ప్రభుత్వం పెద్దదా.? ప్రైవేటు పెద్దదా.? అన్న అనుమానం చాలామందిలో వుండడం సహజమే. అన్ని పనులూ ప్రభుత్వం చేయలేదు గనుక, ఒక్కోసారి ప్రైవేటు సహకారం తీసుకోవాల్సి రావొచ్చు. కానీ, సహకారం కాస్తా.. అమ్మకాలకు దారి తీస్తేనే అది పెను సమస్యగా (Visakhapatnam Steel Plant Privatization) మారుతుంది.
విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి కేంద్ర ప్రభుత్వం తన వాటాల్ని వెనక్కి తీసుకుని, ప్రైవేటీకరణ చేయబోతోంది. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది కూడా.
విశాఖ ఉక్కు కర్మగారానికి (Visakhapatnam Steel Plant Privatization) వున్న భూముల విలువే లక్ష కోట్లని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసేశారు. ఓ రెండు లక్షల కోట్ల వరకు కేంద్రానికి ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ద్వారా నిధులు అందవచ్చుగాక.
కానీ, అంత మొత్తానికి ఏదన్నా ప్రైవేటు సంస్థ ఆ ఉక్కు పరిశ్రమ మీద పెట్టుబడి పెడితే, లాభాలు ఎలా సాధించగలుగుతుంది.? ప్రభుత్వానికి సాధ్యం కానిది, ప్రైవేటుకి ఎలా సాధ్యపడుతుంది.? అని సామాన్యుడు బుర్ర గోక్కుంటున్నాడు.
దేశ ఆర్థిక గురించి కేంద్రంలో అధికారంలో వున్నవారు గొప్పలు చెప్పుకోవచ్చగానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్కు పరిశ్రమకు నష్టాలు ఎందుకు వచ్చాయి.? దాన్ని ఎలా గట్టెక్కించవచ్చు.? అన్నది వేరే చర్చ.
కానీ, విశాఖ ఉక్కు.. అంటే అదొక బ్రాండ్. ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి అదో అతి పెద్ద ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రాజెక్టు గనుక అంత క్రేజ్ వుంది. ప్రైవేటు పరం అయితే, ఈ క్రేజ్ ఇలాగే వుంటుందా.? ఆ బ్రాండ్ అలాగే కొనసాగుతుందా.? చెప్పలేం. అసలు ఆ ప్రాజెక్టు ఉనికి సమీప భవిష్యత్తులో ఏమవుతుందోనన్న ఆందోళన కూడా వుంది.
ప్రైవేటు పరం అయిన చాలా సంస్థలు అడ్రస్ కోల్పోయిన వైనం గురించి రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అయితే, ఆంధ్రులు ఆరంభ శూరులు.. అప్పటికప్పుడు ఉధృతమైన ఆందోళన చేస్తారు.. ఆ తర్వాత పార్టీల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ‘విభజన రాజకీయాలు’ చేసేస్తారన్న విమర్శ వుండనే వుంది.
సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, అమరావతి.. ఇలా చాలా ఉద్యమాల విషయంలో ఏం జరిగిందో, విశాఖ ఉక్కు విషయంలోనూ ఆంధ్రుల పోరాటం అలాగే ‘కొండంత రాగం తీసి’ తుస్సుమనిపించడం ఖాయమన్న మాటే నిజమవుతుందా.? ఎవర్నీ ఈ విషయంలో నిందించాల్సిన అవసరం లేదు. అంతా ఒక్కటై నిలబడితే, విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి అవకాశం వుంటుంది.