలా వుంటుంది.?
విజయ్ సేతుపతి ఈ సినిమాకి మరో ఎస్సెట్. సొంత వాయిస్ అయితే అది ఇంకాస్త బావుండేదేమోనన్న భావన విజయ్ సేతుపతిని తెరపై చూశాక చాలామందికి అనిపిస్తుంది. మిగతా పాత్రల్లో కొన్ని అనవసరం అనిపించడం సినిమాకి సంబంధించి కొంత మైనస్.
సాంకేతికంగా ఎలా వుందంటే..
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సంగీతం అదిరిపోయిందనడానికి పాటలు, సినిమా విడుదలకు ముందే హిట్టవడమే నిదర్శనం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయా సన్నివేశాలకు స్పెషల్ అప్పీల్ తెచ్చిపెట్టిందన్నది నిర్వవివాదాంశం.
కాస్ట్యూమ్స్, ఆర్ట్.. ఇలా అన్నీ బాగా కుదిరాయి. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే బావుండేది. సాగతీత సన్నివేశాలకు కొంచెం కత్తెర వేసి వుంటే బావుండేదన్న భావన కలుగుతుంది. నిర్మాణపు విలువలు బావున్నాయి.
విశ్లేషణ
సినిమా కథలో అసలు ట్విస్టు ఇదేనంటూ సోషల్ మీడియా వేదికగా చాలా కాలంగా ఓ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఆ ప్రచారానికి తగ్గట్టుగా ‘ఆ సన్నివేశం వుందా.? లేదా.?’ అన్న ఉత్కంఠ సినిమా రిలీజయ్యేదాకా నెలకొంది.
‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.?’ అన్న ప్రశ్న ఎలాగైతే పాపులర్ అయ్యిందో, ఎంతటి ఉత్కంఠ కలిగించిందో, ‘ఆ సన్నివేశం’ గురించి కూడా అంతే ఉత్కంఠ నెలకొంది. కానీ, దాన్ని అంత గొప్పగా, ప్రత్యేకంగా చూపడంలో దర్శకుడు సఫలమవలేదా.? లేదంటే, ముందే విషయం లీక్ అయిపోవడం వల్ల ఆ సన్నివేశం తాలూకు పవర్ తగ్గిపోయిందా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
వినోదానికి ఆస్కారం ఎక్కువగా వున్నాసరిగ్గా వాడుకోలేదు. కొన్ని అనవసరపు పాత్రలకు అధిక ప్రాధాన్యతనివ్వడమూ ఇబ్బందికరంగా మారింది. చిన్నా చితకా ఇలాంటి విషయాల్ని పక్కన పెడితే, లీడ్ పెయిర్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి అలాగే విజయ్ సేతుపతి.. వీళ్ళతోపాటుగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి (Uppena Review) మేజర్ హైలైట్స్.
ఒక చిన్న మాట: ఉప్పెనంత ప్రేమ.. వుందిగానీ.!