Ys Jagan Montha Cyclone.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత, పూర్తిగా బెంగళూరుకే పరిమితమైపోయారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.!
పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ గెలిచినా, ఆయన పులివెందులకీ ఎక్కువగా వెళ్ళడంలేదు. అప్పుడప్పుడూ, ‘చుట్టం చూపు’లాగా తాడేపల్లి నివాసానికి వచ్చి వెళుతున్నారు.
సరే, వైఎస్ జగన్ ‘వీకెండ్ రాజకీయం’ వైసీపీని 2029 ఎన్నికల్లో ఏం చేస్తుంది.? అన్నది వేరే చర్చ.
Ys Jagan Montha Cyclone.. తుపాను రాజకీయంలో వైసీపీ..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై మోంథా అనే తుపాను పడగ విప్పిందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తా కథనాలు, ప్రభుత్వ అప్రమత్తత, వాతావరణ శాఖ హెచ్చరికల్ని చూస్తున్నాం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఆశిస్తున్న వైఎస్ జగన్, ‘వీకెండ్ రాజకీయం’ అనుకుని అయినా, తాడేపల్లి నివాసానికి వచ్చి వుండాలి కదా.? సరే, రాలేకపోయారు. దానికి వేరే కారణాలు వుండొచ్చు.
‘వస్తున్నారు’ అంటూ ప్రకటన ఇచ్చి, ‘తుపాను కారణంగా విమానాల రద్దు నేపథ్యంలో, జగన్ పర్యటన వాయిదా పడింది’ అని వైసీపీ నుంచి అధికారిక ప్రకటన రావడమేంటో.!
‘రైలు మార్గంలో రాలేరా.? రోడ్డు మార్గంలో రాకూడదా.?’ లాంటి ప్రశ్నలు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియకపోవడమే ఆశ్చర్యకరం.
తుపాను నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం సమీక్షలపై వైసీపీ బురద రాజకీయం
ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంకో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. విడివిడిగా, కలిసి కట్టుగా ‘మోంథా’ తుపాను నేపథ్యంలో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రాణ నష్టానికి అస్సలేమాత్రం ఆస్కారం లేకుండా, తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు సీఎం, డిప్యూటీ సీఎం.
మంత్రులు, కూటమి ప్రజా ప్రతినిథులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూనే, తమ తమ పార్టీ శ్రేణుల్ని సహాయక చర్యల్లో నిమగ్నం చేస్తున్నారు.
కానీ, వైసీపీ మాత్రం సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై ‘బురద రాజకీయం’ ప్రదర్శిస్తోంది. సమీక్షలతో సీఎం, డిప్యూటీ సీఎం కాలయాపన చేస్తున్నారంటూ వెకిలి రాతలు రాస్తోంది.
Also Read: పికిల్స్ బ్యూటీ రమ్య మోక్ష ‘బిగ్ బాస్’తో ఏం సాధించింది.?
వైసీపీ హయాంలో, తుపాన్ల వేళ వైఎస్ జగన్.. సమీక్షల తాలూకు ప్రాధాన్యత ఏంటో అసెంబ్లీ వేదికగానే చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలకైనా వైసీపీ కాస్తో కూస్తో విలువ ఇవ్వాలి కదా.!
వైఎస్ జగన్, ఆంధ్ర ప్రదేశ్‌లో కాకుండా కర్నాటక రాజధాని బెంగళూరులో వుంటుండడంతో, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్, వైసీపీ అధికారిక మీడియా.. విపరీత ప్రవర్తనతో, జగన్ రెడ్డిని రాజకీయంగా నిండా ముంచేస్తున్నాయి.
చిత్రమేంటంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంట్రోల్ చేయలేనంత స్థాయికి ఈ డ్యామేజ్ జరిగిపోయింది.
