Barrelakka Telangana Elections 2023.. అసలు పేరు కర్నె శిరీష.! కానీ, ఆమెని అంతా ‘బర్రెలక్క’ అని సంబోదిస్తుంటారు.
డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో, బర్రెలు కాసుకుంటున్నట్లు చెబుతూ, సంబంధిత వీడియో పోస్ట్ చేసి వైరల్ అయ్యిందీమె.
అలా తనకు వచ్చిన ‘బర్రెలక్క’ అనే గుర్తింపుతోనే, ఆ పేరునే అసలు పేరుగా మార్చుకున్న కర్నె శిరీష, కాస్త ధైర్యం చేసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగడం గమనార్హం.
కేసీయార్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్.. ఈ పార్టీల నుంచి పోటీ చేస్తోన్న హేమాహేమీల్ని తట్టుకుని నిలబడింది కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క.
Barrelakka Telangana Elections 2023.. సామాన్యురాలే.. అసామాన్యమైన రాజకీయాల్లోకి.!
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడమే కాదు, ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
సోషల్ మీడియా వేదికగా బర్రెలక్క పేరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మార్మోగిపోతోంది. ఆమెకు ఆర్థికంగానూ సాయం చేస్తున్నారు ఎన్నికల్లో సామాన్యులు.
ప్రచారంలో, బర్రెలక్క దూసుకుపోతోంది. గెలిస్తే, తాను ఏమేం చేయడానికి ప్రయత్నిస్తానో చెబుతూ, ఓటర్లనూ ఆకట్టుకుంటోంది కర్నె శిరీష.
కోట్లు ఖర్చు చేయలేదుగానీ..
కోట్లు ఖర్చు చేస్తే తప్ప, ప్రధాన రాజకీయ పార్టీల్లో టిక్కెట్లు దొరకని పరిస్థితి. అలాగే, కరెన్సీ నోట్లు పంచితేనే తప్ప, ఓట్లు సంపాదించుకోలేని దుస్థితి ప్రధాన రాజకీయ పార్టీల్లో కనిపిస్తుంటుంది.
అలాంటిది, ఓ సామాన్యురాలు.. ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేయడమంటే, గెలుపోటములతో సంబంధం లేకుండా అది నైతిక విజయంగానే చెప్పుకోవాలి ఇప్పుడున్న రోజుల్లో.!
రాజకీయం ఎవడబ్బ సొత్తూ కాదు.! రాజకీయమంటేనే ప్రజా సేవ.! ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు.! మారాల్సింది ఓటర్లే.! మారతారా మరి.?
Also Read: రామ్ గోపాల్ వర్మని తిట్టాలా? ఇలా ట్రై చేసి చూడండి.!
కొసమెరుపేంటంటే, ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకి బెదిరింపులు ఎదురవుతుండడం.
అంతకన్నా దారుణమైన విషయమేంటంటే, ‘నాకు ఓటెయ్యండి’ అని ఆమె అభ్యర్థిస్తోంటే, ‘ఎంతిస్తావ్.?’ అని కొందరు ఓటర్లు నిస్సిగ్గుగా అడుగుతుండడం.!