Table of Contents
Ys Jagan Immature Politics.. రాజకీయాల్లో గెలుపోటమలు సహజం.. అని తరచూ చెప్పుకుంటూనే వుంటాం. గెలిచాక, విర్ర వీగకూడదు. ఓడిపోయాక కుంగిపోకూడదు.. ఈ మాటలూ వింటూనే వున్నాం.
2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లతో బంపర్ విక్టరీ కొట్టిన వైసీపీ, ఐదేళ్ళలో కేవలం 11 సీట్లతో ఎందుకు పాతాళానికి పడిపోయింది.? ఈ విషయమై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వుంది.
కానీ, కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు గడిచిపోతాయ్.. అని, 2024 ఎన్నికల ఫలితాల అనంతరం ‘డే వన్’ నుంచీ తనకు తాను చెప్పుకుంటున్నారు, పార్టీ శ్రేణుల్నీ అలా ప్రిపేర్ చేస్తున్నారు.
అక్కడితో ఆగకుండా, ‘మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే.. వచ్చేది మా ప్రభుత్వమే.. అందులో, మీరూ పని చేయాల్సి వుంటుంది..’ అని అధికారుల్ని జగన్ బెదిరించడం అభ్యంతరకరమే.
Ys Jagan Immature Politics.. వచ్చేదెవరు.? వున్నదెవరు.?
నాలుగేళ్ళ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు.? అన్నది ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారు. కానీ, ప్రస్తుతం అధికారంలో వున్నది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.
వైఎస్ జగన్ ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. అయినా, జగన్ బెదిరిస్తే.. అటు వైపు బెదిరిపోయేవారెవరున్నారు.?
‘గుర్తు పెట్టుకో జగన్.. అదఃపాతాళానికి తొక్కేస్తా..’ అని చెప్పి మరీ, వైసీపీని రాజకీయంగా పాతాళానికి తొక్కేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వున్నారు.
ఎన్నికల ముందర.. రాజకీయ నాయకులు ఒకింత ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తే, అప్పటికి ఒకింత ‘వాక్యూమ్’ క్రియేట్ అయి వుంటుంది గనుక, ఆ స్టంట్లు కొద్దో గొప్పో వర్కవుట్ అవుతాయి.
బెంగళూరు నుంచి.. వీకెండ్ పొలిటీషియన్..
కానీ, కొత్త ప్రభుత్వం ఏర్పడి.. ఏడాది కాకుండానే అత్యుత్సాహం ప్రదర్శిస్తే.. అదీ, వారానికోసారి బెంగళూరు నుంచి వచ్చి, ఆంధ్ర ప్రదేశ్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే.. ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారు.?
ఒక్కటి మాత్రం నిజం. వైఎస్ జగన్ ఆవేశపూరిత వ్యాఖ్యల వల్ల, బెదిరించే ధోరణి వల్ల.. వైసీపీనే మరింతగా నష్టపోతుంది.
ఈ బెదిరింపుల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే, నష్టపోయేది వైసీపీ క్యాడర్. ఆ విషయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసే, ఇదంతా చేస్తున్నారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
అయినా, వైసీపీ పాలనను ‘ఛీ’ కొట్టింది ప్రజలే కదా.. మళ్ళీ అదే పాలన వస్తుందని వైఎస్ జగన్ చెబుతోంటే, జనంలో వైఎస్ జగన్ ఇంకెంత పలచనైపోతారు.?
మామిడి కాయల్ని ట్రాక్టర్లతో తొక్కించి..
తమ పాలనా వైఫల్యానికి జగన్ బాధ్యత తీసుకోవాలి.. తప్పులపై సమీక్షించుకోవాలి.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.. అదంతా మానేసి, ‘మళ్ళీ వచ్చేది మేమే’ అని బెదిరింపులకు దిగడం అస్సలు సబబు కాదు.
తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా మామిడి రైతుల కష్ట నష్టాల్ని తెలుసుకునేందుకు వెళ్ళారు.
జగన్ పర్యటనకి హైప్ కోసం, టన్నుల కొద్దీ మామిడికాయల్ని రోడ్ల మీద ట్రాక్టర్లతో పడేయించి, తొక్కించారు వైసీపీ స్థానిక నాయకులు.
ఓ వైపు వైసీపీ చీప్ పబ్లిసిటీ స్టంట్లు ఇలా వుంటే, ఇంకో వైపు జగన్ బెదిరింపులు.. వైసీపీని మరింతగా దిగజార్చేస్తున్నాయి రాజకీయంగా.