Table of Contents
Vijay Deverakonda Kingdom Review.. చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన తన అన్నని తిరిగి తెచ్చుకునే అవకాశాన్ని ఓ సాధారణ కానిస్టేబుల్ సద్వినియోగం చేసుకున్నాడా.?
అసలు ఆ అన్న, ఇంట్లోంచి ఎలా పారిపోయాడు.? ఎలాంటి పరిస్థితుల్లో అన్న గురించిన సమాచారం తమ్ముడికి తెలిసింది.? ఇదే, ‘కింగ్‌డమ్’ మూల కథ.
విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.
అనిరుధ్ రవిచందర్ ఈ ‘కింగ్‌డమ్’ చిత్రానికి సంగీతం అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య, అరవింద్ అందేపల్లి. సత్యదేవ్, భూమి శెట్టి, వెంకిటేష్, రోహిణి, అయ్యప్ప పి శర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం.
Vijay Deverakonda Kingdom Review.. అన్నీ ప్రశ్నలే..
అసలు సినిమాలో హీరోయిన్ ఎందుకు వుంది.? ఆమె పాత్రకున్న ప్రాధాన్యత ఏంటి.? హీరో లక్ష్యం ఏంటి.? అన్నిటికీ మించి, దర్శకుడు తెరపై ఏం చూపించాలనుకున్నాడు.?
ఇలా చాలా ప్రశ్నలు మదిలో మెదులుతాయి సినిమా చూస్తున్నంతసేపూ.
ఓ సాధారణ కానిస్టేబుల్, తన పై అధికారిని కొడితే.. పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయ్. కానీ, ఇందులో ‘ప్రమోషన్’ ఇచ్చినట్లు, ఓ పెద్ద కోవర్ట్ ఆపరేషన్ కోసం పంపిస్తారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ని పట్టుకోవడానికి, అతని తమ్ముడైన కానిస్టేబుల్‌ని డిపార్టుమెంట్ వినియోగించుకుందని సరిపెట్టుకోవడానికీ వీల్లేదు. అసలు ఆ డిపార్ట్‌మెంట్ ఏం చేయదలచుకుందో స్పష్టత లేదు మరి.!
పాత్రలూ.. స్వభావాలూ.. అంతా అయోమయం..
సినిమాలో ఏ పాత్ర ఎప్పుడెందుకెలా బిహేవ్ చేస్తుందో ఎవరికీ తెలియదు. పూజలు చేసుకునే తెగ నాయకుడు, ఏకంగా తమ తెగకే చెందిన ఓ వ్యక్తిని చంపేస్తాడు. ఇదేం పైత్యమో మరి.!
రాక్షసుడంటారు.. హీరో అంటారు.. నాయకుడంటారు.. అంతా గజిబిజి గందరగోళం. పోనీ, ఇదంతా మన దేశంలో జరిగే కదా.? అంటే, ‘పాన్ వరల్డ్’ కోణంలో, ఏకంగా శ్రీలంకకు తీసుకుపోయారు కథని.
కథ శ్రీలంకలో జరుగుతున్నా, ఇక్కడే విశాఖ తీరంలో కథ నడుస్తున్నట్లుంటుంది పరిస్థితి. ఇదో రకం గందరగోళం. చివర్లో, తీరంలోని ఇసుకలో కూరుకుపోయిన ఓ పెద్ద పడవని హీరో, కష్టపడి లాగేస్తాడు.
అలా, హీరో ఆ పడవని లాగడంతో, అతనే తాము ఎదురు చూస్తున్న నాయకుడని, ఆ తెగవారంతా ఫీలయిపోతారు.
చెప్పుకుంటూ పోతే, సినిమాలోని ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్.. ఆణిముత్యాలే. దేనికీ అర్థం పర్థం వుండదు.
ఇంత సిల్లీగా ఎలా.?
పాత్రల్ని, సన్నివేశాల్నీ బలంగా తీర్చిదిద్దుతాడన్న మంచి పేరున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, ఇంత సిల్లీ రైటింగ్‌తో ఎలా నిర్మాతల్ని ఒప్పించాడో ఏమో.!
విజయ్ దేవరకొండ అసలు ఈ సినిమాలో చేయడానికేమీ లేదు. సత్యదేవ్ కూడా చేయడానికేమీ లేదు. నిజానికి, ఎవరికీ ఏం చేయడానికీ లేదు. అంత బలహీనమైన రైటింగ్.. ఈ ‘కింగ్‌డమ్’ కొంప ముంచేసింది.
ఆద్యంతం చూస్తే, చాలా సినిమాల్లోని సన్నివేశాల్ని చీటీల రూపంలో మార్చి, కలగాపులగం చేసేసినట్లనిపిస్తుంది ‘కింగ్‌డమ్’.
ఒరిజినల్ సీన్ అనిపించేలా.. ఒక్కటి కూడా కనిపించలేదంటే, అతిశయోక్తి కాదేమో.
Vijay Deverakonda Kingdom Review.. రెండో పార్ట్ వస్తుందా.?
ఏ అన్న కోసం అయితే, వెతుక్కుంటూ శ్రీలంక వరకూ వెళ్ళాడో, ఆ అన్న చనిపోయే పరిస్థితుల్లో, తమ్ముడేమో తప్పతాగి నిద్దరోతాడు.
ఎవర్ని పట్టుకుని శ్రీలంక నుంచి భారత దేశానికి తీసుకురావాలనుకున్నారో, ఆ వ్యక్తి చనిపోతున్నాడని తెలిసి, పోలీసులూ చేష్టలుడిగి చూస్తారు.
కథ విన్నప్పుడైనా విజయ్ దేవరకొండ, సత్య దేవ్.. ఓ సారి ఆలోచించుకుని వుండాల్సింది.
ఇంత పేలవమైన కథలో సంగీతం అయినా, సినిమాటోగ్రఫీ అయినా ఎలా రాణిస్తాయ్.? తిలాపాపం తలా పిడికెడు. వెరసి, ‘కింగ్‌డమ్’.. జస్ట్ బోర్‌డమ్ అంతే.!
సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది కదా.? దానికి అనుకూలంగానే ముగింపు ఇచ్చారు. మరి, ఇంకోసారి రిస్క్ చేస్తారా.?