YSRCP Legislative Council.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు, అది ‘దండగ’.! ఇప్పుడేమో, అదే మనకి దిక్కు.. అంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
ఔను, శాసన మండలిని ఖర్చు దండగ వ్యవహారంగా అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలంటూ శాసన మండలి అవసరమే లేదన్నారాయన.
అది పాత కాలం.! కాలం, అందరి వంకర్లనూ తీర్చేస్తుందని అంటుంటారు పెద్దలు. అప్పుడు వద్దన్న శాసన మండలి, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ముద్దు’ అయ్యింది.!
YSRCP Legislative Council.. శాసన మండలి గనుక రద్దయి వుంటే.?
శాసన మండలిని రద్దు చేస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం, అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా అత్యంత జుగుప్సాకరమైన రీతిలో చర్చ జరిగింది.
పెద్దల సభగా అభివర్ణించే శాసన మండలిని ఖర్చు దండగ వ్యవహారంగా, అవమానకరమైన రీతిలో వైసీపీ అభివర్ణించింది.
అసెంబ్లీలో తమ పార్టీకి వున్న సంఖ్యాబలంతో ఆ తీర్మానాన్ని అప్పట్లోనే కేంద్రానికి పంపింది వైసీపీ సర్కారు.
కానీ, అప్పటి కేంద్ర ప్రభుత్వం, అప్పటి వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనను పట్టించుకోలేదు. దాంతో, శాసన మండలి రద్దు.. వ్యవహారం అలా ఆగిపోయింది.
ఒకవేళ శాసన మండలి గనుక రద్దయి వుంటే, ఇప్పుడు పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే వైసీపీ నేతలకు వెన్నులో వణుకు పుట్టుకొస్తుందన్నది నిర్వివాదాంశం.
అసెంబ్లీకి వెళ్ళరుగానీ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి హాజరై వుండాలి. కానీ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ ఇష్టపడటంలేదు.
మరోపక్క, వైసీపీ శాసన మండలి సభ్యులు మాత్రం, శాసన మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. ఇదో విచిత్రం.
Also Read: సాగతీత.. సర్వైవల్ థ్రిల్లర్.!
పైగా, శాసన మండలిలో వైసీపీ వాయిస్ బలంగా వినిపించాలని తమ పార్టీకి చెందిన మండలి సభ్యులకు వైఎస్ జగన్, దిశా నిర్దేశం చేస్తుండడం గమనార్హం.
రాజకీయాల్లో ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేమైనా వుంటుందా.?
