విడిపోతే బాగుంటాం.. రాష్ట్రాలుగా విడిపోయినా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వుందాం.. అన్నది తెలంగాణ ప్రజల నినాదం. ఆ నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఉద్యమ నేపథ్యంలో ఎన్నెన్నో ‘హద్దులు దాటిన మాటలు’ వినిపించినా, విభజన తర్వాత.. పెద్దగా ఎలాంటి సమస్యల్లేవు ఇరు రాష్ట్రాల మధ్యా (Telangana To Join Hands With Andhra Pradesh).
నిజానికి, కొన్నిరాజకీయ వివాదాలు అప్పుడప్పుడూ తెరపైకొస్తున్నాయేమోగానీ, ప్రజల మధ్య మాత్రం ఎలాంటి అరమరికలూ లేవు. అంతకు ముందు ఎలా తెలుగు ప్రజలు కలిసిమెలిసి వున్నారో, ఇప్పుడూ అదే పరిస్థితి. ‘మనమంతా భారతీయులం.. మనమంతా తెలుగు వాళ్ళం’ అన్న భావనే వుంది.
మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ళకు తెలుగు ప్రజలంతా ఒక్కతాటిపైకి రావాలన్న వాదన తెరపైకొచ్చింది. అదీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కావడం గమనించాల్సిన విషయం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగుతుందా.? లేదా.? అన్నది పక్కన పెడితే, తెలుగు ప్రజల్ని మాత్రం ఈ ‘గొడవ’ మరింత గట్టిగా కలిపేలానే వుంది.

తెలంగాణ మంత్రి కేటీఆర్, విశాఖ వెళ్ళి మరీ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతిస్తానని ప్రకటించారు. తెలంగాణ సమాజం, ఆంధ్రపదేశ్‌కి ఈ విషయంలో అండగా (Telangana To Join Hands With Andhra Pradesh) వుంటుందని చెప్పడం అభినందించాల్సిన విషయమే. రాష్ట్రాల పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తోంది.? అన్నది వేరే చర్చ.
ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకాలంటే, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సఖ్యత పెరగాలి. ఇది ఎప్పటినుంచో అందరూ చెబుతున్నమాటే. కానీ, రాజకీయ పరమైన ఆలోచనలతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్యా అడపా దడపా వివాదాలు తెరపైకి రావడం, ఆ తర్వాత అవి సమసిపోవడం చూస్తూనే వున్నాం.
ఇదిలా వుంటే, సినీ నుటుడు, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కూడా విశాఖ ఉక్కు పరిశ్రమపై స్పందించారు. తాను విద్యార్థిగా వున్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నడిచిన ఉద్యమం తాలూకు నినాదాలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సబబు కాదని నినదించారు.
సినీ పరిశ్రమ నుంచి ఇంకా చాలామంది ప్రముఖులు ఈ విషయంపై గళం విప్పాల్సి వుంది. ఇది విశాఖకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. రేప్పొద్దున్న తెలంగాణ గడ్డ మీద కూడా ప్రైవేటు రక్కసి ప్రవేశించే ప్రమాదం లేకపోలేదన్నది తెలంగాణ మంత్రి కేటీఆర్ హెచ్చరిక. మనమంతా ఒక్కతాటిపైకి వస్తే.. మన తెలుగు జాతి (Telangana To Join Hands With Andhra Pradesh) ఏకమైతే, ఎలాంటి ప్రైవేటు రక్కసినైనా ఎదుర్కోగలం.