టీమిండియాలో కొత్త రచ్చ షురూ అయ్యింది. విరాట్ కోహ్లీని వున్నపళంగా కెప్టెన్సీ నుంచి తొలగించెయ్యాలన్నది చాలామంది డిమాండ్. ఛత్, ఆస్ట్రేలియా టూర్‌లో తొలి రెండు వన్డేలు ఓడిపోయినంతమాత్రాన, కెప్టెన్ కోహ్లీపై (Virat Kohli Vs Rohit Sharma) ఇంతలా విషం చిమ్ముతారా.? అంటూ మరికొంతమంది తీవ్రంగా స్పందిస్తున్నారు.
అసలు రోహిత్ శర్మకి (Rohit Sharma) ఏమయ్యింది.? ఎందుకు ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్ళలేదు.? అన్న చర్చ ఇంకో వైపు జరుగుతోంది. కోహ్లీ (Virat Kohli)- రోహిత్ మధ్య విభేదాలంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇద్దరూ కలిసి చాలా మ్యాచ్‌లు ఆడారు.. చాలా పరుగులు చేశారు.
కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్ సత్తా చాటిన సందర్భాలు చాలానే వున్నాయి. కానీ, ఇద్దరి మధ్యా (Virat Kohli – Rohit Sharma) ‘కమ్యూనికేషన్ గ్యాప్’ అయితే వుంది. అదెలా ఏర్పడింది.? అన్నదానిపై భిన్న వాదనలు వున్నాయి. కోహ్లీ విషయంలో రోహిత్ అత్యుత్సాహం ప్రదర్శిస్తాడనీ, రోహిత్ విషయంలో విరాట్ కోహ్లీ తెరవెనుక రాజకీయాలు చేస్తాడనీ ప్రచారం జరుగుతోంది చాలాకాలంగా.
అయితే, ఒక్కసారి టీమిండియా (Team India) జెర్సీ వేసుకున్నాక.. రాజకీయాలకు తావుండదు. ఎవరు ఆడినా, టీమిండియా తరఫునే.. టీమిండియాకి విజయాలు అందించాలనే. అయినాగానీ, ఎక్కడో ఓ చిన్న రాజకీయం.. కోహ్లీ – రోహిత్ మధ్య అభిప్రాయ బేధాల్ని కాస్తా తగ్గించుకోలేనంత పెద్ద పెద్ద వివాదాలుగా మార్చేయడం చూస్తున్నాం.
ఆస్ట్రేలియా టూర్‌లో (India Vs Australia) టీమిండియా తడబాటు ఇదే కొత్త కాదు. గతంలోనూ జరిగింది. అక్కడి వాతావరణ పరిస్థితులు వేరు. బ్యాట్స్‌మెన్ పరంగా నిందించడానికి పెద్దగా ఏమీ లేదు. బౌలర్ల విషయంలోనే సమస్య. దాన్ని అధిగమిస్తే, ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టేయొచ్చు.
జట్టు కూర్పు పరంగానూ సమస్యలున్నాయనీ, ఈ విషయంలోనే కోహ్లీ పొరపాట్లు చేశాడనీ ఇంకో పక్క బలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘కోహ్లీ మీద ఒత్తిడి పెరుగుతోంది. కెప్టెన్సీ ప్రెజర్‌ని తట్టుకోలేకపోతున్నాడు.. గతంలో ధోనీ రూపంలో ఓ పెద్దన్న కోహ్లీకి వుండేవాడు.. ఇప్పుడు ఆ పెద్దన్న లేకపోవడంతోనే అసలు సమస్య.. ఈ పరిస్థితుల్లో కెప్టెన్సీని రోహిత్‌కి ఇవ్వడమే మంచిది..’ అన్నది మెజార్టీ అభిప్రాయం.
ఏమో, ఏం జరుగుతుందోగానీ.. విరాట్ కోహ్లీ మాత్రం వరల్డ్ క్లాస్ ఆటగాడు. ఇందులో ఎవరికీ ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. ఎంతటి ఒత్తిడిని అయినా తట్టుకోగలడు.. ఛేజింగ్‌లో విరాట్ సాధించిన పరుగులే నిదర్శనం. జట్టు ప్రయోజనాల రీత్యా అవసరం అనుకుంటే, విరాట్ కోహ్లీ ప్లేస్‌లోకి రోహిత్ శర్మని తీసుకురావొచ్చు.
కానీ, ఇద్దరి మధ్యా వివాదాలంటూ.. ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగడం మంచిది కాదు టీమిండియాకి. బీసీసీఐ (BCCI) పెద్దలు ఇద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడాలి.. సమస్యలేవైనా వుంటే సరిదిద్దాలి. లేకపోతే అంతిమంగా నష్టపోయేది టీమిండియానే. అదే సమయంలో ఇద్దరు మేటి క్రికెటర్లు.. ఈ సమస్యల కారణంగా వివాదాల్లోకెక్కడం.. ఆ ఇద్దరి ఇమేజ్‌కీ డ్యామేజ్ అవడం అసలే మంచిది కాదు.